why India most valuable startup Byjus collapsed explained here
Byjus Downfall: ఆకాశం నుంచి అధఃపాతాళానికి.. ఎడ్‌టెక్ విప్లవం బైజూస్ దీనస్థితి ఇది. ఆన్‌లైన్ పాఠాలతో కరోనా కాలంలో కొత్త చరిత్ర సృష్టించిన బైజూస్.. ఎంత వేగంగా ఎదిగిందో.. అంతకన్నా వేగంగా దిగజారింది. విద్యార్థులకు మేలిమి భవిష్యత్తు కల్పిస్తామని హామీఇచ్చిన బైజూస్‌కు ఇప్పుడు తన భవితవ్యాన్ని ఎలా చక్కదిద్దుకోవాలో తెలియడం లేదు. సాంకేతికతతో పిల్లలకు పాఠాలు నేర్పించిన బైజూస్.. కార్పొరేట్ కంపెనీలు తనను చూసి గుణపాఠాలు నేర్చుకునే స్థితికి పడిపోయింది. బైజూస్ స్టూడెంట్‌గా ఫీలవ్వడమే గొప్పని భావించేలా మధ్యతరగతి పిల్లలు, తల్లిదండ్రులపై మాయాజాలం ప్రదర్శించిన కంపెనీ.. ఇప్పుడు అంతకంతకూ పడిపోతున్న తన మార్కెట్ వాల్యూను రక్షించే మాయాజాలం కోసం ఎదురుచూస్తోంది. మొత్తంగా బైజూస్‌ది ఓ లేచిపడిన చరిత్ర. బిజినెస్ స్టూడెంట్స్ నేర్చుకోవాల్సిన కథ.
2022 అక్టోబరులో 22 బిలియన్ డాలర్ల విలువున్న బైజూస్ వాల్యూ ఇప్పుడెంతో తెలుసా..? కేవలం ఒక బిలియన్ డాలర్. ఈ విలువ ఏడాదిన్నర కాలంలో బైజూస్ పతనానికే కాదు.. ఆ సంస్థ కోల్పోయిన విశ్వాసానికి, నైతికతకు కూడా నిదర్శనం. బైజూస్ విలువను బిలియన్ డాలర్‌గా నిర్ణయించింది.. ఆ కంపెనీలో వాటా ఉన్న అమెరికా సంస్థ బ్లాక్‌రాక్. ఈ సంస్థ ఆస్తుల మదింపు నిర్వహిస్తుంది. గత ఏడాది మే లో బ్లాక్‌రాక్ 62 శాతం తగ్గించి 8.3 బిలియన్ డాలర్లుగా లెక్కకట్టింది. బ్లాక్‌రాక్‌కు బైజూస్‌లో 1 శాతం కన్నా తక్కువ వాటా ఉంది. గత ఏడాది నవంబరులో ప్రొసస్ బైజూస్ విలువను మూడు బిలియన్ డాలర్లకన్నా తక్కువగా కుదించింది. ప్రొసస్‌కు కంపెనీలో 9.6 శాతం వాటా ఉంది. 2023 ప్రారంభం నుంచి ప్రొసస్ బైజూస్ విలువను తగ్గిస్తూ వచ్చింది.
2022 అక్టోబరుతో పోలిస్తే ఇప్పటి ఒక బిలియన్ డాలర్ వాల్యూ 95 శాతానికి పైగా తక్కువ. బైజూస్ విలువ 22 బిలియన్ డాలర్లుగా ఉన్నప్పుడు భారత్‌లో అత్యంత ఖరీదయిన స్టార్టప్‌లలో ఒకటిగా బైజూస్ నిలిచింది. గత ఏడాది అక్టోబరులో బైజూస్ షేర్ విలువ 209.6 డాలర్లు ఉండగా, 2022లో గరిష్టంగా 4 వేల 660 పలికింది. 2021-2022 మధ్య అంతర్జాతీయంగా ఎన్నో సంస్థలను విలీనం చేసుకుని విలువ పెంచుకున్న బైజూస్.. ఇప్పుడు ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది.
Also Read: బైకుపై అమ్మాయిని ఎక్కించుకుని.. ఒళ్లు తెలియకుండా దూసుకెళ్తూ..
2022లో 40 బిలియన్ డార్ల వ్యయంతో IPOకి వెళ్లాలని భావించిన బైజూస్.. ఆ ఏడాది రష్యా, యుక్రెయిన్ యుద్ధంతో తన ఐపీవోను హోల్డ్‌లో పెట్టింది. మార్కెట్‌లో పరిస్థితులు తారుమారవడంతో ఇన్వెస్టర్లు బైజూస్ ఒత్తిడి పెంచడం మొదలయింది. చూస్తుండగానే బైజూస్ పతనమయింది. పెట్టుబడులు పెంచుకోవడం, బిలియన్ డాలర్లకు చేరిన అప్పుల నిర్వహణ వంటి సవాళ్లు ఎదుర్కొంటోంది. 2022 మార్చి ఆర్థిక సంవత్సరానికి అనుకున్న రెవెన్యూ సాధించడంలో విఫలమమయ్యామని బైజూస్ ఓ ప్రకటన చేసింది. ఏడు నెలల్లోనే కంపెనీ CFO అజయ్ గోయల్ వెళ్లిపోవడం, జూన్‌లో ముగ్గురు కీలక సభ్యులు దూరం కావడం బైజూస్‌పై ప్రభావం చూపాయి.
Also Read: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగ భద్రతకు ముప్పు.. ఐఎంఎఫ్ చీఫ్ వెల్లడి
విదేశీ ద్రవ్యమారకం చట్టాలను ఉల్లంఘించి అక్రమ అమ్మకాలు, అతిక్రమణలు వంటి ఆరోపణలు బైజూస్ ఎదుర్కొంటంది. చట్టాలను ఉల్లంఘించింనందుకు బైజూస్కు ఈడీ నోటీసులిచ్చింది. ఇటీవల జరిగిన బైజూస్ AGMలో కంపెనీ ఆర్థికస్థితిపై అసలు నిజాలు చెప్పాలని ఇన్వెస్టర్లు డిమాండ్ చేశారు. బైజూస్ రోజువారీ వ్యవహారాలకు CEO రవీంద్రన్‌ను దూరంగా ఉంచాలని కొందరు విజ్ఞప్తి చేశారు. భారత క్రికెట్‌కు స్పాన్సర్‌షిప్ చేసిన బైజూస్ 158కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని బీసీసీఐ పిటిషన్ వేసింది. 9362.35 కోట్లకు సంబంధి ఫెమా నిబంధనల ఉల్లంఘన కింద ఈడీ షోకాజ్ నోటీసులిచ్చింది.