Mukesh Ambani unveils AI brainchild 'Jio Brain' at Reliance AGM ( Image Source : Google )
Reliance AGM Event : ప్రముఖ దేశీయ టెక్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) 47వ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) సందర్భంగా సంస్థ చైర్మన్ ముఖేష్ అంబానీ అనేక సరికొత్త ప్రణాళికలను ప్రకటించారు. జియో బ్రెయిన్ అనే సమగ్ర ఏఐ టూల్‌సెట్‌ను రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. టూల్స్, ప్లాట్‌ఫారమ్‌ల సూట్‌ను జియో బ్రెయిన్ అని పిలుస్తారు. ఈ ఏఐ టూల్ మొత్తం ఏఐ లైఫ్ సైకిల్ కవర్ చేస్తుంది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో పెద్ద ఎత్తున, ఏఐ-రెడీ డేటా సెంటర్‌లను ఏర్పాటు చేసే ప్రణాళికలను కూడా అంబానీ వెల్లడించారు.
దేశవ్యాప్తంగా ఉన్న మా క్యాప్టివ్ లొకేషన్‌లలో మల్టీ ఏఐ ఇన్ఫియరెన్స్ సౌకర్యాలను రూపొందించాలని కూడా ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. పెరుగుతున్న డిమాండ్‌కు తగినట్టుగా వీటిని పెంచుతామన్నారు. రిలయన్స్ ప్రపంచంలోనే అత్యల్ప ఏఐ ఇన్ఫరెన్సింగ్ వ్యయాన్ని సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుందని ఆయన చెప్పారు. ఏఐ అప్లికేషన్లను మరింత సరసమైన ధరకే అందించేలా ప్రముఖ గ్లోబల్ కంపెనీలతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంటామని అంబానీ పేర్కొన్నారు.
జియో బ్రెయిన్ అంటే ఏమిటి?
రిలయన్స్ జియో అంతటా ఏఐ టెక్నాలజీని వేగవంతం చేయడానికి కచ్చితమైన అంచనాలు, కస్టమర్ అవసరాలను అర్థం చేసుకోవడానికి ‘జియో బ్రెయిన్’ సర్వీసును కంపెనీ తీసుకొస్తుందని రిల్ ఛైర్మన్ చెప్పారు. ఇతర రిలయన్స్ ఆపరేటింగ్ కంపెనీలలో ఇదే విధమైన పరివర్తనను అందించడానికి, ఏఐ ప్రయాణాన్ని కూడా వేగంగా ట్రాక్ చేసేందుకు జియో బ్రెయిన్‌ని ఉపయోగిస్తామని తెలిపారు. అతేకాదు.. రిలయన్స్‌లో జియో బ్రెయిన్‌ని ఆవిష్కరించడం ద్వారా ఇతర సంస్థలకు కూడా పవర్‌ఫుల్ ఏఐ సర్వీసు అందించే ప్లాట్‌ఫారమ్‌ను సృష్టిస్తాం” అని అంబానీ అన్నారు.
జియో ఏఐ-క్లౌడ్ :
అంబానీ జియో ఏఐ-క్లౌడ్ సర్వీసు కోసం దీపావళి ఆఫర్‌ను ప్రకటించింది. జియో యూజర్లకు 100జీబీ స్టోరేజీని అందిస్తోంది. “ఈ ఏడాది దీపావళి నుంచి జియో-క్లౌడ్ వెల్‌కమ్ ఆఫర్‌ను ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాం. క్లౌడ్ డేటా స్టోరేజీ, డేటా-ఆధారిత ఏఐ సర్వీసులు ప్రతిచోటా సరసమైన ధరకే అందుబాటులో ఉండేలా పరిష్కారాన్ని అందిస్తాం. జియో యూజర్లకు 100జీబీ ఉచిత క్లౌడ్ స్టోరేజ్, ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్‌లు, ఇతర అన్ని డిజిటల్ కంటెంట్, డేటాను సురక్షితంగా స్టోర్ చేయడం, యాక్సెస్ చేసుకోవచ్చు”అని అంబానీ పేర్కొన్నారు.
“డిజిటల్ అనేది మా ఇంటర్నల్ రీసెర్చ్‌లో మరో ప్రధాన అంశం. 6జీ, 5జీ, ఏఐ-లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, ఏఐ-డీప్ లెర్నింగ్, బిగ్ డేటా, డివైజ్‌లు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, నారోబ్యాండ్-ఐఓటీలో పేటెంట్‌లను దాఖలు చేసాం” అని రిల్ అధినేత చెప్పారు. రిలయన్స్ రాబోయే సంవత్సరాల్లో మరింత విలువను పొందుతుందని హామీ ఇచ్చారు. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిల్ రిలయన్స్ టెలికాం, డిజిటల్ ప్రాపర్టీలను కలిగి ఉన్న జియో ప్లాట్‌ఫారమ్ లిమిటెడ్ (JPL)లో 67.03శాతం వాటాను కలిగి ఉంది.