టాటా ట్రస్టులకు భారీ ఊరట

Tax Tribunal Tax-Exempt Status : టాటా ట్రస్టులకు భారీ ఊరట లభించింది. టాటా సన్స్ వాటాలను ఉన్నాయని ‘పన్ను మినహాయింపు హోదా రద్దు’ చేయాలని కోరిన ఆదాయపు పన్ను శాఖ ఉత్తర్వులు రద్దు అయ్యాయి. మూడు టాటా గ్రూప్ ట్రస్టుల పన్ను మినహాయింపు హోదాను ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ (ITAT) సమర్థించింది. ఆదాయపు పన్ను శాఖ మార్చి 2019లో జారీ చేసిన ‘పన్ను మినహాయింపు హోదా రద్దు’ ఉత్తర్వులను కొట్టివేసింది. దీనికి సంబంధించి ITAT ముంబై బెంచ్ ప్రెసిడెంట్ జస్టిస్ పీపీ భట్, వైస్ ప్రెసిడెంట్ ప్రమోద్ కుమార్ మూడు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. రతన్ టాటా ట్రస్ట్, JRD టాటా ట్రస్ట్, దొరాబ్జీ టాటా ట్రస్ట్‌కు అప్పీలేట్ ట్రిబ్యునల్ నుంచి భారీ ఊరటనిచ్చింది.
టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ టాటాసన్స్‌లో ఈ మూడు ట్రస్టులకూ 66 శాతం వాటాలు ఉన్నాయి. 2019లో ఆదాయపు పన్ను శాఖ ఇచ్చిన రూలింగ్‌లో ఎటువంటి మెరిట్స్ లేవని ఈ ఉత్తర్వుల్లో బెంచ్ అభిప్రాయపడింది. మూడు ట్రస్ట్‌లకూ టాటా సన్స్‌లో వాటాలు ఉన్నాయన్న కారణంగా పన్ను మినహాయింపు రద్దును కోరుతూ ఆదాయపు పన్ను కమిషనర్– మినహాయింపులు (సీఐటీ–ఈ) గత ఏడాది మార్చిలో ఒక రివిజన్ ఉత్తర్వులను ఇచ్చారు. అలాంటి వాటాదారులు ఆదాయపు పన్ను చట్టాలను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. టాటా ట్రస్ట్‌లు CIT-E వాదనలను ఖండిస్తూ ట్రిబ్యునల్‌కు విజ్ఞప్తి చేశాయి.
బాధ్యతల్లో నుంచి తప్పించిన ఎనిమిది వారాల తర్వాత సైరస్ మిస్త్రీ సంబంధిత డాక్యుమెంట్లను ఆదాయపు పన్ను శాఖ అధికారులకు సమర్పించడాన్ని ట్రిబ్యునల్ తప్పుపట్టింది. ఈ ఉత్తర్వుల జారీకి సంబంధించి టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ సమర్పించిన పత్రాలను పరిశీలనలోకి తీసుకున్నారు. ‘ట్రస్టులో ట్రస్టీలు ఎవరికీ టాటా సన్స్‌లో ఎటువంటి స్వప్రయోజనాలూ లేవు. టాటాసన్స్‌లో పెట్టుబడులు పెట్టి, స్వలాభాలు పొందాలన్న అభిప్రాయం కనిపించడంలేదని పేర్కొంది. కంపెనీ అనుమతి కూడా లేకుండా ఈ పత్రాలను ఆదాయపు పన్ను శాఖకు ఎలా సమర్పిస్తారని ప్రశ్నించింది.
మిస్త్రీ డాక్యుమెంట్ల సమర్పణకు దారితీసిన పరిస్థితులను పరిశీలిస్తే.. తీవ్ర అనుమానాలకు తావిస్తున్నాయని ట్రిబ్యునల్ పేర్కొంది. టాటా సన్స్‌లో 2006 నుంచీ ఆయన డైరెక్టర్‌గా ఉన్నారనీ, 2013 నుంచీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారని ట్రిబ్యునల్ పేర్కొంది. బాధ్యతల నుంచి తొలగించిన వెంటనే తప్పులు ఎలా కనబడతాయని ప్రశ్నించింది. 2013లో టాటా సన్స్ చైర్మన్ రతన్ టాటా వారసునిగా సైరస్ మిస్త్రీ బాధ్యతలు చేపట్టారు. 2017 మార్చిలో జరగాల్సిన పదవీకాలానికి ముందే 2016 అక్టోబర్ 24న గ్రూప్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని టాటా సన్స్ బోర్డ్ తొలగించింది.