OTT platforms: ఓటీటీలకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక.. మీరు కూడా ఆ కంటెంట్‌ చూస్తున్నారా?

యూట్యూబ్‌లో ‘బీర్‌బైసెప్స్’ ఛానెల్ నిర్వహిస్తూ పాపులర్ అయిన రణ్‌వీర్ అల్లాబాడియా ఇటీవల "తల్లిదండ్రులు శృంగారం చేస్తుండడాన్ని జీవితం మొత్తం చూస్తూనే ఉంటావా" అని అడిగాడు.

OTT platforms: ఓటీటీలకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక.. మీరు కూడా ఆ కంటెంట్‌ చూస్తున్నారా?

Updated On : February 20, 2025 / 7:28 PM IST

ఓటీటీలో పిల్లలు చూడకూడని కంటెంట్‌ విచ్చలవిడిగా వస్తుండడంతో దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. యూజర్ల వయసుకు తగ్గ కంటెంట్‌ను అందించే విషయంలో కఠినంగా వ్యవహరించాలని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రూల్స్‌ 2021కి అనుగుణంగా కంటెంట్‌ ఉండాలని చెప్పింది. ఈ మేరకు ఓటీటీ ప్లాట్‌ఫాంలకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అడ్వైజరీ జారీ చేసింది.

యూట్యూబ్‌లో ‘బీర్‌బైసెప్స్’ ఛానెల్ నిర్వహిస్తూ పాపులర్ అయిన రణ్‌వీర్ అల్లాబాడియా.. ఇటీవల కమెడియన్‌ సమయ్‌ రైనా నిర్వహించిన ‘ఇండియాస్ గాట్ లేటెంట్ షో’ చేసిన కామెంట్స్‌ వివాదాస్పదమైన విషయం తెలిసిందే.

తల్లిదండ్రులు శృంగారం చేస్తుండడాన్ని జీవితం మొత్తం చూస్తూనే ఉంటావా అని అడిగాడు. ఒకసారి చూశాక, లైఫ్ మొత్తం చూడకుండా ఉండగలవా అని వ్యాఖ్యానించాడు. దీంతో అతడిపై కేసు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఓటీటీ కంటెంట్‌పై పలు విషయాలు గుర్తుచేసింది.

ఓటీటీ ప్లాట్‌ఫాంలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ గైడ్‌లైన్స్‌, డిజిటల్ మీడియా, ఎథిక్స్ కోడ్) రూల్స్‌ 2021 కింద కొన్ని నియమాలను పాటించాలని కేంద్ర సర్కారు చెప్పింది.

కేంద్ర సర్కారు చేసిన మరిన్ని సూచనలు ఇవే..
చట్టవిరుద్ధమైన ఏ కంటెంట్‌ను చూపించవద్దు: యూజర్ల వయస్సు (పిల్లలు, టీనేజర్లు, పెద్దల కంటెంట్‌ వంటివి) ఆధారంగా కంటెంట్‌ను స్పష్టంగా లేబుల్ చేయాలి. చట్టవిరుద్ధమైన ఏ కంటెంట్‌ను చూపించవద్దు.

తల్లిదండ్రుల పరిధిలో ఉండేవి: అడల్డ్‌ రేటెడ్ (‘ఏ’) కంటెంట్‌ను పిల్లలు చూడకుండా ఆపడానికి కంట్రోల్స్ (పిన్‌లు వంటివి) వాడాలి.

జాగ్రత్త: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు వారు ప్రసారం చేసే కంటెంట్ గురించి జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా ఉండాలి.

ఫిర్యాదుల పరిష్కారం: కంటెంట్ ఉల్లంఘనల గురించి ఫిర్యాదులను తీసుకోవడానికి, పరిష్కరించడానికి ప్రజలకు 3-లెవెల్‌ వ్యవస్థ ఉంది. సురక్షితమైన, బాధ్యతాయుతమైన కంటెంట్ స్ట్రీమింగ్ అయ్యేలా చేయడం దీని బాధ్యత.