KTR: నిజామాబాద్ జిల్లాపై కేటీఆర్ స్పెషల్ ఫోకస్..! చేరికలతో కవిత సైడ్ అయిపోయినట్టేనా?

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నిజామాబాద్ లోక్ సభ పరిధిలోని ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. (KTR)

KTR: నిజామాబాద్ జిల్లాపై కేటీఆర్ స్పెషల్ ఫోకస్..! చేరికలతో కవిత సైడ్ అయిపోయినట్టేనా?

Updated On : August 28, 2025 / 9:31 PM IST

KTR: అక్క తన పని తాను చేసుకుంటోంది. జాగృతి సొంత పేరుతో సొంత కుంపటి నడుపుకుంటోంది. బీఆర్ఎస్‌కు అంటీముట్టనట్లుగా కాదు….పూర్తి దూరంగానే ఉంటోంది. దీంతో ఇప్పటివరకు కవితక్క కనుసన్నల్లో నడిచిన ఇందూరు పాలిటిక్స్ పై దృష్టి పెట్టారట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నిజామాబాద్ జిల్లాలో పార్టీ పటిష్టత కోసం వరుస చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. రామన్న ఎంట్రీతో ఇందూరు బీఆర్ఎస్‌కు కొత్త జోష్ వచ్చేనా? కొత్త చేరికలతో ఇక కవిత సైడ్ అయిపోయినట్టేనా?

బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై స్పెషల్ కాన్సంట్రేషన్ చేసింది. మొన్నటి ఎన్నికల వరకు ఇందూరు జిల్లా బీఆర్ఎస్ రాజకీయాలన్నీ ఎమ్మెల్సీ కవిత కనుసన్నల్లోనే నడిచాయి. అయితే కొన్నాళ్లుగా కవితకు, బీఆర్ఎస్ కు మధ్య అగాధం ఏర్పడింది. దీంతో ఆమె ఎక్కడా బీఆర్ఎస్ జెండాలు లేకుండా..జాగృతి బ్రాండింగ్ తోనే యాక్టివిటీ నడిపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోకస్ పెట్టారు. జుక్కల్, బాల్కొండ, ఆర్మూర్, బాన్స్ వాడ, బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, డిచ్ పల్లి, ఎల్లారెడ్డిలో..కేవలం రెండు నియోజకవర్గాల్లో మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది. మిగతా ఏడు నియోజర్గాల్లో నాలుగింటిని కాంగ్రెస్, మూడింటిని బీజేపీ కైవసం చేసుకుంది.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై ప్రత్యేక దృష్టి..

బాల్కొండ నుంచి మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండగా..బాన్సువాడ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన పోచారం శ్రీనివాస్ రెడ్డి..కాంగ్రెస్ లో చేరిపోయారు. ఇక ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టింది బీఆర్ఎస్. (KTR)

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇతర పార్టీల నుంచి చేరికలపై బీఆర్ఎస్ సీరియస్ గా వర్కౌట్ చేస్తోంది. అధికార కాంగ్రెస్, బీజేపీ పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలను కారెక్కించుకునేందుకు కసరత్తు చేస్తున్నారు నేతలు. నియోజకవర్గ స్థాయి నేతల నుంచి మొదలు మండల, గ్రామస్థాయి నేతల వరకు అందరితో సంప్రదింపులు జరుపుతున్నారు. ముఖ్యనేతలతో పాటు భారీ సంఖ్యలో కార్యకర్తలను కూడా పార్టీలో చేర్చుకుంటోంది బీఆర్ఎస్ పార్టీ.

స్వయంగా కుండువాలు కప్పుతున్న కేటీఆర్..
బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ లో చేరికల కార్యక్రమం అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలు, కార్యకర్తలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా కుండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. దీంతో వరుస చేరికల కార్యక్రమాలతో బీఆర్ఎస్ పార్టీలో కొత్త జోష్ కనిపిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఉమ్మడి నిజామామాద్ జిల్లాల్లోని ఆర్మూర్, బాల్కొండ నుంచి ముఖ్య నేతలు, కార్యకర్తలను పార్టీలో చేర్చుకుంది గులాబీ పార్టీ. త్వరలోనే బాన్సువాడ సెగ్మెంట్ నుంచి కూడా చేరికలు ఉండబోతున్నాయి. (KTR)

గతంలో కవిత నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. దీంతో ఆమెకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో అంతో ఇంతో పట్టుంది. ఆమె వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నిజామాబాద్ లోక్ సభ పరిధిలోని ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో స్వయంగా కేటీఆర్ పాలిటిక్స్ పై ఫోకస్ చేయడం ఇప్పుడు ఆసక్తిరేపుతోంది.

Also Read: వర్షం కలిపింది ఇద్దరినీ.. షేక్ హ్యాండ్ ఇచ్చుకుని ఆలింగనం చేసుకున్న బండి సంజయ్, కేటీఆర్..