బ్యాంకుల లోన్ మేళా : 9 రోజుల్లో రూ.81వేల 700 కోట్లు పంపిణీ

  • Published By: sreehari ,Published On : October 14, 2019 / 12:38 PM IST
బ్యాంకుల లోన్ మేళా : 9 రోజుల్లో రూ.81వేల 700 కోట్లు పంపిణీ

Updated On : October 14, 2019 / 12:38 PM IST

లోన్ మేళాల్లో భాగంగా ప్రభుత్వ బ్యాంకులు 9 రోజుల్లో రూ.81వేల 781 కోట్లు పంపిణీ చేసినట్టు ఆర్థిక కార్యదర్శి ఒకరు తెలిపారు. అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 9వ తేదీ వరకు బ్యాంకులు విడతల వారీగా కోట్లాది నగదును బట్వాడా చేసినట్టు ఆయన చెప్పారు. దేశంలో ఆర్థిక వృద్థి పెంపునకు సంబంధించి చర్చించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వ బ్యాంకుల నిర్వాహణ అధికారులతో సమావేశమైన తర్వాత ఫైనాన్షియల్ సెక్రటరీ మీడియాతో మాట్లాడారు. పీఎస్ బీలన్నీ తమ రెగ్యులేటరీ మూలధన స్థాయిని కొనసాగిస్తున్నాయని సెక్రటరీ తెలిపారు.

లోన్ మేళాలో భాగంగా ప్రభుత్వ బ్యాంకులు వివేకవంతమైన నిబంధనలను పాటిస్తున్నట్టు పేర్కొంటూ కొత్త పారిశ్రామికవేత్తలకు రూ.34వేల 342 కోట్లను పంపిణీ చేసినట్టు ఆయన చెప్పారు. బ్యాంకుల్లో తగినంత ద్రవ్యత్వం కలిగి ఉన్నాయని, పెద్ద కార్పొరేట్ ద్వారా మిగులు చెల్లింపులను సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSME)రంగాలకు తగిన చెల్లింపులు అందేలా చూసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని నిర్మలా అన్నారు.

చిన్న వ్యాపారాలకు ద్రవ్యత్వాన్ని నిర్ధారించేందుకు పెద్ద సంస్థల నుంచి చెల్లింపులకు వ్యతిరేకంగా ఎంఎస్ఎంఈ రంగానికి బిల్ డిస్కౌంటింగ్ ఫెసిలిటీ అందించాలని బ్యాంకులను కోరినట్టు ఆమె చెప్పారు. మందగించిన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం లోన్ మేళా అనే ఒక మార్గంగా ఎంచుకుంది. మరో లోన్ మేళా దీపావళి పండగ సందర్భంగా అక్టోబర్ (21-25) నుంచి ప్రారంభం కానుంది.