బీహార్ లో ఒక్క రోజే 83 మంది ప్రాణాలు తీసిన పిడుగులు

బీహార్‌లో ఒకేరోజు  భారీ స్థాయిలో ప్రజలు పిడుగు పాటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. బిహార్‌లో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు ఒక్కరోజులోనే  పిడుగుపాటుకు గురై 83 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు.  ఈ మేరకు రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలోని  వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడిన ఘటనల్లో వీరు మృతి చెందినట్లు తెలిపింది. 

చనిపోయిన వారిలో ఎక్కువ మంది పొలాల్లో పనిచేస్తుండగా ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపింది. బీహార్ ప్రభుత్వం జిల్లాల వారీగా మృతుల వివరాలను ప్రకటించింది. అత్యధికంగా గోపాల్ గంజ్ జిల్లాలో 13 మంది చనిపోయారు. అసమ్​లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు, నవాడా లో 8మంది, మధుబనిలో 8మంది, భాగల్పూర్ లో 6మంది,  ఈస్ట్ చంపారన్ లో 5మంది, భాకా లో 5మంది, సివాన్ లో 6 గురు, దర్భంగా 5మంది సహా మొత్తం 83మంది చనిపోయారు. 

పిడుగుపాటుతో 83మంది మృతి చెందడంపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్​కుమార్ విచారం వ్యక్తం చేశారు. ఒక్కొక్క భాదిత కుటుంబానికి  4లక్షల రూపాయల పరిహారం అందిస్తామని ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా బీహార్ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. బీహార్ మరియు ఉత్తర ప్రదేశ్ లోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షం మరియు మెరుపుల కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న దురదృష్టకర వార్తలను అందుకున్నాం.  రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక చర్యలలో చురుకుగా నిమగ్నమై ఉన్నాయి. మరణించిన వారి కుటుంబాలకు నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను అని ప్రధాని మోడీ ట్వీట్ లో తెలిపారు. 

మరోవైపు బీహార్​లో మరో ఐదురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే ప్రకటించింది వాతావరణ శాఖ. రానున్న  మూడు రోజుల్లో అస్సాం, మేఘాల‌య‌, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్, బిహార్‌, ప‌శ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ఈ మేర‌కు ఆయా రాష్ట్రాల ప్ర‌భుత్వాల‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. లోత‌ట్టు ప్రాంతాలు మునిగిపోయే అవ‌కాశం ఉంద‌ని ఐఎండీ సీనియ‌ర్ శాస్త్ర‌వేత్త ఆర్కె జెన‌మ‌ని అన్నారు. భారీ వ‌ర్ష సూచ‌న నేప‌థ్యంలో ముందుజాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బిహార్ ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్ అధికారుల‌ను ఆదేశించారు.