చైనా గ్లోబల్ నెం.1: భారత్ రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్‌

  • Published By: sreehari ,Published On : January 27, 2020 / 02:36 AM IST
చైనా గ్లోబల్ నెం.1: భారత్ రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్‌

Updated On : January 27, 2020 / 2:36 AM IST

ఇదంతా స్మార్ట్ ఫోన్ యుగం. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ మార్కెట్ భారీగా విస్తరిస్తోంది. ఒకప్పుడు ఫీచర్ ఫోన్లకు పరిమితమైన ప్రపంచ దేశాల్లో ఒకటిగా ఉన్న భారత్.. స్మార్ట్ ఫోన్ల రాకతో మొబైల్ మార్కెట్ కు ఫుల్ డిమాండ్ పెరిగింది. మార్కెట్లోకి స్మార్ట్ ఫోన్ రావడమే ఆలస్యం.. వెంటనే కొనేందుకు యూజర్లు ఆసక్తి చూపుతున్నారు. ఇండియా మొబైల్ మార్కెట్లోకి చైనా స్మార్ట్ ఫోన్ల రాకతో చౌకైన ధరకే అందుబాటులోకి వచ్చేశాయి. తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లు ఉండటంతో యూజర్లు ఎగబడి కొనేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చైనా స్మార్ట్ ఫోన్ బ్రాండ్లు తమ మార్కెట్ ను విస్తరించాయి. ఇండియాలో కూడా చైనా కొత్త స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి రిలీజ్ కావడంతో స్మార్ట్ వినియోగదారుల్లో మరింత ఆసక్తిని పెంచింది. సరికొత్త ఫీచర్లు యూజర్లను ఆకట్టుకుంటున్నాయి.

కౌంటర్ పాయింట్ రీసెర్చ్ కొత్త రిపోర్టు ప్రకారం.. ప్రపంచంలో రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్‌గా భారత్ అవతరించింది. చైనా స్మార్ట్ ఫోన్ల పుణ్యమాని యూనైటెడ్ స్టేట్స్ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌ను ఇండియా వెనక్కి నెట్టేసింది. చైనా తన స్మార్ట్ ఫోన్ బ్రాండ్లతో గ్లోబల్ లీడర్ గా నంబర్ వన్ ర్యాంకులో నిలిచింది. ఆ తర్వాత రెండో స్థానంలో భారత్ నిలవగా, తర్వాతి స్థానంలో అమెరికా నిలిచింది. 2019లో భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో 158 మిలియన్ల డివైజ్ లను రవాణా చేసినట్టు నివేదిక అంచనా వేసింది. భారత్ రెండో ర్యాంకులో నిలవడానికి చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీదారులే కారణమని చెప్పవచ్చు.

చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజాల్లో షాయోమీ, వివో, ఒప్పో, రియల్ మి తయారీదారులు 2019లో 72శాతం తమ స్మార్ట్ ఫోన్లను ఇండియాకు రవాణా చేశాయి. ఈ చైనీస్ కంపెనీల నుంచి తయారైన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల సిరీస్ లను భారీగా ఇండియాకు రవాణా చేయడంతో దేశీయ స్మార్ట్ ఫోన్ల మార్కెట్ విస్తరించినట్టు నివేదిక తెలిపింది. చైనా ఆధారిత స్మార్ట్ ఫోన్ తయారీదారులకు ఇండియాలో కూడా పాపులారిటీ పెరిగింది. అంతేకాదు.. చైనా స్మార్ట్ ఫోన్లకు కూడా అంతే ఆదరణ పెరిగింది. ఉదాహరణకు చైనా అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మేకర్ షాయోమీకి.. భారత లో అతిపెద్ద మార్కెట్ ఉంది. సొంత దేశమైన చైనాను వెనక్కి నెట్టేసి ఇండియాలోనే తన మార్కెట్‌ను విస్తరించింది.

మరోవైపు ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ కూడా ఇండియాలో తన మార్కెట్ విస్తరించుకుంది. iPhone XR మోడల్ ధర భారీగా తగ్గించడంతో భారత్ లో ఐఫోన్ 11 సిరీస్ డివైజ్ లకు కూడా భారీ గిరాకీ పెరిగింది. సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ మాత్రం 2019లో పెద్దగా ఇండియాలో సక్సెస్ కాలేదు. వాస్తవానికి ఏడాది కాలంలో తమ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో 5 శాతానికి సేల్స్ పడిపోయాయినట్టు నివేదిక వెల్లడించింది.