Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. ఇళ్లు త్వరగా పూర్తి చేయడానికి ప్రభుత్వం కొత్త ప్లాన్
తొలి దశలో ఇళ్లు మంజూరి అయిన లబ్ధిదారులు త్వరగా తమ ఇంటి నిర్మాణాలు పూర్తిచేసేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Indiramma Housing Scheme
Indiramma Indlu: రాష్ట్రంలోని అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఈ క్రమంలో తొలి విడతలో ప్రభుత్వం 72వేల మంది లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. వారిలో 12వేల మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. అందులో 500 మంది బేస్మెంట్ స్థాయి వరకు పనులు పూర్తి చేశారు. అయితే, బేస్మెంట్ స్థాయి ముగిసిన వెంటనే తొలి విడతలో రూ.లక్ష నగదును లబ్ధిదారుల అకౌంట్లలో వేస్తామని ప్రభుత్వం చెప్పింది.
తొలి దశలో నగదు లబ్ధిదారుల ఖాతాల్లో జమ కావాలంటే అసిస్టెంట్ ఇంజనీర్లు తనిఖీ చేసి బేస్మెంట్ పూర్తయిందని సర్టిఫై చేయాల్సి ఉంటుంది. దీంతో తాజాగా తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇళ్ల తనిఖీ బాధ్యతను ప్రభుత్వం ప్రైవేట్ ఇంజనీర్లకు అప్పగించేందుకు చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతం 125 మంది ఇంజనీర్లు సహా కొత్తగా ఔట్ సోర్సింగ్ పద్దతిలో ఇంజనీర్లును తీసుకొని ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
Also Read: HCU Lands Dispute : హెచ్‌సీయూ భూముల వివాదం.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం, రంగంలోకి మంత్రుల బృందం..
తొలుత 390 మందిని ఔట్ సోర్సింగ్ పద్దతిలో నియమించుకునేందుకు మేన్ పవర్ సప్లయర్స్ కు ప్రభుత్వం బాధ్యత అప్పగించింది. అందుకు నోటిఫికేషన్ సైతం జారీ అయింది. ఈ నెల 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఎంపికైన వారు గృహనిర్మాణ శాఖ పరిధిలో ఔట్ సోర్సింగ్ పద్దతిలో పనిచేయాల్సి ఉంటుంది. తొలుత వీరితో ఒక సంవత్సరం ఒప్పందం చేసుకుంటారు. వీరికి నెలకు రూ.33,800 చొప్పున చెల్లించనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఉన్నవారితోపాటు కొత్తగా విధుల్లో చేరేవారితో తనిఖీల ప్రక్రియను వేగంగా పూర్తి చేయించి లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం దశల వారీగా డబ్బులు జమ చేయనుంది.