Long Term Capital Gain tax ( Image Credit to AI/ Original Source)
Union Budget 2026 : ఫిబ్రవరి 1న కేంద్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 9వసారి బడ్జెట్ సమర్పించనున్నారు. ఈసారి ఆదివారం వచ్చింది. అయితే, సాధారణంగా బడ్జెట్ సమయంలో అనేక భారీ అంచనాలు నెలకొంటాయి.
ప్రజల దగ్గర నుంచి పరిశ్రమల వరకు అన్నింటిపై ఎలాంటి ప్రకటనలు, ఉపశమనాలు ఉంటాయా? అని ప్రతి రంగం ఆశగా ఎదురుచూస్తుంటుంది. బడ్జెట్ లో కొన్ని రంగాలకు భారంగా మారవచ్చు? కొన్ని రంగాలకు ఉపశమనంగా మారవచ్చు. ఇలా ప్రతి ఏడాది ఏదో ఒక రంగంపై ప్రభావం పడుతూనే ఉంటుంది.
అన్ని రంగాల వారికి ఉపశమనం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ తయారు చేస్తుంది. అయితే, ప్రతి ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు పెట్టుబడిదారులు, వాటాదారుల నుంచి ఎక్కువగా వినిపించే డిమాండ్ ఒకటే.. దీర్ఘకాలిక మూలధన లాభాల (LTCG) పన్ను. ఈ పన్నును తొలగించడం లేదా తగ్గించాలంటూ ప్రతిసారి డిమాండ్ చేస్తూనే ఉన్నారు.
ఈసారి బడ్జెట్ 2026 ముందు కూడా ఇదే డిమాండ్ వినిపిస్తోంది. అసలు దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (LTCG) అంటే ఏంటి? పెట్టుబడిదారులు ఎందుకు తగ్గింపు లేదా ఎత్తేయాలని డిమాండ్ చేస్తున్నారు అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఎల్టీసీజీ పన్ను అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ టాక్స్.. దీన్నే దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను అని కూడా అంటారు. సాధారణంగా పెట్టుబడిదారులు దీర్ఘకాలిక పెట్టుబడుల నుంచి వచ్చే లాభాలపై చెల్లించే పన్ను అనమాట. ఒక వ్యక్తి స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్, ఆస్తి లేదా ఇతర ఆస్తిని చాలా కాలం పాటు ఉంచిన తర్వాత విక్రయించి లాభం పొందితే.. ఆ లాభంపై విధించే పన్నును LTCG పన్ను అంటారు.
భారత్‌లో LTCG పన్నును 12 నెలలకు పైగా ఉంచిన తర్వాత వాటాలు లేదా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ల అమ్మకంపై విధిస్తారు. ప్రస్తుత నిబంధనలప్రకారం.. సంవత్సరానికి రూ. 1.25 లక్షలకు పైగా దీర్ఘకాలిక లాభాలపై 12.5 శాతం పడుతుంది. అయితే, స్వల్పకాలిక షేర్లకు సపరేటు పన్ను రేటు వర్తిస్తుంది.
ఈ పన్నుతో అసలు సమస్య ఇదే :
మరో ముఖ్యమైన సమస్య ఏంటంటే.. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోదు. పెరుగుతున్న ధరల కారణంగా పెట్టుబడి వాల్యూ పెరిగినా మొత్తం లాభంపై ఇంకా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కంపెనీలు ఇప్పటికే వాటిపై పన్నులు చెల్లిస్తున్నాయి. డివిడెండ్‌లపై కూడా పన్ను విధిస్తున్నారు. అందుకే చాలా మంది పెట్టుబడిదారులు తమపై రెండు లేదా 3 సార్లు పన్ను విధిస్తున్నారని వాపోతున్నారు.
LTCG పన్ను ఎంతంటే? :
ఎల్టీసీజీ పన్ను నియమాల ప్రకారం.. ప్రతి ఏడదికి రూ. లక్ష వరకు లాభాలపై పన్ను ఉండదు. కానీ, రూ. లక్ష కన్నా ఎక్కువ లాభాలపై 10 శాతం పన్ను పడుతుంది. 2018 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం LTCG పన్నును తిరిగి ప్రవేశపెట్టింది.
ప్రభుత్వ నిర్ణయాన్ని పెట్టుబడిదారులు తప్పుబట్టారు. ఎల్టీసీజీ పన్నులో ఇండెక్సేషన్ ప్రయోజనం కూడా లేదు. తత్ఫలితంగా, రిటైర్మెంట్ ప్లాన్ లేదా పిల్లల విద్య, దీర్ఘకాలిక పెట్టుబడులతో సంపాదించేవారికి ఎల్టీసీజీ పన్ను కారణంగా భారం పడుతుంది.
అందుకే పెట్టుబడిదారులు ఎల్టీసీజీ పన్నును తొలగింపు లేదా తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. దీర్ఘకాలిక పెట్టుబడులకు ఈసారైనా రిలీఫ్ దక్కుతుందా? లేదా ఈ సమస్య వచ్చే బడ్జెట్ వరకు వాయిదా పడుతుందా అనేది ప్రశ్నగా మారింది. ఏదిఏమైనా 2026 కేంద్ర బడ్జెట్‌లో LTCG పన్నుకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేస్తుంది? అది పెట్టుబడిదారులకు ఎలాంటి ఉపశమనం కలిగిస్తుందో లేదో చూడాలి.