Murder : టీనేజ్ యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని…..
పెళ్లై భార్య వదిలేసిన వ్యక్తి తమ సోదరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆమె సోదరులిద్దరూ కలిసి ఓ వ్యక్తిని హతమార్చిన ఘటన నాగపూర్ లో చోటు చేసుకుంది.

Two Brothers Killed A Man
Murder : పెళ్లై భార్య వదిలేసిన వ్యక్తి తమ టీనేజ్ సోదరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆమె సోదరులిద్దరూ కలిసి ఓ వ్యక్తిని హతమార్చిన ఘటన మహారాష్ట్రలోని నాగపూర్ లో చోటు చేసుకుంది. నగరంలోని గడ్డిగోదాం ప్రాంతానికి చెందిన కమలేష్ బందు సహారే (27) అనే వ్యక్తికి వివాహం అయ్యి….ఒక కుమార్తె ఉంది. భార్య భర్తల మధ్య అభిప్రాయ బేధాలు వచ్చి భార్య అతడ్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది.
కమలేష్ కుమార్తెతో కలిసి తన తల్లి తండ్రుల వద్ద నివసిస్తున్నాడు. ఈక్రమంలో తమ ఇంటికి సమీపంలోనే ఉండే మహదా కాలనీలోని ఒక టీనేజ్ యువతితో ప్రేమలో పడ్డాడు. ఈ క్రమంలో యువతికి మొబైల్ ఫోన్ బహుమతిగా ఇచ్చాడు. ఆవిషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం చెప్పారు.
వివాహితుడితో ప్రేమ వ్యవహారం ఏంటని కుమార్తెను కట్టడి చేశారు. బాలికతో కలిసి పోలీసు స్టేషన్ లో కమలేష్ పై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 354 ఏ కింద కేసు నమోదు చేసి రెండు వారాల పాటు రిమాండ్ కు తరలించారు.
జైలు నుంచి విడుదలైన తర్వాత కమలేష్ మళ్లీ తన ప్రియురాలి వద్దకు వెళుతున్నాడు. ఇది నచ్చని ఆమె అన్నదమ్ములు కమలేష్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం తమ చెల్లి వద్దకు వచ్చిన కమలేష్ పై కత్తులతో దాడి చేసి హతమార్చారు. పోలీసులు యువతి సోదరులపై ఐపీసీ సెక్షన్ 302, 34 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.