Gold Loan : ఫస్ట్ టైమ్ గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా? ఈ 4 విషయాలు గుర్తుంచుకోండి.. లేదంటే భారీ నష్టం తప్పదు!
Gold Loan : మీరు ఫస్ట్ టైమ్ బ్యాంకు నుంచి గోల్డ్ లోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తుంటే.. ముందుగా గోల్డ్ లోన్ల గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవడం బెటర్.. అది ఏంటంటే?
Gold Loans
- బంగారం లోన్ తీసుకునే ముందు ఇవి తప్పక తెలుసుకోండి
- లోన్ మొత్తం చెల్లించిన తర్వాతే మీ బంగారాన్ని తిరిగి పొందొచ్చు
- గోల్డ్ వాల్యూ ఎంత ఉంటే మీకు వచ్చే లోన్ అంతగా పెరుగుతుంది
Gold Loan : డబ్బు అందరికి అవసరమే.. కొన్నిసార్లు ఎమర్జెన్సీలో చేతిలో చిల్లిగవ్వ లేనప్పుడు బంగారం ఉంటే చాలు అంటారు. ఎందుకంటే అదే బంగారం కష్టాల్లో మిమ్మిల్ని ఆదుకుంటుుంది. చాలామంది బంగారాన్ని ఎక్కువగా కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. సమయానికి డబ్బు దొరకనప్పుడు బ్యాంకుల నుంచి పర్సనల్ లోన్లు తీసుకోవచ్చు. అలా కుదరకపోతే గోల్డ్ లోన్లు తీసుకోవచ్చు.
మీ బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టిన తర్వాత పూర్తి లోన్ మొత్తాన్ని చెల్లించాకే బ్యాంకు నుంచి మీ బంగారాన్ని (Gold Loans) తిరిగి పొందగలరు. మీరు ఫస్ట్ టైమ్ గోల్డ్ లోన్ తీసుకోవాలని చూస్తుంటే ముందుగా కొన్ని ముఖ్యమైన విషయాలను తప్పక తెలుసుకోండి.
గోల్డ్ లోన్ ఎంత తీసుకోవచ్చు :
బంగారంపై తీసుకునే లోన్ మొత్తం మీ బంగారం ధరపై ఆధారపడి ఉంటుంది. మీ గోల్డ్ వాల్యూ ఎంత ఎక్కువగా ఉంటే వచ్చే లోన్ మొత్తం అంత ఎక్కువగా ఉంటుంది. అయితే, అవసరమైన దానికన్నా ఎక్కువ అప్పు తీసుకోవాలని కాదు.. మీకు అవసరమైనంత మాత్రమే లోన్ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ లోన్ తీసుకుంటే అధిక వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. అందుకే మీ అర్హతను బట్టి కాకుండా మీ అవసరాలను బట్టి లోన్ తీసుకోండి.
గోల్డ్ లోన్లలో ఇతర ఛార్జీలు :
గోల్డ్ లోన్ కోసం చూస్తుంటే కేవలం తక్కువ వడ్డీ రేటు ఆధారంగా తీసుకోవద్దు. బ్యాంకులు సాధారణంగా బంగారు రుణాలపై 8 శాతం నుంచి 11శాతం వరకు వడ్డీని వసూలు చేస్తాయి. అయితే,అనేక నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCs) 9శాతం నుంచి 18శాతం వరకు వసూలు చేయవచ్చు.
దీనికి అదనంగా, మీరు ప్రాసెసింగ్ ఫీజులు, ఆభరణాల విలువ నిర్ధారణ ఛార్జీలు, రెన్యువల్ ఫీజులు, ఆలస్య చెల్లింపు పెనాల్టీలు కూడా చెల్లించాల్సి రావచ్చు. అందుకే గోల్డ్ రుణంతో వర్తించే ఇతర ఛార్జీలను కూడా తప్పకుండా తెలుసుకోండి.
గోల్డ్ లోన్ పేమెంట్ ప్రాసెస్ :
ప్రతి వ్యక్తి ఆదాయం, ఖర్చులు ఒకేలా ఉండవు.. వేర్వరుగా ఉంటాయి. అందుకే మీ లోన్ పేమంట్ విధానాన్ని చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. కొన్ని ఫైనాన్స్ సంస్థలు నెలవారీ ఈఎంఐ ఆప్షన్లను అందిస్తున్నాయి. మరికొన్ని లోన్ డెడ్ లైన్ లోగా అసలు మొత్తాన్ని ఒకేసారి చెల్లించమని కోరతాయి. అందుకే మీ ఆదాయం, ఖర్చుల ఆధారంగా మీ లోన్ పేమెంట్ ఆప్షన్ ఎంచుకోవడం బెటర్.
అన్ని రూల్స్ తప్పక తెలుసుకోండి :
గోల్డ్ లోన్ తీసుకునే ముందు మీ ఆభరణాలను ఎక్కడ? ఎలా భద్రపరుస్తారో తప్పకుండా తెలుసుకోండి. అలాగే, మీ ఆభరణాలకు బీమా ఉంటుందో లేదో కూడా అడగండి. అలాగే, లోన్ ముందుగానే క్లోజ్ చేస్తే ఏవైనా అదనపు ఛార్జీలు ఉంటాయో లేదో తప్పకుండా కనుక్కోండి.
ఒకవేళ ఏదైనా కారణంతో మీరు లోన్ సకాలంలో తిరిగి కట్టలేకపోతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనల ప్రకారం వేలం ప్రక్రియ పారదర్శకంగా ఉండాలి. వేలం తర్వాత బకాయి ఉన్న మొత్తాన్ని కట్ చేసుకుని మిగిలిన మొత్తాన్ని రుణగ్రహీతకు తిరిగి ఇచ్చేస్తారు.
