యూఎస్‌ఏ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన ప్రమాణ స్వీకార సందర్భంగా “అమెరికా స్వర్ణ యుగం ఇప్పుడు ప్రారంభం అవుతుంది” అని చెప్పారు. అప్పుడు ఎందుకు ఆలా అన్నారో అర్థం కాలేదు కానీ ఇప్పుడు అయితే ఆ విషయం కరెక్ట్ అనిపిస్తుంది. అయితే, మరో అర్థంలో..
ట్రంప్ రెండవసారి ప్రమాణ స్వీకారం చేసిన మొదటి నెలలోనే బంగారం ధరలు రికార్డు స్థాయులను దాటాయి. ఈ సంవత్సరం ఇప్పటివరకు 12 శాతం పెరిగింది, గత సంవత్సరం అయితే రికార్డు స్థాయిలో 27 శాతం పెరిగింది. విశ్లేషకులు తమ అంచనాలను పెంచి, ఇంకా పెరుగుదల ఉంటుందని భావిస్తున్నారు.
బంగారంలో పెట్టుబడులు సాధారణంగా పెట్టుబడిదారులకు స్వర్గధామంగా పరిగణిస్తారు. ఆర్థిక సంక్షోభాలు, ఆర్థిక అస్థిరత సమయంలో పెట్టుబడిదారులు బంగారాన్ని కొనుగోలు చేస్తారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అమెరికా స్టాక్స్ నిరంతరంగా రికార్డులు తిరగరాస్తున్నాయి.. అయినా బంగారం ధరలో స్థిరత్వం అనేది లేదు.
టారిఫ్‌లు అలాగే వలసలపై ట్రంప్ తీసుకునే నిర్ణయాలు భౌగోళికంగా ఉద్రిక్తతలను పెంచే అవకాశం ఉందని పెట్టుబడిదారులు భావిస్తున్నారు. ఈ అనిశ్చితి వల్ల బంగారం డిమాండ్ పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత ఈ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయని అలాగే టారిఫ్‌ల వల్ల వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉండటంతో, బంగారం ధర కూడా పెరుగుతుందని స్విస్ బ్యాంకు కమోడిటీ విశ్లేషకుడు జోవానీ స్టానువో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
అంతేకాక, చాలా దేశాలు తమ స్వంత బంగారం నిల్వలను పెంచుకుంటున్నాయి. 2022 నుంచి ప్రతి సంవత్సరం 1,000 టన్నుల బంగారం చొప్పున కొనుగోలు చేస్తున్నాయి. 2025లో కూడా ఈ కొనుగోలును పెంచేందుకు అవకాశం ఉన్నందున బంగారం ధరలు రానురాను మరింత పెరిగే అవకాశం ఎక్కువని విశ్లేషకులు అంటున్నారు.