Ola Experience Centres
Ola Experience Centres: హైదరాబాద్‌లో D2C (డైరెక్ట్ టు కన్జ్యూమర్) విధానాన్ని మరింత విస్తరిస్తున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో భాగంగా హైదరాబాదులో మరో 2 ఎక్స్‌పీరియన్స్ సెంటర్లను ప్రారంభిస్తున్నట్లు పేర్కొంది. D2C (డైరెక్ట్ టు కన్జ్యూమర్) విధానం అంటే కంపెనీ ఉత్పత్తులు నేరుగా ఆ సంస్థ నుంచి వినియోగదారుడికి చేరడం. మధ్యలో ఇతర దుకాణాలు, వ్యక్తుల జోక్యం ఉండదు.
ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు అంటే కంపెనీ ఉత్పత్తుల గురించి వినియోగదారులు నేరుగా సమాచారాన్ని తెలుసుకునే కేంద్రాలు. అలాగే, ఓలా స్కూటర్ల కొనుగోలుకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడంతో పాటు టెస్ట్ రైడ్, సర్వీసులకు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు. అనంతరం మీకు స్కూటర్ నచ్చితే ఆన్ లైన్లో బుక్ చేసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా వినియోగదారులకు నేరుగా సేవలు అందించాలని ఓలా ఎలక్ట్రిక్ ప్రణాళికలు వేసుకుంది.
Ola Experience Centres
ఇందులో భాగంగానే దేశంలోని పలు నగరాలతో పాటుగా హైదరాబాదులోనూ మరో రెండు కొత్త ఎక్స్‌పీరియన్స్ సెంటర్లను ప్రారంభించింది. అందులో ఒకటి శంషాబాద్ లోని శ్రీనగర్- కన్యాకుమారి హైవే సమీపంలోని మధురా నగర్ కాలనీలో, రెండోది ఏఎస్ రావు నగర్ లోని అంబేద్కర్ నగర్ త్రిమూల్‌ఘెర్రీ-ఈసీఐఎల్ రోడ్ లో ప్రారంభించింది.
ఇంతకు ముందు బేగంపేట్, కూకట్‌పల్లి, సోమాజిగూడ, మాదాపూర్, నాగోల్, మెహదీపట్నం, కర్మాన్‌ఘాట్ లో ఓలా ఎలక్ట్రిక్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్లను ప్రారంభించింది. ఇప్పుడు ప్రారంభించిన రెండింటితో కలిపి హైదరాబాదులో ఉన్న ఈ కేంద్రాల సంఖ్య తొమ్మిదికి చేరింది. ఈ కేంద్రాల ద్వారా కస్టమర్లు ఓలా S1, S1 ప్రో స్కూటర్లను టెస్ట్-రైడ్ చేయడానికి కంపెనీ అవకాశం కల్పిస్తుంది.
కస్టమర్లు ఓలా యాప్ ద్వారా తమ స్కూటర్ల కొనుగోలును ఖరారు చేసుకోవడానికి ముందు వాటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ కేంద్రాల్లో పొందగలుగుతారు. S1, S1 ప్రో మోడళ్లు ఓలాను అగ్రగామి ఎలక్ట్రిక్ టూ-వీలర్ తయారీదారుగా అగ్రస్థానంలో నిలిపిందని ఆ కంపెనీ పేర్కొంది.