Kerala : చికిత్స చేస్తున్న మహిళా డాక్టర్‌ను పొడిచి చంపిన రోగి
చికిత్స చేయించుకోవటానికి వచ్చిన ఓ రోగి మహిళా డాక్టర్ పై కత్తితో దాడి పాల్పడ్డాడు. కత్తెరతో పొడిచి చంపాడు.

Kerala
Kerala : రోగులకు ప్రాణాలు పోస్తారు డాక్టర్లు. అందుకే డాక్టర్లను దేవుడితో సమానం అంటారు. అటువంటి ఓ డాక్టర్ ని రోగి పొడిచి చంపిన ఘటన కేరళలో జరిగింది. కేరళ(Kerala)లోని కొట్టరక్కర ప్రాంతంలోని తాలుకా ఆసుప్రతిలో చికిత్స చేయించుకోవటానికి వచ్చిన ఓ రోగి మహిళా డాక్టర్ పై కత్తితో దాడి పాల్పడ్డాడు.
కొట్టరక్కరలోని ఆసుపత్రిలో 22 ఏళ్ల మహిళా డాక్టర్ హౌస్ సర్జన్ గా పనిచేస్తున్నారు. ఆమె పేరు వందనాదాస్. రోజులానే బుధవారం (మే 10,2023) డ్యూటీకి వచ్చారు. రోగులకు చికిత్సలు చేస్తున్నారు. కాలి గాయంతో వచ్చిన ఓ వ్యక్తికి డ్రెస్సింగ్ చేస్తున్నారు. ఇరుగు పొరుగువారితో సదరు వ్యక్తికి గొడవ జరగటంతో అతనికి గాయమైంది. దీంతో పోలీసులు అతనిని ఆస్పత్రికి తీసుకొచ్చారు. సదరు నిందితుడికి డాక్టర్ వందన ట్రీట్‌మెంట్ చేస్తుండగా ఒక్కసాగి ఆగ్రహం వ్యక్తంచేశాడు. చికిత్స చేసే ప్రాంతంలో ఉన్న వైద్య పరికరాలు కత్తెర తీసుకుని వాటితో దాడికి దిగాడు. ఏం జరుగుతుందో ఏంటోననే అయోమయంలో ఉండగానే 22 ఏళ్ల డాక్టర్ వందనపై దాడికి దిగాడు. వైద్య పరికరాలతో డాక్టర్ వందనను పొడిచేశాడు. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆమెను తిరువనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనకు ముందు నిందితుడు తన కుటుంబసభ్యులతో ఘర్షణపడ్డాడు. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనికి గాయం అవ్వటంతో చికిత్స నిమిత్తం..వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకువచ్చారు. డాక్టర్ అతనికి చికిత్స చేయటానికి డ్రెస్సింగ్ చేసే రూమ్ లో రోగి తప్ప ఎవ్వరు ఉండకూడదని డాక్టర్ సూచించటంతో తాము బయటే ఉండిపోయామని దీంతో అతను చేసిన దాడిలో డాక్టర్ తీవ్రంగా గాయపడ్డారని చెబుతున్నారు పోలీసులు. సదరు నిందితుడు పేరు సందీప్ అని..ఆ సమయంలో అతను మద్యం సేవించి ఉన్నాడని తెలిపారు. కాగా నిందితుడు సందీప్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు.
డాక్టర్ వందనా దాస్ హత్యపై హైకోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. జస్టిస్ దేవన్ రామచంద్రన్, జస్టిస్ కౌసర్ ఎడప్పగత్ తో కూడిన డివిజన్ బెంజ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. దీనిపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ప్రత్యేక సెషన్ ఏర్పాటు చేసి విచారిస్తోంది. మరోపక్క దీనిపై ఐఎంఏ(IMA) ఆందోళన వ్యక్తం చేసింది. అత్యవసర సేవలకు మాత్రం అంతరాయంరాకుండా 24 గంటలపాటు రాష్ట్రవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది.