24గంటల్లో మరో PMCబ్యాంకు ఖాతాదారుడు గుండెపోటుతో మృతి

మరో పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో ఆపరేటివ్(PMC) బ్యాంకు ఖాతాదారుడు గుండెపోటుతో మరణించాడు. పీఎంసీ బ్యాంకు స్కామ్ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి,ఆర్బీఐ బ్యాంకుపై ఆంక్షలు విధించడం వంటివన్నీ చూసి తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన ఫత్తుమాల్ పంజాబీ ఇవాళ(అక్టోబర్-15,2019)గుండెపోటుతో మరణించాడు. ముంబైలోని ములుంద్ పీఎంసీ బ్రాంచ్ లో ఫతూల్ కి అకౌంట్ ఉంది.
సోమవారం(అక్టోబర్-14,2019)ముంబై కోర్టు బయట ఆందోళనలో పాల్గొని ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే పీఎంసీ బ్యాంకు ఖాతాదారుడు సంజయ్ గులాటి గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. పీఎంసీ బ్యాంకులో తాను డిపాజిట్ చేసిన రూ.90లక్షలు ఇక తిరిగిరావేమోనని ఆందోళనతో కొన్ని రోజులుగా డిప్రెషన్ లో ఉండి గుండె పోటుతో సంజయ్ మరణించాడు. సంజయ్ మరణించిన 24గంటల్లోనే ఫత్తుమాల్ మరణించాడు.
అంతకుముందు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మాట్లాడుతూ… డిపాజిటర్లకు వారి డబ్బు తిరిగి పొందడానికి సహాయం చేయమని కేంద్రాన్ని అభ్యర్థిస్తాము. తాను దీనిపై వ్యక్తిగతంగా దృష్టి పెడతానని ఆయన అన్నారు. ఎంసీ బ్యాంకులో సుమారు 4వేల కోట్ల కుంభకోణం జరిగింది. తన ఆస్తుల విలువ రూ.9,000 కోట్లలో 70 శాతానికి పైగా HDIL అనే రియాలిటీ సంస్థకు బ్యాంకు రుణం ఇచ్చింది. దీన్ని తిరిగి రాబట్టుకోవడంలో విఫలమైంది. పీఎంసీ బ్యాంకు డైరక్టర్లను ఇటీవల ఈడీ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
ఆర్బీఐ ఈ బ్యాంకుపై ఆంక్షలు విదించింది. ఖాతాదారుల డిపాజిట్ల ఉపసంహరణ పరిమితిని తగ్గించింది. పీఎంసీ బ్యాంక్ డిపాజిటర్లు 6 నెలలకు రూ .40,000 కంటే ఎక్కువ మొత్తాన్ని విత్ డ్రా చేసుకోకుండా ఆర్బీఐ ఆంక్షలు పెట్టింది. పీఎంసీ బ్యాంకు ఆన్ లైన్ బ్యాంకింగ్ సిస్టమ్ నిలిపివేయబడింది.డిపాజిటర్లు నెట్ బ్యాంకింగ్ కూడా వాడకుండా చేశారు. ఆర్బీఐ ఆంక్షలు కొనసాగినంతకాలం బ్యాంకు ఎటువంటి కొత్త డిపాజిట్లను తీసుకోకూడదు,రుణాలు ఇవ్వకూడదు.
అయితే భారతీయ స్టేట్ బ్యాంక్ రీక్యాపిటలైజేషన్ కోసం ప్రభుత్వం రూ.16,000 కోట్లు ఇవ్వగలిగినపుడు, పీఎంసీకి ఉద్దీపన ప్యాకేజి ఎందుకు ఇవ్వడం లేదని పీఎంసీ ఖాతాదారులు నిలదీస్తున్నారు. ప్రధాన మంత్రి జోక్యం చేసుకునే వరకు తమ నిరసనలను కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నారు. ఇటీవల ముంబైలో ఆర్థికశాఖమంత్రి మీడియాసమావేశం నిర్వహించేందుకు రెడీ అయిన సమయంలో బీజేపీ ఆఫీస్ బయట పీఎంసీ ఖాతాదారులు ఆందోళనకు దిగడంతో వారితో కొద్దిసేపు చర్చించిన నిర్మలాసీతారామన్ తాను ఈ విషయమై ఆర్బీఐ గవర్నర్ తో మాట్లాడతానని వారికి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.