మహిళల బంగారాన్ని టార్గెట్ చేసిన కేంద్రం : రసీదు లేకపోతే పన్ను కట్టాలి

నల్లధనం అరికట్టే క్రమంలో డీమానిటైజేషన్ లాంటి సంచలన నిర్ణయం తీసుకున్న మోడీ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అటువంటి నిర్ణయాలు ఏమీ తీసుకోలేదు. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా అటువంటి కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధం అవుతుంది కేంద్రం. ఈ మేరకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రణాళికలు వేస్తున్నట్లుగా తెలుస్తుంది.
అసలు కీలక నిర్ణయం ఏమిటంటే.. కేంద్ర ప్రభుత్వం గోల్డ్ ఆమ్నెస్టీ స్కీమ్‌ను తీసుకుని వచ్చేందుకు సిద్ధం అవుతుంది. ఈ స్కీమ్ అమల్లోకి వస్తే.. నల్ల ధనాన్ని అరికట్టేందుకు కేంద్రం తీసుకున్న రెండో అతిపెద్ద నిర్ణయం ఇదే అవుతుందని అంటున్నారు. మోడీ తొలిసారి ప్రధాని అయిన తర్వాత 2016లో డీమోనిటైజేషన్ నిర్ణయం తీసుకున్నారు.
అయితే రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే అటువంటి కీలక నిర్ణయం కానుంది. అదేంటంటే రశీదులేని బంగారం వివరాలను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించే రేటు ప్రకారం దీనికి పన్ను చెల్లించాలి. కేంద్రం చెప్పినదాని కంటే ఎక్కువ బంగారం ఉంటే వాటికి భారీగా జరిమానా విధిస్తారు.
ఇన్‌కమ్ ట్యాక్స్, ఆమ్నెస్టీ స్కీమ్ మాదిరిగానే గోల్డ్ ఆమ్నెస్టీ స్కీమ్ కూడా నిర్దేశిత కాలం ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఈ కాలంలో బంగారం వివరాలను ప్రభుత్వానికి అందజేయాలి. అప్పుడు జరిమానాతో బయటపడొచ్చు. అదే స్కీమ్ కాలం ముగిసిన తర్వాత రశీదులేని బంగారం ఉంటే మాత్రం కఠిన చర్యలు తీసుకునే విధంగా ఈ చట్టం ఉండబోతుంది. 8 నవంబర్ 2016 తేదీన డీమానిటైజేషన్‌ను మోడీ ప్రకటించారు. ఈ క్రమంలోనే నవంబర్ నెలలో నోట్ల రద్దు ప్రకటించిన రోజే ఈ నిర్ణయం ప్రధాని ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.
భారతదేశంలో బంగారం అనేది మహిళలకు సెంటిమెంట్. ప్రతి ఇంట్లో లక్ష్మీదేవిగా బంగారాన్ని పూజిస్తారు. తరతరాలుగా కరుడుగట్టిన ఈ విధానాన్ని కాదని.. బంగారానికి లెక్కలు చెప్పమంటే మహిళలు చెబుతారా అనేది చూడాలి. ఇది ఏ స్థాయికి వెళుతుంది అనేది కూడా చర్చనీయాంశం అయ్యింది. మహిళలు-బంగారాన్ని విడదీసి చూడలేం. అలాంటి పెద్ద ఇష్యూతో కేంద్రం పెట్టుకోవటం అంటే మోడీ సాహసమే అని చెప్పాలి. ఇంకా అమల్లోకి రాని ఈ స్కీమ్ పై కేంద్రం సీరియస్ గానే చర్చిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.