Gold
బంగారం ధర రోజురోజుకీ పెరుగుతున్నప్పటికీ దానిని కొనుగోలు చేసే వారి సంఖ్యలో మాత్రం మార్పు లేదంటే పసిడి అంటే ప్రజలకు ఎంత పిచ్చో అర్థం చేసుకోవచ్చు. కొంతమంది స్టేటస్ కోసం కొనుగోలు చేస్తే, మరికొందరు భవిష్యత్తులో అవసరాల కోసం కొనుగోలు చేస్తారు.
కారణం ఎలాంటిదైనా కొనడం మాత్రం ఆపరు మన ఇండియాలో. ఒక కామన్ మ్యాన్‌కి డౌట్ రావచ్చు.. అసలు బంగారం రేటు పెరిగినప్పటికీ దాని కొనుగోళ్లు మాత్రం ఎందుకు తగ్గడం లేదని. అందుకు కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి.. అవేంటో తెలుసుకోండి.
బంగారం ఎందుకు కొనుగోలు చేస్తాం? కొన్ని ముఖ్యమైన కారణాలు
బంగారం ఒక ‘సురక్షిత ఆస్తి’. ప్రత్యేకంగా ఆర్థిక సంక్షోభాల సమయంలోనూ దీని విలువ స్థిరంగా ఉండటమే కాకుండా మనకు ఆర్థికంగా అవసరాలను తీరుస్తూ ‘ఆర్థిక రక్షణ కవచం’ గా సహాయపడుతుంది. కరెన్సీ విలువ తగ్గినప్పుడు కూడా బంగారం ధర పెరుగుతుంది కాబట్టి చాలా మంది పెట్టుబడిదారులు ‘ఆర్థికపరమైన రిస్క్’ ను తగ్గించేందుకు బంగారాన్ని పెట్టుబడిగా ఇన్వెస్ట్ చేస్తారు.
భారతదేశం, చైనా వంటి దేశాల్లో వివాహాలు, పండుగలు, ఇతర కార్యక్రమాల్లో బంగారం అనేది ఒక ముఖ్యమైన భూమిక పోషిస్తుంది అనే విషయములో ఎలాంటి అనుమానం లేదు. మన ఇండియాలో బంగారం శ్రేయస్సును, అదృష్టాన్ని ఇస్తుందనే నమ్మకంతో చాలా మంది బంగారు లేదా దాని ఆభరణాలను బహుమతిగా లేదా వారసత్వంగా ఇచ్చే సంప్రదాయం ఉంది.
కాగితపు కరెన్సీ నోట్లతో పోల్చితే బంగారం కాలం గడిచినా దీని విలువను కోల్పోదు కాబట్టి ఇది నమ్మదగిన ఆస్తిగా పరిగణించబడుతుంది. అదేవిధంగా బంగారాన్ని ప్రపంచవ్యాప్తంగా సులభంగా కొనుగోలు, అమ్మకం, లేదా మార్పిడి చేయవచ్చు. కాబట్టి బంగారాన్ని ఒక అత్యంత ముఖ్యమైన లిక్విడ్ ఆస్తిగా చూస్తారు.
Also Read: ఓటీటీలకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక.. మీరు కూడా ఆ కంటెంట్ చూస్తున్నారా?
దేశాల మధ్య యుద్ధాలు, కరోనా లాంటి మహమ్మారులు, రాజకీయ అశాంతి, స్టాక్ మార్కెట్ పతనం వంటి సమయంలో బంగారాన్ని ‘భద్రమైన పెట్టుబడిగా’ భావిస్తారు. పాత సినిమాల్లో చూపించినట్టు రాజులు టన్నుల కొద్దీ బంగారాన్నినాగ బంధనం వేసి ఒక ప్రత్యేకమైన భవనంలో భద్రపరిచినట్లు.. చాలా దేశాలు కూడా బంగారాన్ని టన్నుల కొద్దీ నిల్వ చేసి తమ ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేస్తున్నాయి.
అంతెందుకు మనం ఒకవేళ ఏదైనా కారణం వల్ల ఉద్యోగం కోల్పోతే, చేతుల్లో డబ్బులు లేకపోతే చాలా మంది ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెడుతున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు బంగారానికి ఉన్న విలువ.
మీకో విషయం తెలుసా..? బంగారానికి మంచి విద్యుత్ వాహకత అనే నేచర్ ని కలిగి ఉండడం వలన ఇప్పుడు బంగారాన్ని అంతరిక్ష పరిశోధన సంస్థలో, అలాగే కొన్ని ముఖ్యమైన ఎలక్ట్రానిక్స్ తయారీలో ఉపయోగిస్తున్నారు. ప్రపంచంలో బంగారం పిచ్చి ఉన్న వాళ్లు ఏదో కారణం వల్ల వాళ్ల పళ్లు ఊడిపోతే వాటిస్థానంలో బంగారం పళ్లు పెట్టుకుంటున్నారు.
చాలా మంది బంగారాన్ని ‘ఫ్యాషన్ స్టేట్‌మెంట్’ గా లేదా తమ దగ్గర చాలా డబ్బు ఉందని చూపించుకోవడానికే విలాసవంతమైన ఆభరణాలు, అలాగే ఆఖరుకు బాత్రూం ఇంటీరియర్ డిజైన్ లో కూడా బంగారాన్ని ఉపయోగిస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు.
తరాలు మారిన, కాలాలు మారినా, భయంకరమైన యుద్ధాలు వచ్చినా, ప్రకృతి వైపరీత్యాలు వచ్చి ఆర్థిక నష్టం కలిగినా, దేశంలో విపరీతమైన ఆర్థిక సంక్షేభం వచ్చినా, ఇలా ఎలాంటి కష్టకాలం వచ్చినా బంగారం మీ దగ్గర ఉంటే ఆర్థికంగా మీరు రాజే.