చందా కొచ్చర్‌కు షాక్ : దోషిగా తేల్చిన కమిటీ

ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఎండీ, సీఈవో చందా కొచ్చర్‌కు మరో షాక్ తగిలింది. వీడియోకాన్ స్కామ్ కేసులో చందా కొచ్చర్ దోషేనని స్వతంత్ర విచారణలో తేలింది. ఐసిఐసిఐ బ్యాంక్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి తనకు ప్రయోజనం కలిగేలా వ్యవహరించినట్టు జస్టిస్ శ్రీకృష్ణ ప్యానెల్ తేల్చింది. వీడియోకాన్ స్కాం కేసులో ప్రధాన నిందితురాలు మాజీ సీఈవో చందా కొచ్చర్‌పై వచ్చిన ఆరోపణలు నిజమేనని విచారణలో తేలినట్టు ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. కొచ్చర్ రాజీనామాను ‘టర్మినేషన్ ఫర్ కాజ్’ గా భావిస్తూ ఆమెకు బ్యాంకు నుంచి ఇవ్వాల్సిన బోనస్ సహా, ప్రయోజనాలు, ప్రోత్సాహకాలన్నింటిని నిలిపేస్తున్నట్టు బ్యాంక్ ప్రకటించింది.
2008 నుంచి 2013 మధ్య వీడియోకాన్ గ్రూప్ అధినేత వేణుగోపాల్ ధూత్ కంపెనీలు, చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్ కంపెనీల మధ్య పలు ఆర్థిక లావాదేవీలు, యాజమాన్య బదలాయింపులు జరిగినట్టు మార్చి 2018లో వెలుగు చూశాయి. దీంతో ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈవోగా ఉన్న చందా కొచ్చర్ పాత్రపై పలు సందేహాలు తలెత్తాయి. దీంతో కొచ్చర్ 2018 అక్టోబర్‌లో పదవికి రాజీనామా చేశారు. వీడియోకాన్‌కు ఎస్బీఐ నేతృత్వంలోని 20 బ్యాంకుల కన్సార్టియం రూ.40వేల కోట్ల రుణం మంజూరు చేయగా అందులో రూ.3వేల 250 కోట్లు ఐసిఐసిఐ బ్యాంక్ ఇచ్చింది. మార్చి 2012 వరకు రూ.1,730 కోట్ల మేర మోసం చేశారని ఆరోపిస్తూ చందా కొచ్చర్, దీపక్ కొచ్చర్, వేణుగోపాల్ ధూత్, న్యూపవర్ రెన్యువబుల్స్, వీడియోకాన్ ఇండస్ట్రీస్ సంస్థలపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
ఐసీఐసీఐ రెండవ అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు. రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి బీఎన్ శ్రీకృష్ణ నేతృత్వంలోని కమిటీ వీడియోకాన్ రుణ కేసులో క్విడ్-ప్రొ-కో ఆరోపణలపై విచారణ జరిపింది. వీడియోకాన్ సంస్థకు రుణాల కేటాయింపు సందర్భంగా చందా కొచ్చర్ బ్యాంకు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు పేర్కొంది.