RBI Governor Sanjay Malhotra
RBI new notes: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక ప్రకటన జారీ చేసింది. కొత్త 500 రూపాయల నోట్లను అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. నూతన గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో కూడిన కొత్త రూ.10, రూ.500 నోట్లు త్వరలో జారీ చేసేందుకు చర్యలు చేపట్టినట్లు ఆర్బీఐ ప్రకటించింది. అయితే, ఈ నోట్లు మహాత్మా గాంధీ సిరీస్ లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నోట్ల మాదిరిగానే ఉండబోతున్నాయట.
సుదీర్ఘకాలం పాటు ఆర్బీఐ గవర్నర్ గా శక్తికాంత దాస్ పనిచేశారు. ఇటీవల ఆయన పదవీకాలం పూర్తికావడంతో గతేడాది డిసెంబర్ నెలలో సంజయ్ మల్హోత్రా ఆర్బీఐ నూతన గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. మల్హోత్రా బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజులకే రూ.100, రూ.200 నోట్లను మల్హోత్రా సంతకంతో జారీ చేస్తున్నట్లు ఆర్బీఐ గత నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా.. రూ.10, రూ.500 నోట్లను కూడా కొత్తగా ఆర్బీఐ జారీ చేయనుంది.
కొత్త నోట్లు వస్తున్నాయి.. పాత నోట్లు చెల్లుతాయా అనే డౌట్ పడాల్సిన పనిలేదు. గతంలో జారీ చేసిన అన్ని నోట్లు చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ పేర్కొంది. ఆర్బీఐ చరిత్రలో ఇదొక సాధారణ పద్దతి. ఎందుకంటే కొత్త గవర్నర్ నియామకం తరువాత కరెన్సీ నోట్లపై సంతకం అప్ డేట్ అవుతుంది. కొత్తగా వచ్చే నోట్లు బ్యాంకులు, ఏటీఎంలు, సాధారణ లావాదేవీల ద్వారా క్రమంగా ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. పాత నోట్లుకూడా చెల్లుబాటులో ఉండటం వల్ల ప్రజలు ఎలాంటి ఆందోళన పడాల్సిన పనిలేదని ఆర్బీఐ అధికారులు సూచించారు.