ఎవరీ అస్మి ఖరే? ఈ విద్యార్థిని ఏం చేసింది? ఏకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఆహ్వానం
దేశానికి అసాధారణమైన సేవలు చేసిన కొంతమంది యువతకు ఈ ఆహ్వానం అందుతుంది.

భారత్ 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోనున్న వేళ రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించే ‘అట్ హోమ్ రిసెప్షన్’లో పాల్గొనడానికి ఓ విద్యార్థిని ప్రత్యేక ఆహ్వానం అందుకుంది. ఛత్తీస్‌గఢ్ భిలాయ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దుర్గ్‌లో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న విద్యార్థిని ఆస్మి ఖరేకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వానం పంపారు.
స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాల సందర్భాలలో రాష్ట్రపతి భవన్‌లో ప్రముఖులను ఆహ్వానించి కలిసే ప్రత్యేక కార్యక్రమమే అట్ హోమ్ రిసెప్షన్. దేశానికి అసాధారణమైన సేవలు చేసిన కొంతమంది యువతకు ఈ ఆహ్వానం అందుతుంది.
Also Read: చిరంజీవితో ఫిలిం ఫెడరేషన్ మీటింగ్.. నేను పెంచుతాను అంటూ మెగాస్టార్..
ఆస్మి తన టీమ్ ‘కోడింగ్ విజార్డ్’తో 2024 స్మార్ట్ ఇండియా హాకథాన్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసి ఈ ఆహ్వానం పొందింది. స్మార్ట్ ఇండియా హాకథాన్ అంటే ప్రభుత్వ, ప్రైవేటు రంగ సమస్యలకు విద్యార్థులు సాంకేతిక పరిష్కారాలను చూపే జాతీయ స్థాయి పోటీ.
ఆస్మి టీమ్ గెయిల్ ఇండియా అనే పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్ కోసం జియో లొకేషన్ ఆధారిత హాజరు వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఈ వ్యవస్థ ఇంటర్నెట్ సదుపాయం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పనిచేస్తుంది. ఉద్యోగుల హాజరును ఆఫ్‌లైన్‌లో నమోదు చేస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో వేగంగా నివేదికలు అందించే సౌకర్యం కల్పిస్తుంది.
ఉపగ్రహం లేదా మొబైల్ సిగ్నల్ ద్వారా ఉద్యోగి ఉన్న ప్రదేశాన్ని గుర్తించి హాజరును నమోదు చేసే విధానమే జియో లోకేషన్. ఆస్మితో పాటు టీమ్‌లో యశ్వర్ధన్ సింగ్, విపిన్ కుమార్ గౌతమ్, ప్రథమ్ సాహు, మయాంక్ దేశ్‌లాహ్రా, జతిన్ కుంజాం ఉన్నారు.
అస్మి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. “నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది నా మొత్తం టీమ్ కష్టానికి వచ్చిన ఫలితం ఇది. నా టీమ్‌కి అభినందనలు. నాకు రాష్ట్రపతిని కలిసే అవకాశం వస్తుంది. దేశానికి సేవ చేసిన అనేక రంగాల వారిని కలవడానికి, వారితో నేర్చుకోవడానికి కూడా అవకాశం వస్తుంది” అని ఆమె తెలిపింది.
సాంప్రదాయం ప్రకారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ 79వ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరించి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మోదీ ఇటీవల తన ప్రసంగం కోసం ప్రజల అభిప్రాయాలు, ఆలోచనలు, సూచనలు అందించాలని దేశ ప్రజలను కోరారు.