“హిందూ వృద్ధిరేటు” అంటే ఏంటి? ప్రధాని మోదీ ఆ పదబంధాన్ని ఇప్పుడు ఎందుకు గుర్తుచేశారు?
"మన నాగరికతకు 'ఉత్పాదకతలేమి, పేదరికం' అనే ట్యాగ్‌ను ఇస్తూ హిందూ వృద్ధిరేటు అనే పదాన్ని వాడుతూ ఇచ్చారు.
Narendra Modi
“హిందూ వృద్ధిరేటు” అనే పదబంధం వలసవాద మనస్తత్వాన్ని ప్రతిబింబించిందని ప్రధాని మోదీ అన్నారు. ఇంతకు ముందు కొన్ని దశాబ్దాల పాటు భారతదేశ ఆర్థిక వ్యవస్థ పనితీరు నెమ్మదిగా ఉండడాన్ని దేశ ప్రజల నమ్మకం, గుర్తింపుతో లింక్ చేశారని చెప్పారు.
భారత్‌లో 2-3 శాతం వృద్ధిరేటు ఉన్న సమయంలో “హిందూ వృద్ధిరేటు” పదాన్ని వాడారని మోదీ హిందుస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో తెలిపారు.
“మన నాగరికతకు ‘ఉత్పాదకతలేమి, పేదరికం’ అనే ట్యాగ్‌ను.. హిందూ వృద్ధిరేటు అనే పదాన్ని వాడుతూ ఇచ్చారు. ఆ కాలంలో హిందూ వృద్ధిరేటు అనే పదాన్ని ఎవరూ మతపరమైనదిగా లేదా మతాలను లక్ష్యం చేసిన పదంగా భావించలేదు” అని మోదీ వ్యాఖ్యానించారు.
“హిందూ వృద్ధిరేటు” అంటే ఏంటి?
హిందూ వృద్ధి రేటు అనే వ్యాఖ్యలో “హిందూ” అనే పదానికి నెగిటివ్‌గా ఏ అర్థమూ లేదు. “హిందూ వృద్ధిరేటు” అనే పదాన్ని మొదటగా వాడినవారు భారత ఆర్థిక శాస్త్రవేత్త రాజ్ కృష్ణ. 1970 దశకంలో భారత వృద్ధిరేటు దీర్ఘకాలికంగా 3.5 శాతమే ఉందని వివరించేందుకు “హిందూ వృద్ధిరేటు” అనే పదాన్ని ఆయన ఉపయోగించారు.
ది న్యూ ఆక్స్‌ఫర్డ్ కంపానియన్ టు ఎకనామిక్స్ ఇన్ ఇండియా గ్రంధం ప్రకారం, ఆర్థికవేత్త రాజ్ కృష్ణ “హిందూ వృద్ధి రేటు” అనే వ్యాఖ్యను ఇలా వివరించారు. “భారతదేశంలో దీర్ఘకాలంగా ఉన్న అతి తక్కువ (3.5 శాతం) వృద్ధి రేటుపై అందరి దృష్టిని మళ్లింపజేయడానికి ఉద్దేశించి వాక్చాతుర్య ధోరణిలో వాడిన ఒక వివాదాస్పద వ్యాఖ్య ఇది”.
ప్రభుత్వాలు మారినా, యుద్ధాలు, కరవు, ఇతర సంక్షోభాలు వచ్చినా ఈ వృద్ధి రేటు స్థిరంగా ఉండడంతో ఆయనకు ఇది సాంస్కృతిక లక్షణంగా అనిపించింది. అందువల్లే ఆ పేరు పెట్టారని వివరించారు.
