Nirmala Sitharaman (Image Credit To Original Source)
Union Budget 2026: రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన బుధవారం సమావేశమైన పార్లమెంటరీ అఫైర్స్ క్యాబినెట్ కమిటీ కేంద్ర బడ్జెట్ సమావేశాల తేదీలకు ఆమోదం తెలిపింది. పార్లమెంట్ క్యాలెండర్ ప్రకారం.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1 (ఆదివారం)న కేంద్ర బడ్జెట్ 2026-27ను ప్రవేశపెడతారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇటీవలి కాలంలో బడ్జెట్‌ను ఆదివారం ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి.
సంబంధిత వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. జనవరి 28న పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది. అదే రోజు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. జనవరి 29న కేంద్ర సర్కారు పార్లమెంట్‌లో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టబడుతుంది.
Also Read: Pakistan: ఇదో రకం జెన్ జీ పోరాటం.. పాక్ ఆర్మీని వణికించిన యువకుడి వ్యాసం.. చివరకు..
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 9వ సారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇది స్వాతంత్ర్యం తర్వాత ప్రవేశపెడుతున్న 88వ బడ్జెట్. 2017 నుంచి ఫిబ్రవరి 1 ఉదయం 11 గంటలకు యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టే విధానాన్ని ప్రభుత్వం అనుసరిస్తోంది.
గతంలో వీకెండ్ రోజున కూడా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025 బడ్జెట్‌ను శనివారం ప్రవేశపెట్టారు. మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2015, 2016 కేంద్ర బడ్జెట్‌లను ఫిబ్రవరి 28న శనివారాల్లో ప్రవేశపెట్టారు.
వరుసగా 9 యూనియన్ బడ్జెట్‌లు ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ చరిత్ర సృష్టించనున్నారు. మొత్తం 10 బడ్జెట్‌లు ప్రవేశపెట్టిన మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డుకు ఆమె చేరువ అవుతున్నారు. మొరార్జీ దేశాయ్ 1959 నుంచి 1964 మధ్య 6 బడ్జెట్‌లు, 1967 నుంచి 1969 మధ్య 4 బడ్జెట్‌లు ప్రవేశపెట్టారు.
ఇతర మాజీ ఆర్థిక మంత్రుల్లో పి.చిదంబరం 9 బడ్జెట్‌లు, ప్రణబ్ ముఖర్జీ 8 బడ్జెట్‌లు ప్రవేశపెట్టారు. ఇదిలా ఉండగా జనవరి 7న విడుదలైన ప్రభుత్వ ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ప్రకారం ప్రపంచ సవాళ్లు, టారిఫ్ యుద్ధం నడుమ కూడా 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత వాస్తవ స్థూల దేశీయోత్పత్తి వృద్ధి 7.4 శాతం ఉంటుందని అంచనా. గత ఆర్థిక సంవత్సరంలో ఇది 6.5 శాతంగా ఉంది.