Pakistan: ఇదో రకం జెన్‌ జీ పోరాటం.. పాక్‌ ఆర్మీని వణికించిన యువకుడి వ్యాసం.. చివరకు..

ఆ వ్యాసంలో ఏముంది? దాన్ని ఎందుకు తొలగించారు?

Pakistan: ఇదో రకం జెన్‌ జీ పోరాటం.. పాక్‌ ఆర్మీని వణికించిన యువకుడి వ్యాసం.. చివరకు..

Pakistan Army (Image Credit To Original Source)

Updated On : January 7, 2026 / 6:28 PM IST
  • పాక్‌ పాలక వర్గ తీరుపై వ్యాసం
  • యువతపై ప్రభావాన్ని చూపలేకపోతున్నారు
  • సమాన అవకాశాలు లేవు, పనిచేసే వ్యవస్థలు లేవు
  • అవి ఉంటేనే దేశభక్తి సహజంగా పుడుతుందని వ్యాఖ్య

Pakistan: పలు దేశాల్లో ఇప్పటికే జెన్‌ జీ తిరుగుబాట్ల వల్ల ఎటువంటి విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయో చూశాం. పాకిస్థాన్‌లోనూ ఇటువంటి తిరుగుబాటు వస్తుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పాక్‌కు చెందిన ఓ స్కాలర్‌ రాసిన ఆర్టికల్‌ చూస్తే ఇప్పటికే పాక్‌లో జెన్ జీ తిరుగుబాటు దశను ఎదుర్కొంటోందని అర్థమవుతోంది.

అయితే, ఈ తిరుగుబాటు బయటకు వచ్చింది నిరసనలు, హింస రూపంలో కాదు. ఆలోచనల రూపంలో బయటకు వచ్చింది. అణచివేత ఉన్నప్పటికీ దానికి లొంగిపోవద్దని, మౌనంగా ఉండకూడదని యువతలో ఏర్పడిన ఆలోచనలు, అభిప్రాయాలు స్పష్టంగా బయటపడుతున్నాయి.

ఏం జరిగింది?
అన్ని వార్తా పత్రికల్లో ప్రత్యేకంగా సంపాదకీయ పేజీ (Opposite the editorial page) ఉంటుంది. నిపుణులు, రాజకీయ నాయకులు, వ్యాసకర్తలు వంటివారు తమ అభిప్రాయాలను ఇందులో స్వేచ్ఛగా రాస్తారు.

తాజాగా, ‘ఇటీజ్ ఓవర్’ అనే శీర్షికతో జోరైన్ నిజామానీ అనే పీహెచ్‌డీ స్కాలర్ ఓ వ్యాసం రాశారు. ప్రస్తుతం అతడు అమెరికాలో ఉంటున్నాడు. అతడు రాసిన వ్యాసం జనవరి 1న పాకిస్థాన్‌లోని ప్రముఖ దినపత్రిక ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్‌లో ప్రచురితమైంది.

జోరైన్ రాసిన ఆ వ్యాసానికి పాక్‌ ఆర్మీ దిమ్మతిరిగిపోయినట్లుంది. కొన్ని గంటల్లోనే ఆ వ్యాసాన్ని వెబ్‌సైట్‌ నుంచి ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్‌ తొలగించింది. పాకిస్థాన్ సైన్యం ఒత్తిడి చేయడంతోనే ఆ వ్యాసాన్ని తొలగించారని తెలుస్తోంది.

Also Read: TGSRTC: గుడ్‌న్యూస్‌.. ఈ బస్టాండ్‌ల వద్ద సంక్రాంతికి ప్రత్యేక బస్సులు

ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్‌లో ఆ వ్యాసం కనపడకపోవడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, అప్పటికే ఆ వ్యాసాన్ని డౌన్‌లోడ్‌ చేసిపెట్టుకున్న వారు దాన్ని షేర్ చేస్తున్నారు. ఆ వ్యాసాన్ని రాసిన జోరైన్ నిజామానీని ‘జాతీయ వీరుడు’ అని పిలుస్తున్నారు.

వార్తాపత్రికలపై కూడా పాక్ ప్రభుత్వం సెన్సార్ అమలు చేసిందని పాకిస్థానీలు అంటున్నారు. ఈ వ్యాసం రాసిన జోరైన్ నిజామానీ తల్లీదండ్రులు నటులు. వారే ఫజీలా ఖాజీ, ఖైసర్ ఖాన్ నిజామానీ.

ఆ వ్యాసంలో ఏముంది?
యూనివర్సిటీ ఆఫ్ ఆర్కాన్సాస్ అట్ లిటిల్ రాక్‌లో క్రిమినాలజీలో పీహెచ్‌డీ చేస్తున్న నిజామానీ తన ఆలోచనలకు అక్షరరూపం పోశాడు. పాకిస్థాన్ పాలక వర్గం దేశ యువతపై తమ ప్రభావాన్ని చూపలేకపోతున్నాయని రాశాడు. దేశభక్తి ప్రచారం పేరుతో ప్రభుత్వం ఇప్పిస్తున్న ఉపన్యాసాలు, సెమినార్లు, ప్రచార కార్యక్రమాలు ప్రభావం చూపడం లేదని అతడు పేర్కొన్నాడు.

“అధికారంలో ఉన్న వృద్ధుల విషయానికి వస్తే, ఇక వారి ఆట ముగిసింది. పాఠశాలలు, కళాశాలల్లో ఎన్ని ఉపన్యాసాలు దంచికొట్టినా, దేశభక్తిని బోధించాలన్నా, అది పని చేయడం లేదు” అని అతడు రాశాడు.

ప్రసంగాలు లేదా నినాదాల ద్వారా దేశభక్తిని సృష్టించలేమని నిజామానీ వాదించాడు. సైన్యం పేరును ప్రస్తావించకుండా ఈ వాక్యాలను రాశాడు. సమాన అవకాశాలు, మౌలిక సదుపాయాలు, పనిచేసే వ్యవస్థలు, హక్కులపై హామీ లభించినప్పుడే దేశభక్తి సహజంగా పుడుతుందని తెలిపాడు.

“సమాన అవకాశాలు ఉన్నప్పుడు, బలమైన మౌలిక వసతులు ఉన్నప్పుడు, సమర్థంగా వ్యవస్థలు పనిచేసినప్పుడు దేశభక్తి సహజంగా వస్తుంది. ప్రజలకు ప్రాథమిక అవసరాలు అందించి, హక్కులు కచ్చితంగా దక్కేలా చేస్తే.. విద్యార్థులు దేశాన్ని ప్రేమించాలని పాఠశాలలు, కళాశాలల్లో ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉండదు. వారు సహజంగానే ప్రేమిస్తారు” అని అతడు పేర్కొన్నాడు.

ఆ వ్యాసం జెన్ జీ, జెన్ ఆల్ఫాను దృష్టిలో పెట్టుకుని నిజామానీ రాశాడు. రాజకీయాల్లో ఏం జరుగుతుందన్న విషయాలపై వారికి పూర్తిస్థాయి అవగాహన ఉందని పేర్కొన్నాడు.

“ఏం జరుగుతుందో జెన్ జీ, ఆల్ఫా వారికి స్పష్టంగా తెలుసు. దేశభక్తి పేరిట మీ అభిప్రాయాలను వారికి ‘అమ్మే’ ప్రయత్నాలు ఎంత చేసినా, వాటి వెనుక అసలు ఉద్దేశాన్ని వారు స్పష్టంగా చూస్తున్నారు. ప్రజలను సాధ్యమైనంత అజ్ఞానంలో ఉంచాలన్న మీ (ప్రభుత్వ, సైనిక పెద్దల) ప్రయత్నాలను మీరు కొనసాగిస్తున్నప్పటికీ.. ఇంటర్నెట్ వల్ల, మాకు మిగిలిన కొద్దిపాటి విద్య వల్ల మీరు విఫలమయ్యారు.

ప్రజలు ఏం ఆలోచించాలో చెప్పడంలో మీరు విఫలమయ్యారు. వారు తమంతట తాము ఆలోచిస్తున్నారు. మాట్లాడటానికి కొద్దిగా భయపడుతున్నారు, ఎందుకంటే వారు శ్వాస తీసుకోవాలనుకుంటున్నారు” అని అతడు రాశాడు. అంటే, వారు తమ అభిప్రాయాలు బహిరంగంగా వ్యక్తపరిస్తే ప్రమాదం ఎదురయ్యే పరిస్థితి ఉందని భావిస్తూ, జీవించాలన్న భయంతో మౌనంగా ఉండటానికే ఇష్టపడుతున్నారని అర్థం.

“అధికార శక్తులను సవాలు చేయలేమని తెలుసుకుని యువత దేశాన్ని వదిలి వెళ్తున్నారు. గళం ఎత్తి మాట్లాడిన తమ స్నేహితులను అణచివేసిన తీరును చూసి, నిశ్శబ్దంగా వెళ్లిపోవడానికే వారు ఇష్టపడుతున్నారు. తిరిగి చూడాలన్న ఆలోచన లేకుండా వెళ్తున్నారు” అని అతడు అన్నాడు.

వ్యాసం తొలగింపుపై తీవ్ర ఆగ్రహం
ఆ వ్యాసం తొలగింపుతో పాకిస్థాన్ రాజకీయ, మీడియా వర్గాల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ సహా ఆ దేశ మానవ హక్కుల మండలి కూడా వ్యాసం తొలగింపుపై విమర్శలు గుప్పించింది. పౌరుల రాజ్యాంగ హక్కులు, జర్నలిస్టిక్ స్వేచ్ఛ ఎలా ఉందో ఈ తీరు ప్రతిబింబిస్తోందని పాక్‌లో పలు వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి.