SK Hynix-Samsung : 20ఏళ్ల పోరాటానికి రివేంజ్.. 25 ఏళ్ల శాంసంగ్ సామ్రాజ్యాన్ని వణికించిన SK హైనిక్స్ సక్సెస్ స్టోరీ..
SK Hynix-Samsung : పతనమైన చిప్ మేకర్ కంపెనీ కదా చిన్నచూపుచూస్తే చరిత్రనే తిరగరాసింది.. 20ఏళ్ల తర్వాత ఏఐ సాయంతో 25 ఏళ్ల శాంసంగ్ సామ్రాజ్యాన్నే బీటలువారేలా చేసింది..
SK Hynix-Samsung
SK Hynix-Samsung : సౌత్ కొరియా దిగ్గజం శాంసంగ్ ఒకప్పుడు ఎదురులేని రారాజు.. ప్రపంచ ఎలక్ట్రానిక్స్ రంగంలోనే సామ్రాట్.. కానీ, ఇప్పుడు కాదు.. ఆ నెంబర్‌వన్ స్థానాన్ని ఓ చిన్న కంపెనీ కైవసం చేసుకుంది. 2000 ప్రారంభం నుంచి 25 ఏళ్ల పాటు దక్షిణ కొరియా మార్కెట్ ఏలిన శాంసంగ్ ఆధిపత్యానికి ఒక్కసారిగా చెక్ పడింది.
టెక్నాలజీ ప్రపంచం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదని అనేందుకు ఇదే ప్రత్యక్ష ఉదాహరణ.. అలాంటి ఊహించని మలుపే ఇప్పుడు చోటుచేసుకుంది. శాంసంగ్ సామ్రాజ్యం బీటలు వారేలా చేసిన ఆ కంపెనీ ఏంటో తెలుసా? అదే.. ఎస్కే హైనిక్స్ కంపెనీ..
సోమవారం (జూన్ 22) ట్రేడింగ్ సెషన్లో ఉప్పెనలా పెరిగిన షేర్ వాల్యూ ఈ కంపెనీ రాతనే మార్చేసింది. దక్షిణ కొరియా కార్పొరేట్ చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని రాసింది. మార్కెట్ వాల్యూ పరంగా చూస్తే.. శాంసంగ్‌ను తాత్కాలికంగా దాటి దూసుకుపోయింది.
20ఏళ్ల పోరాటానికి రివేంజ్ :
కేవలం అంకెల ఆట కాదు.. 20 ఏళ్ల పోరాటానికి వచ్చిన సింబాలిక్ రివేంజ్ అని చెప్పొచ్చు. పతనం అంచుల దాకా వెళ్లిన ఫీనిక్స్ ప్రయాణం ఒక్కసారిగా కథ మలుపు తిరిగింది. ఒక్క షేర్ వాల్యూతోనే ఈ కంపెనీ దశే మారిపోయింది. ఈ సక్సెస్ వెనుక స్టోరీ అంత ఈజీ కాదు.
ఒకనొకప్పుడు ఎస్కే హైనిక్స్ అంటేనే ఇన్వెస్టర్లు గజగజ వణికేవారు.. 2000 ప్రారంభంలో డీఆర్ఏఎమ్ ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. దాంతో ఈ చిప్ కంపెనీ అప్పుల ఊబిలో చిక్కుకుపోయింది.
ఆర్థిక నష్టాలతో కంపెనీ పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందంటే మాటల్లో చెప్పలేం.. ఒక దశలో ఈ కంపెనీని అమెరికన్ ప్రత్యర్థి మైక్రాన్‌కు అమ్మేయడానికి కూడా డీల్ కుదిరింది. కానీ, చివరి క్షణంలో ఆ డీల్ రద్దు అయింది. ఆ ఒక్క నిర్ణయమే ఇప్పుడు ఎస్కే హైనిక్స్ చరిత్రను తిరిగరాయగలిగింది.
అప్పటి రోజుల్లో ఈ చిప్ కంపెనీ క్రెడిటర్ల చేతుల్లోకి వెళ్లగా యాజమాన్యం కూడా మారిపోయింది. ఇందులో నుంచి హ్యుందాయ్ గ్రూప్ సైతం వాకౌట్ అయింది. అదే సమయంలో హైనిక్స్ ఫ్యూచర్ ఏంటి? అనేది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది.
అసలు కథ మలుపు ఇక్కడే :
ఈ కంపెనీ పూర్తిగా దివాలా తీసినట్టే అనే ప్రచారం జోరుగా సాగింది కూడా.. అప్పుడే అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఎస్కే గ్రూప్ ఈ కంపెనీని టేకవర్ చేసింది. స్లోగా కంపెనీ పుంజుకోవడం మొదలుపెట్టింది. అసలైన గేమ్‌చేంజర్ అయింది ఇక్కడే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం మొదలైంది.. అంతే.. ఈ హైనిక్స్ దశ కూడా తిరిగిపోయింది.
ఏఐ విప్లవంతో ప్రపంచానికి ఒక విషయం బోధపడింది. ప్రస్తుతం డేటా కన్నా ప్రాసెస్ చేయగల మెమరీ చిప్స్ విలువే చాలా ఎక్కువ అని తెలిసింది. సరిగ్గా ఈ అవకాశాన్ని ఎస్కే హైనిక్స్ తెలివిగా వాడుకుంది. తన సత్తా ఏంటో ప్రపంచానికి చూపింది. హై-బ్యాండ్‌విడ్త్ మెమరీ (HBM) చిప్స్ తయారీలో ప్రపంచ డిమాండ్ పెరగడంతో ఈ కంపెనీ జాతకమే మారిపోయింది.
ఏకంగా దిగ్గజాల సరసన నిలిచి :
ఈ కంపెనీ నేరుగా ఏఐ దిగ్గజాల సరఫరా గొలుసులోకి చేరిపోయింది. ఎన్విడియా, గూగుల్ వంటి టెక్ జెయింట్స్‌కు ఈ కంపెనీ కీలక భాగస్వామిగా మారిపోయింది. పతనం అంచున నిలిచిన ఈ చిప్ కంపెనీకి ఏఐ అనే ట్యాగ్ యుగానికే ఇంధనం అందించే పవర్ ఇంజిన్‌గా మార్చేసింది.
2025 నాటికి HBM మార్కెట్లో 61శాతం వాటాతో ఎస్కే హైనిక్స్ ఆధిపత్యం సాధించింది. శాంసంగ్ 17శాతం వద్ద మాత్రమే ఆగిపోయింది. ఒకప్పుడు కింగ్ అనిపించుకున్న శాంసంగ్ ఇప్పుడు పోటీని తట్టుకోలేక వ్యూహాలు మార్చుకోవాల్సిన పరిస్థితికి మారిపోయింది. ఇప్పుడు ఈ ప్రశ్న కేవలం ఆ ఒక్క కంపెనీదే కాదు.. టెక్ ప్రపంచంలో తర్వాతి రాజు ఎవరు? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఈ ఒక్క విజయంతో హైనిక్స్ ప్రయాణం ఆగలేదు.. అమెరికా స్టాక్ మార్కెట్లో లిస్టింగ్‌కు కూడా ఎస్కే హైనిక్స్ రెడీ అవుతోంది. నాస్డాక్లో అడుగు పెట్టే ప్రయత్నాలు చేస్తోంది. ఒకప్పుడు అమ్మకానికి రెడీగా ఉన్న ఈ చిప్ కంపెనీ ఇప్పుడు ప్రపంచ ఏఐ విప్లవాన్ని నడిపించే శక్తిగా మారడం టెక్ దిగ్గజ కంపెనీలను సైతం నివ్వెరపోయేలా చేస్తుంది.
