Gold: రికార్డు స్థాయిలో బంగారంపై పెట్టుబడి.. ఎన్ని వేల కోట్లో, కారణాలు ఏంటో తెలుసా?
వీటి వల్ల కచ్చితమైన రాబడి వస్తుండడం, నిల్వ చేయాల్సిన అవసరం లేకపోవడం..

GOLD
భారత్‌లో సావరిన్ గోల్డ్ బాండ్స్ ఆదరణ చూరగొంటున్నాయి. ఇందులో పెట్టుబడికి భారతీయులు ఉత్సాహం చూపుతున్నారు. ఈ డిమాండ్ డిసెంబరులో (మూడోవిడత) రికార్డు స్థాయిలో 12.1 టన్నుల వరకు పెరిగింది. దీని విలువ రూ.7,505 కోట్లు. అంటే ఇన్వెస్టర్లు రికార్డు స్థాయిలో రూ.7,500 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేశారు.
ఓవైపు ఈక్విటీ మార్కెట్లు రికార్డు స్థాయికి చేరుతున్నప్పటికీ సావరిన్ గోల్డ్ బాండ్స్ డిమాండ్ ఇంతగా పెరగడం గమనార్హం. ఇప్పుడు గోల్డ్ బాండ్స్ మొత్తం కలిపి 134.17 టన్నులు ఉన్నాయి. వాటి విలువ రూ.63,579 కోట్లు.
మ్యూచువల్ ఫండ్స్ గోల్డ్ ఈటీఎఫ్ పథకాలు ప్రారంభించినప్పటి నుంచి డిసెంబరు చివరి వారంలో కస్టడీలో ఉన్న అత్యధిక విలువ రూ.27,326.42 కోట్ల కన్నా ఇప్పుడు నమోదైన విలువ (రూ.63,579 కోట్లు) చాలా ఎక్కువ. బంగారం లాభాలు తెచ్చిపెడుతుండడం, బాండ్ల వడ్డీ తీరు వంటి అంశాలు సావరిన్ గోల్డ్ బాండ్స్‌కు డిమాండ్ పెరగడానికి కారణమయ్యాయని నిపుణులు చెబుతున్నారు.
కారణాలు ఇవే..
బ్యాంకులతో పాటు పోస్ట్ ఆఫీస్‌లలో ఈ బాండ్లు అందుబాటులో ఉంటున్నాయి. కాల పరిమితి ఎనిమిది ఏళ్లుగా ఉంటుంది. వీటి వల్ల కచ్చితమైన రాబడి వస్తుండడం, నిల్వ చేయాల్సిన అవసరం లేకపోవడం, స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో ట్రేడ్ చేసే అవకాశం ఉండడం, రుణ సదుపాయం వంటి సౌకర్యాలు ఉంటుండడంతో భారతీయులు సావరిన్ గోల్డ్ బాండ్స్ వైపు మళ్లుతున్నారు.
Gold Loan : బంగారంపై రుణం తీసుకుంటున్నారా? ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోండి!