Maruti New Plant : గుజరాత్‌లో రూ. 35వేల కోట్ల పెట్టుబడితో రెండో ప్లాంట్ ఏర్పాటు చేయనున్న మారుతి సుజుకి..

Maruti New Plant : గుజరాత్‌లో భారీ పెట్టుబడితో మారుతి మరో కొత్త ప్లాంట్ రాబోతోంది. ఆర్థిక సంవత్సరం (FY31) నాటికి భారత మార్కెట్లో దాదాపు 40లక్షల యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని కంపెనీ యోచిస్తోంది.

Maruti Suzuki India to set up new plant in Gujarat with Rs 35k crore investment

Maruti New Plant : ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం, మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ గుజరాత్‌లో కొత్త కార్ల తయారీ ప్లాంట్‌ను నెలకొల్పనుంది. రాష్ట్రంలో రెండో కార్ల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు దాదాపు రూ.35వేల కోట్ల పెట్టుబడి పెట్టనుందని సుజుకి మోటార్ కార్పొరేషన్ (SMC) ప్రెసిడెంట్ తోషిహిరో సుజుకి ఒక ప్రకటనలో వెల్లడించారు.

వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2024 సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుజరాత్‌లో మారుతి రెండో కార్ల తయారీ ప్లాంట్‌ను ఒక మిలియన్ (సంవత్సరానికి 10 లక్షల యూనిట్లు) తయారు చేయగల సామర్థ్యంతో వస్తుందని చెప్పారు. 2030-31 నాటికి ప్లాంట్‌లో కార్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని 4 మిలియన్లకు రెట్టింపు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (MSIL) ఐదవ కార్ల తయారీ ప్లాంట్ ప్రారంభించే ప్రణాళికలను ఇప్పటికే ప్రకటించింది.

Read Also : Maruti Suzuki Jimny Discounts : మారుతి సుజుకి ఐదు డోర్ల జిమ్నీపై భారీ తగ్గింపులు.. 7 నెలల్లోనే ఎంత తగ్గిందంటే?

మారుతి కొత్త ప్లాంట్‌లో కార్యకలాపాలు FY29లో ప్రారంభం కానున్నాయి. తదనంతరం వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 10 లక్షల యూనిట్లకు చేరుకోనుంది. కాకపోతే, ఈ ప్లాంట్ కోసం మొత్తం రూ.35వేల కోట్ల పెట్టుబడిలో భూసేకరణ ఖర్చు మాత్రం లేదని చెబుతోంది. మారుతి కొత్త ప్లాంట్ లొకేషన్, నిర్ణీత సమయంలో ఉత్పత్తి చేయబోయే మోడల్స్ వంటి మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనుంది.

FY25లో తొలి ఎలక్ట్రిక్ మోడల్ ఇవిఎక్స్ ఎస్‌యూవీ :
అలాగే, మారుతీ నాల్గవ ఉత్పత్తి శ్రేణిని కూడా ఏర్పాటు చేస్తుంది. (FY27) నాటికి సుజుకి మోటార్ గుజరాత్ (SMG) ప్లాంట్‌లో రూ. 3,200 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీలు) ఉత్పత్తిని పెంపొందించనుంది. నాల్గవ లైన్ పూర్తవడంతో ఎస్ఎంజీ సౌకర్యం వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ప్రస్తుత 7లక్షల 50వేల యూనిట్ల నుంచి 10 లక్షల యూనిట్లకు పెంచనుంది. దాంతో దేశంలోని గుజరాత్‌లోని కొత్త ప్లాంట్‌తో కలిపి రాష్ట్రంలో మారుతి మొత్తం వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 20లక్షల యూనిట్లకు పెరగనుంది. కార్ల తయారీ సంస్థ తొలి ఎలక్ట్రిక్ మోడల్ (eVX) ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని FY25లో రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.

ఖార్ఖోడాలో మూడో ప్లాంట్ ఏర్పాటు :
మారుతికి పూర్తిగా అనుబంధ సంస్థ అయిన (SMG) డిసెంబర్ 2023లో 3 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని సాధించింది. ఎస్ఎంసీ నుంచి ఎస్ఎంజీని కొనుగోలు చేయడానికి మారుతి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఇటీవల ఆమోదించిన మొత్తం రూ. 12,841.1 కోట్లకు కొనుగోలు చేశారు. ప్రస్తుతం హర్యానాలో మారుతికి రెండు ప్లాంట్లు ఉన్నాయి.

Maruti Suzuki India new plant in Gujarat

అందులో ఒకటి మనేసర్‌లో, మరొకటి గురుగ్రామ్‌లో ఉన్నాయి. మానేసర్ ప్లాంట్‌లో వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 8లక్షల యూనిట్లు, గురుగ్రామ్ ప్లాంట్‌లో 7లక్షల యూనిట్లు ఉన్నాయి. హర్యానాలో కంపెనీ మూడవ ప్లాంట్ ఖార్ఖోడాలో రాబోతోంది. 2025లో 2లక్షల 50వేల యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో కార్యకలాపాలను ప్రారంభిస్తుంది. ఆ తర్వాత మారుతి 10లక్షల యూనిట్లకు పెంచాలని యోచిస్తోంది.

40లక్షల యూనిట్ల మైలురాయి సాధించడమే లక్ష్యం :
ప్యాసింజర్ వాహనాల డిమాండ్ దేశంలో రికార్డు స్థాయికి చేరుకోవడంతో ఆర్థిక సంవత్సరం (FY31) నాటికి భారత మార్కెట్లో దాదాపు 40 లక్షల యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని మారుతి యోచిస్తోంది. గుజరాత్‌లోని ఖార్‌ఖోడా కొత్త ప్లాంట్లు SMG వద్ద నాల్గవ ఉత్పత్తి శ్రేణి 40లక్షల యూనిట్ల మైలురాయిని సాధించడంలో సాయపడతాయని మారుతి రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. అభివృద్ధి చెందుతున్న ఈ దేశంలో భారతీయ కస్టమర్లపై దృష్టి సారించడం ద్వారా వివిధ రకాల స్థిరమైన మొబిలిటీ ఎంపికలను అందిస్తామని కంపెనీ ఎస్ఎంసీ ప్రెసిడెంట్ తోషిహిరో సుజుకి చెప్పారు.

అహ్మదాబాద్‌కు 97కి.మీ దూరంలో SMG ప్లాంట్ :
వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2024లో  ప్రధాని మోదీ బలమైన నాయకత్వం, నిరంతర మద్దతుతో భారత ఆటోమోటివ్ మార్కెట్ నిరంతరం విస్తరిస్తోందని ఆయన పేర్కొన్నారు. తద్వారా భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద మోటారు వాహనాల మార్కెట్‌గా అవతరించిందని అన్నారు. అంతేకాదు.. భారత్‌లో ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచినట్టు చెప్పారు. గత 10 ఏళ్లతో పోలిస్తే.. ప్రస్తుత FY2023-24లో వాహన ఉత్పత్తిలో 1.7 రెట్లు, ఎగుమతి అమ్మకాలు 2.6 రెట్లు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నట్టు తోషిహిరో ఆశాభావం వ్యక్తం చేశారు.

గుజరాత్‌లోని హన్సల్‌పూర్‌లోని SMG ప్లాంట్ అహ్మదాబాద్‌కు 97కిలోమీటర్ల దూరంలో ఉంది. సంవత్సరానికి 7.5 లక్షల కార్లను తయారు చేయగల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్రస్తుతం MSIL జపనీస్ మాతృ సంస్థ సుజుకి మోటార్ కార్పొరేషన్ (SMC) యాజమాన్యంలో ఉన్న SMG ప్లాంట్‌లో ఎంఎస్ఐఎల్ ఇప్పటికే 100శాతం వాటాను కొనుగోలు చేసే ప్రక్రియలో ఉంది.

Read Also : Maruti Suzuki Brezza : 2023లో భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీగా మారుతి సుజుకి బ్రెజ్జా..!