కారు బానెట్ పై పోలీసును ఈడ్చుకెళ్లిన డ్రైవర్

  • Published By: murthy ,Published On : December 1, 2020 / 12:24 AM IST
కారు బానెట్ పై పోలీసును ఈడ్చుకెళ్లిన డ్రైవర్

Updated On : December 1, 2020 / 6:00 AM IST

Traffic police dragged on car bonnet for half a Km in Nagpur : ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు కారును ఆపడానికి ప్రయత్నించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ను దాదాపు అర కిలోమీటర్ మేర కారు బానెట్‌పై ఈడ్చుకెళ్లిన ఘటన నాగపూర్ లో జరిగింది.

నాగ్‌పూర్‌లోని సక్కార్దర ప్రాంతంలో ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో ట్రాపిక్ కానిస్టేబుల్ అమోల్ చిదమ్వర్, ఒక సెంటర్లో డ్యూటీలో ఉన్నారు. ఆ సమయంలో అటుగా వెళుతున్నకారు అద్దాలపై బ్లూ ఫిల్మ్ అతికించి ఉండటం చూసి … ఆ కారును ఆపమని సిగ్నల్ ఇచ్చాడు.



అయినా కారు డ్రైవర్ కారు ఆపకుండా ముందుకు దూసుకు వెళ్లబోయాడు. కారు ఆపే ప్రయత్నంలో కానిస్టేబుల్ కారుకు అడ్డంగా రోడ్డు మీద నిలబడ్డాడు. అయినా కారు ఆపకుండా వేగం పెంచాడు డ్రైవర్. దీంతో కానిస్టేబుల్ కారు బానెట్ పై పడి దాన్నిగట్టిగా పట్టుకున్నాడు.

కానిస్టేబుల్ బానెట్ పై పడినప్పటికీ డ్రైవర్ కారును ఆపకుండా అంతే వేగంతో దాదాపు అర కిలోమీటరు దూరం తీసుకువెళ్లాడు. ఈక్రమంలో కొన్ని ద్విచక్ర వాహనాలకు ఢీ కొట్టాడు. అర కిలోమీటరు   వెళ్లాక కారును ఆపగా, స్ధానికులు డ్రైవర్ ను పట్టుకుని చితకబాదారు.



నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు , డ్రైవర్ పాత నేరస్ధుడని గుర్తించారు. అతనిపై అప్పటికే పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. నిందితుడిపై కొత్తగా ఐపీసీ సెక్షన్ 353, 307ల కింద కేసు నమోదు చేశారు.