New Income Tax Bill : టాక్స్ పేయర్లకు పండగే.. కొత్త ఆదాయపు పన్ను బిల్లు.. ITR ఆలస్యంగా దాఖలు చేసినా రీఫండ్ పొందొచ్చు!
New Income Tax Bill : కొత్త ఆదాయపు పన్ను బిల్లు 2025లో సవరణ ప్రకారం.. ఆలస్యంగా రిటర్న్‌లను దాఖలు చేసినా టాక్స్ పేయర్లు రీఫండ్ పొందవచ్చు.

New Income Tax Bill
New Income Tax Bill : టాక్స్ పేయర్లకు గుడ్ న్యూస్.. ఆదాయపు పన్ను బిల్లు 2025 కొత్త వెర్షన్ లోక్‌సభలో ఆమోదం పొందింది. ఈ కొత్త వెర్షన్‌లో (New Income Tax Bill) కేంద్ర ప్రభుత్వం తాజాగా రెండు నిబంధనలను చేర్చింది. పన్ను చెల్లింపుదారులకు భారీ ప్రయోజనం కలుగుతుంది.
ఐటీ బిల్లు మొదటి వెర్షన్ అధ్యయనం తర్వాత పార్లమెంటరీ కమిటీ అందులో 285 సవరణలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. పన్ను చెల్లింపుదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం అనేక సిఫార్సులను ఆమోదించింది.
2026 ఏప్రిల్ 1 నుంచి కొత్త ఐటీ రూల్స్ :
బీజేపీ ఎంపీ బైజయంత్ పాండా నేతృత్వంలోని 31 మంది సభ్యుల పార్లమెంటరీ కమిటీ జూలై 21న ప్రభుత్వానికి సిఫార్సులను సమర్పించింది. ఆ తర్వాత ఆగస్టు 11న లోక్‌సభలో సవరణ తర్వాత ప్రభుత్వం ఆదాయపు పన్ను బిల్లు 2025 కొత్త వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఆదాయపు పన్ను చట్టం ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి రానుంది.
గడువు దాటక ITR ఫైల్ చేస్తే రీఫండ్ వస్తుందా? :
ఆదాయపు పన్ను బిల్లు 2025 కొత్త వెర్షన్ ప్రకారం.. ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఆలస్యంగా దాఖలు చేసినా కూడా రీఫండ్ పొందవచ్చు. పన్ను చెల్లింపుదారులు గడువు తేదీ తర్వాత రిటర్న్ దాఖలు చేసినా వారికి రీఫండ్ వస్తుంది.
ఆదాయపు పన్ను బిల్లు మొదటి వెర్షన్ ప్రకారం.. ఆలస్యంగా రిటర్న్ దాఖలు చేస్తే రీఫండ్ రాదు. తాజాగా ఈ నిబంధనపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో కేంద్రం కొత్త వెర్షన్‌లో ఈ రూల్ సవరించింది. పన్ను చెల్లింపుదారుల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం ఈ సవరణ చేసింది.
ఐటీ బిల్లు కొత్త వెర్షన్‌లో సవరణ (New Income Tax Bill) :
పన్ను రిటర్న్ దాఖలుకు చివరి తేదీ జూలై 31 (2025 సెప్టెంబర్ 15) అని అనుకుందాం. గడువు తేదీ దాటిన తర్వాత కూడా పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయొచ్చు. ఆలస్యంగా రిటర్న్ దాఖలు చేసినందుకు జరిమానాతో పాటు పన్నుపై వడ్డీ చెల్లించాలి.
గత వెర్షన్‌లో చివరి తేదీ తర్వాత రిటర్న్ దాఖలు చేసిన పన్ను చెల్లింపుదారులకు వాపసు లభించదన నిబంధన ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆలస్యంగా ఐటీఆర్ దాఖలు చేస్తే పెనాల్టీలు మాత్రం తప్పక చెల్లించాలి. రీఫండ్ పొందడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనమాట.
పార్లమెంటరీ కమిటీ సిఫార్సులివే :
బైజయంత్ పాండా నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ నిబంధన 263లోని సబ్ క్లాస్ (1)(IX)ని తొలగించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. డైరెక్టర్ మయాంక్ మోహంకా మాట్లాడుతూ.. ప్రభుత్వం పార్లమెంటరీ కమిటీ సిఫార్సును అంగీకరించిందన్నారు. ఇకపై రీఫండ్ ప్రాసెసింగ్ గడువు తేదీలోగా రిటర్న్ దాఖలుతో సంబంధం ఉండదని చెప్పారు. అలాగే, ఆలస్యంగా రిటర్న్‌లు దాఖలు చేసినా కూడా పన్ను చెల్లింపుదారులు రీఫండ్ పొందవచ్చు.
ఇంటి ఆస్తిపై స్టాండర్డ్ డిడెక్షన్ :
ఇంటి ఆస్తిపై స్టాండర్డ్ డిడెక్షన్ లెక్కింపుపై కూడా కమిటీ సూచనలు చేసింది. మున్సిపల్ పన్నును తగ్గించాక స్టాండర్డ్ డిడెక్షన్ లెక్కించాలని పార్లమెంటరీ కమిటీ సలహా ఇచ్చింది. అయితే, కేంద్ర ప్రభుత్వం ఈ సిఫార్సును అంగీకరించింది. ఇప్పుడు ప్రాపర్టీ వాల్యూ నుంచి మున్సిపల్ పన్నును తగ్గించిన తర్వాత స్టాండర్డ్ డిడెక్షన్ కూడా లెక్కిస్తారు అనమాట.