Layoffs Predictions: 2024లో ఎంత మంది ఉద్యోగాలు ఊడిపోనున్నాయో తెలుసా?

Layoffs Predictions 2024: కంపెనీల్లో నెలకొంటున్న ఆర్థిక ప్రతికూల పరిస్థితులకు తోడు...

Layoffs Predictions: 2024లో ఎంత మంది ఉద్యోగాలు ఊడిపోనున్నాయో తెలుసా?

Layoffs

దేశంలో అసలే నిరుద్యోగం తాండవం చేస్తోంది.. ఆపై దిగ్గజ కంపెనీలు అనేక రకాల కారణాలను చూపుతూ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా, పేటీఎం 1,000 మంది ఉద్యోగులను తొలగించింది. 15 శాతం స్టాఫ్ కాస్ట్‌ను తగ్గించేందుకు తమ ఉద్యోగులను తొలగించినట్లు పేటీఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్‌ చెప్పింది.

దేశంలోని కంపెనీలు, బహుళజాతి సంస్థలు 2023లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియలను పెద్ద ఎత్తున చేపట్టాయి. మూడు రోజుల క్రితమే ఇంటెల్ కంపెనీ కూడా ఇలాంటి ప్రకటనే చేసింది. పరిశోధన, అభివృద్ధి విభాగాల్లో పనిచేసే 235 మంది ఉద్యోగులను తొలగించేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నామని డిసెంబరు 31 నుంచి తొలగింపులు ఉంటాయని ప్రకటించింది.

ఈ ఒకే ఒక్క ఏడాది ఇంటెల్ మొత్తం ఐదు సార్లు ఉద్యోగుల తొలగింపుల ప్రక్రియలను పూర్తి చేసింది. గూగుల్ వంటి ప్రపంచ దిగ్గజ కంపెనీలు సైతం 2023లో వేలల్లో ఉద్యోగులను తొలగించాయి. 2024లోనూ ఇవే పరిస్థితులు రిపీట్ కానున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఏఐ ప్రధాన కారణం

వచ్చే ఏడాది మరింత మంది ఉద్యోగులను తొలగించడానికి ఇప్పటికే కంపెనీలు ప్రణాళికలు వేసుకుంటున్నాయి. కంపెనీల్లో నెలకొంటున్న ఆర్థిక ప్రతికూల పరిస్థితులకు తోడు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కూడా 2024లో చాలా మంది ఉద్యోగాలు కోల్పోవడానికి కారణం అవుతుంది.

కృత్రిమ మేధ సమర్థంగా పనులు చేస్తుండగా ఇక ఉద్యోగులు ఎందుకని చాలా కంపెనీలు భావిస్తున్నాయి. మ్యూజిక్ స్ట్రీమింగ్ దిగ్గజ సంస్థ స్పోటిఫై 1,500 మంది ఉద్యోగులను తొలగిస్తున్నామని ఈ నెల 4న ప్రకటించింది. అందుకు కారణం ఆ సంస్థ ఏఐను బాగా వాడుకలోని తీసుకురావడమే. 2024లో ఏఐ మరింత అభివృద్ధి చెందనుంది.

దీంతో ఉద్యోగుల తొలగింపులు మరింత పెరిగే అవకాశాలు అధికంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. కొన్ని వారాల ముందే డేటామినర్ 20 శాతం సిబ్బందిని తగ్గించింది. 2023లో గూగుల్ 12,000 మంది ఉద్యోగులను తొలగించింది. 2024లో ఏఐ వినియోగం వల్ల 30,000 కంటే అధిక మంది ఒక్క గూగుల్ నుంచే ఉద్యోగాలు కోల్పోతారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. దాదాపు అన్ని టెక్ కంపెనీలు ఏఐను తమ కంపెనీకి అనుగుణంగా అభివృద్ధి చేసుకుంటున్నాయి. దీంతో 2024లో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

AI: 2023లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్‌లో ఎలాంటి మార్పులు వచ్చాయి? 2024లో జరగనున్న అద్భుతాలు ఏంటో తెలుసా?