జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

  • Publish Date - January 15, 2020 / 03:12 PM IST

జనవరి 31 నుంచి పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.  రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ 31న ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్‌ను కేంద్రం ప్రవేశపెట్టనుంది. బడ్జెట్‌ సెషన్ ను జనవరి 31 నుంచి ఏప్రిల్‌ 3 వరకు రెండు దశల్లో నిర్వహించాలని పార్లమెంటరీ వ్యవహారాలపై క్యాబినెట్‌ కమిటీ (సీసీపీఏ) సిఫార్సు చేసింది.

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు మొదటి విడత బడ్జెట్ సెషన్, మార్చి 2 నుంచి ఏప్రిల్ 3 వరకు రెండవ విడత బడ్జెట్ సెషన్ జరగనున్నాయి.  రెండు దశల మధ్య సాధారణంగా నెల రోజుల విరామం ఉంటుంది. బడ్జెట్‌లో వివిధ శాఖలకు కేటాయించిన నిధులను ఈ కాలంలో పార్లమెంటరీ కమిటీలు పరిశీలిస్తాయి.