తల్లి మరణంతో వారసత్వంగా వచ్చిన ఓ ఫ్లాట్‌ను రూ.1.45 కోట్లకు అమ్మి, ఆ మొత్తం డబ్బుతో 7 ఇళ్లు కొనుగోలు చేసిన కుమారుడు ఆదాయపన్ను చెల్లించకుండా చట్టబద్ధంగా తప్పించుకున్నాడు. 29 ఏళ్ల న్యాయ పోరాటం తర్వాత, బాంబే హైకోర్టు నాగపాల్ అనే వ్యక్తికి తాజాగా అనుకూలంగా తీర్పు ఇచ్చింది. చట్ట నిబంధనలోని చిన్న భాషా లోపం అతడికి ఎలా సాయపడిందో తెలిపే ఆసక్తికర కేసు ఇది.
నాగపాల్ అనే వ్యక్తి 1990లో మైనర్‌గా ఉన్నప్పుడు అతడి తల్లి మృతి చెందారు. దీంతో తల్లి నుండి ముంబైలో ఒక ఫ్లాట్‌ను నాగపాల్ వారసత్వంగా పొందారు. 1993లో ఆయన లీగల్ గార్డియన్ (చట్టపరమైన సంరక్షకుడు) ఆ ఆస్తిని రూ.1.45 కోట్లకు అమ్మాడు.
“ఇండెక్సేషన్” ( ద్రవ్యోల్బణం ప్రకారం మూలధన లాభాలను సర్దుబాటు చేయటం) తర్వాత, క్యాపిటల్ గెయిన్ రూ.1.08 కోట్లుగా వచ్చింది. నాగపాల్ తరఫున గార్డియన్ ఆ అమ్మకం ద్వారా వచ్చిన మొత్తాన్ని 1995-1997 మధ్య పుణెలో ఏడు “రెసిడెన్షియల్ ప్రాపర్టీస్” (నివాస గృహాలు) కొనడానికి తిరిగి పెట్టుబడిగా పెట్టాడు. ఆ సమయంలో ఉన్న సెక్షన్ 54 కింద మొత్తం రూ.1.08 కోట్ల LTCG (లాంగ్ టైమ్ క్యాపిటల్ గెయిన్) మీద నాగపాల్ పూర్తి పన్ను మినహాయింపును క్లెయిమ్ చేశాడు.
Also Read: ఎవరీ అస్మి ఖరే? ఈ విద్యార్థిని ఏం చేసింది? ఏకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఆహ్వానం
వివాదం ఏంటి? న్యాయ పోరాటం ఎలా జరిగింది?
ఆదాయపు పన్ను శాఖ ఒక సెర్చ్ చేపట్టి, పన్ను నోటీస్ జారీ చేసి, చివరికి మినహాయింపు క్లెయిమ్‌ను అనుమతించలేదు. డిపార్ట్‌మెంట్ వాదన ప్రకారం సెక్షన్ 54 ఒకే రెసిడెన్షియల్ హౌస్ కొనుగోలుకు మాత్రమే వర్తిస్తుంది, అనేక యూనిట్లకు కాదు. దీని పర్యవసానంగా.. మొత్తం క్యాపిటల్ గెయిన్‌పై నాగపాల్ పన్ను చెల్లించాలని అధికారులు అన్నారు.
నాగపాల్ ఈ నిర్ణయాన్ని సవాలు చేశారు. ఈ కేసు పుణెలోని ఆదాయ పన్ను అప్పీలేట్ ట్రైబ్యునల్ నుంచి బాంబే హైకోర్టుకు బదిలీ అయింది. ట్రైబ్యునల్ మొదట ఏడు ఇళ్లలో ఒకదానికి మాత్రమే మినహాయింపు మంజూరు చేసింది. “అన్అమెండెడ్” (సవరణ చేయని) సెక్షన్ 54, ఒక పన్ను చెల్లింపుదారుడు ఒక రెసిడెన్షియల్ ప్రాపర్టీ అమ్మకం ద్వారా వచ్చే క్యాపిటల్ గెయిన్స్‌ను కొత్త రెసిడెన్షియల్ యూనిట్ల కొనుగోలు వ్యయానికి సర్దుబాటు చేయడానికి అనుమతిస్తుందా? అనేదే బాంబే హైకోర్టు ముందు ఉన్న ప్రధాన లీగల్ ప్రశ్న.
బాంబే హైకోర్టు తీర్పు
బాంబే హైకోర్టు 2025, జూలై 22న తుది తీర్పును వెలువరించింది. నాగపాల్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కోర్టు తీసుకున్న నిర్ణయం 2014 సవరణకు ముందు ఉన్న చట్టంలోని సెక్షన్ 54లో ఉపయోగించిన భాషను క్షుణ్ణంగా విశ్లేషించటంపై ఆధారపడి ఉంది.
“ప్రీ-అమెండ్‌మెంట్” (సవరణకు ముందు) ఉన్న చట్టంలో “a residential house” అనే “ఇండెఫినైట్ ఆర్టికల్” (అనిశ్చిత ఉపపదం)ను వాడారు. ఇది 2014 సవరణలో ప్రవేశపెట్టబడిన “one residential house” అనే మరింత పరిమితమైన పదబంధానికి భిన్నంగా ఉందని కోర్టు పేర్కొంది.
“లెజిస్లేచర్” (శాసనసభ) ఉద్దేశం ఎల్లప్పుడూ మినహాయింపును ఒకే ఆస్తికి మాత్రమే పరిమితం చేయడమైతే, “a” నుంచి “one”కి పదాన్ని మార్చాల్సిన అవసరం ఉండేది కాదని కోర్టు వాదించింది. ఈ మార్పు శాసనసభ చేసిన సవరణ, అసలు ఉద్దేశానికి వివరణ కాదని కోర్టు స్పష్టం చేసింది. “a” అనే పదం ఆ ఆస్తి రెసిడెన్షియల్ స్వభావాన్ని వర్ణించడానికి ఉపయోగించే పదం మాత్రమే, యూనిట్ల సంఖ్యపై పరిమాణాత్మక పరిమితి కాదని కోర్టు తేల్చి చెప్పింది.
మద్రాసు హైకోర్టు, కర్ణాటక హైకోర్టు ఇలాంటి తీర్పులను ఇచ్చిన విషయాన్ని బాంబే హైకోర్టు ప్రస్తావించింది. వాటి విశ్లేషణలతో పూర్తిగా ఏకీభవించింది. సెక్షన్ 54 ఒక “బెనెవలెంట్ ప్రొవిజన్” (ప్రయోజనకరమైన నిబంధన), గృహాల కొనుగోలు కార్యకలాపాలను ప్రోత్సహించడానికి ఉద్దేశించిందని, అనేక వివరణలు సాధ్యమైనప్పుడు పన్ను చెల్లింపుదారుడికి అనుకూలంగా ఉదారంగా దీన్ని విశ్లేషించాలని బాంబే హైకోర్టు స్పష్టంగా చెప్పింది.
మొత్తం రూ.1.08 కోట్ల క్యాపిటల్ గెయిన్‌పై పూర్తి పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయడానికి నాగపాల్‌కు కోర్టు అనుమతించింది. దీంతో మునుపటి “అసెస్‌మెంట్ ఆర్డర్స్” (పన్ను అంచనా ఉత్తర్వులు)ను రద్దు చేసింది.
ఈ తీర్పు ప్రాధాన్యం ఏంటి?
ఈ ల్యాండ్‌మార్క్ తీర్పు సవరణ చేయని సెక్షన్ 54 అమలుపై స్పష్టత ఇస్తుంది. శాసనసభ డ్రాఫ్టింగ్‌లో ఒకే పదం కూడా ఎంత ప్రభావం చూపుతుందన్న విషయాన్ని ఈ తీర్పు హైలైట్ చేస్తుంది. 2014 సవరణకు ముందు పన్ను చెల్లింపుదారులు ఒక రెసిడెన్షియల్ ప్రాపర్టీ నుంచి వచ్చే లాభాలను అనేక కొత్త రెసిడెన్షియల్ యూనిట్లలో తిరిగి పెట్టుబడి పెట్టడం ద్వారా పూర్తి LTCG మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చన్న విషయాన్ని ఇది ధ్రువీకరిస్తుంది.
ఈ ప్రత్యేక తీర్పు 2014 పూర్వ కాలం నాటి కేసులకు వర్తించినప్పటికీ, కచ్చితమైన లీగల్ భాష ప్రాముఖ్యతను కూడా స్పష్టం చేస్తోంది. శాసన ఉద్దేశాన్ని విశ్లేషించడంలో న్యాయవ్యవస్థ పాత్రను బలపరుస్తుంది. ఇలాంటి చారిత్రక వివాదాలను పరిష్కరించడానికి ఒక “క్లారిఫైయింగ్ సర్క్యులర్” (వివరణాత్మక సర్క్యులర్) జారీ చేయాలని ఆదాయ పన్ను శాఖకు ఈ కేసు ఒక రిమైండర్‌గా పనిచేస్తుంది.