Starlink India : గెట్ రెడీ.. స్టార్‌లింక్ వచ్చేస్తోందోచ్.. ‘శాటిలైట్ ఇంటర్నెట్’ కనెక్షన్ నెలకు జస్ట్ ఎంతంటే? ఫుల్ డిటెయిల్స్
Starlink India : స్టార్‌లింక్ ఇండియా ఎంట్రీకి రెడీగా ఉంది. ఈ కంపెనీ మేఘాలయ ప్రభుత్వంతో డీల్ కూడా కుదుర్చుకుంది. అతి త్వరలో సేవలు ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Starlink India
- అతి త్వరలో ప్రారంభం కానున్న స్టార్ లింక్ ఇండియా
- కేంద్ర ప్రభుత్వంతో ఎలన్ మస్క్ కంపెనీ సుదీర్ఘ చర్చలు
- మేఘాలయ ప్రభుత్వంతో కుదిరిన భారీ డీల్
Starlink India : భారత్‌కు స్టార్‌లింక్ వచ్చేస్తోంది.. అతి త్వరలోనే దేశంలో స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఎలన్ మస్క్ కంపెనీ ఇటీవలే మేఘాలయ ప్రభుత్వంతో కీలక డీల్ కుదుర్చుకుంది. డీల్ ప్రకారం.. స్టార్‌లింక్ ఇండియా రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు శాటిలైట్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందిస్తుంది.
ఈ శాటిలైట్ సర్వీసులకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వ అనుమతులు లేకపోవడంతో ఆలస్యం జరుగుతోంది. అధికారిక సర్వీసులు ప్రారంభం కానప్పటికీ, ఈ సంస్థ గత కొన్ని నెలలుగా దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసులపై ట్రయల్స్ నిర్వహిస్తోంది. రాబోయే రోజుల్లో అధికారికంగా స్టార్‌లింక్ సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
స్టార్‌లింక్ డీల్ ఇదే :
మేఘాలయ ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం ప్రకారం.. స్టార్‌లింక్ ఇండియా శాటిలైట్ ఆధారిత టెక్నాలజీని ఉపయోగించి హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందిస్తుంది. ఈ సర్వీసుతో విద్య, ఆరోగ్య సంరక్షణ, భద్రత, విపత్తు నిర్వహణకు ప్రయోజనకరంగా ఉంటుంది. మేఘాలయ కన్నా ముందే మహారాష్ట్ర ప్రభుత్వం, ఆధార్ యూఐడీఏఐ (UIDAI) కూడా డిజిటల్ ప్రొగ్రామ్స్ కోసం స్టార్‌లింక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి.
స్టార్‌లింక్ ఇండియా లైసెన్స్ :
భారత మార్కెట్లో కార్యకలాపాల కోసం స్టార్‌లింక్ లైసెన్స్ పొందింది. ఇండియన్ నేషనల్ స్పేస్ ఆథరైజేషన్ అండ్ ప్రమోషన్ సెంటర్ (IN-SPACe) ఈ లైసెన్స్‌ను మంజూరు చేసింది. ఈ లైసెన్స్ ద్వారా భారత భూభాగంపై స్టార్‌లింక్ జెన్1 కాన్స్టలేషన్ సామర్థ్యాన్ని వినియోగించుకోవచ్చు.
ఈ లైసెన్స్ 5 ఏళ్ల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. అమెరికన్ బిలియనీర్ ఎలన్ మస్క్ యాజమాన్యంలోని ఈ కంపెనీ గత ఏడాదిలో అక్టోబర్ 30, 31 తేదీలలో ముంబైలో సేవలను ప్రదర్శించింది. స్టార్‌లింక్ బెంగళూరులోని భారత ప్రధాన కార్యాలయం కోసం ఉద్యోగులను కూడా నియమించుకుంది.
భారత్‌లో స్టార్‌లింక్ కనెక్షన్‌కు ఖర్చు ఎంత? :
భారత మార్కెట్లో వినియోగదారులు స్టార్‌లింక్ కనెక్షన్ కోసం ఒకేసారి రూ. 30,000 నుంచి రూ. 35,000 సెటప్ ఖర్చు చెల్లించాల్సి ఉంటుందని అంచనా . ఆ తర్వాత నెలవారీ ప్లాన్ కోసం రూ. 3,500 నుంచి రూ.8,000 చెల్లించాల్సి ఉంటుంది. దాంతో ఈ స్పీడ్ 25Mbps నుంచి 225Mbps మధ్య ఉంటుందని అంచనా.
అసలు సమస్య ఇదే :
భారత మార్కెట్లో స్టార్‌లింక్ తన సర్వీసులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. నివేదికల ప్రకారం.. స్పెక్ట్రమ్ కేటాయింపు, ధరలకు సంబంధించిన సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. ఈ విషయం ప్రస్తుతం టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) పరిశీలనలో ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తే.. భారత్ స్టార్‌లింక్ సేవల ప్రారంభానికి మార్గం సుగమమవుతుంది.
