కియా కార్ లాంచ్: అనంతలో చంద్రబాబు టూర్ 

  • Publish Date - January 28, 2019 / 02:19 PM IST

అనంతపురం: సీఎం చంద్రబాబు 2019, జనవరి 29వ తేదీ మంగళవారం అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. పెనుకొండ మండలం అమ్మవారిపల్లి దగ్గర ప్రతిష్టత్మకంగా ఏర్పాటైన కియా పరిశ్రమలో…తయారైన మొట్టమొదటి కారు ట్రయల్ రన్‌కు సిద్ధమైంది. కియా కారును చంద్రబాబు లాంచ్ చేయనున్నారు. ప్రతి ఆరు నెలలకు ఓ కొత్త మోడల్ కారును మార్కెట్‌లోకి విడుదల చేసేలా కియా కంపెనీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇందుకు అనుగుణంగా అత్యాధునిక రోబోటెక్ టెక్నాలజీతో యంత్రాలను ఏర్పాటు చేశారు. అనంతపురం కార్మికులు బిగించిన  తొలి” కియా” కారును చంద్రబాబు విడుదల చేసి అందులో ప్రయాణించనున్నారు.

దక్షిణ కొరియాకు చెందిన ఈ సంస్థ అనంతపురం జిల్లా పెనుగొండ మండలం ఎర్రమంచి గ్రామం వద్ద సుమారు 600 ఎకరాల్లో.. రూ. 13 వేల కోట్ల వ్యయంతో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేసింది.  ప్లాంట్ పూర్తి స్ధాయి సామర్ధ్యంలో  పని  చేస్తే దాదాపు మూడువేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన అతి పెద్ద పరిశ్రమ ఇదే కావడం విశేషం.