ప్రభుత్వం ఇచ్చే జీతం సరిపోలేదా? లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన అడిషనల్ కలెక్టర్
భూపాల్ రెడ్డి ఇంట్లో నుంచి పెద్ద ఎత్తున ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

Additional Collector Arrest : ఆయన అడిషనల్ కలెక్టర్. ఉన్నతాధికారి. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన అధికారి. అలాంటి ఆఫీసరే అడ్డదారిలో వెళ్లాడు. ప్రభుత్వం ఇచ్చే జీతం సరిపోలేదో.. మరో కారణమో.. లంచాలకు రుచి మరిగాడు. చివరికి అడ్డంగా దొరికిపోయాడు. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కాడు.
రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. 16 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. భూపాల్ రెడ్డి ఇంట్లో నుంచి పెద్దఎత్తున ఆస్తి పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. భూపాల్ రెడ్డితో పాటు మరొకరిని అరెస్ట్ చేశారు. ధరణిలో మార్పులు చేసేందుకు 8 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు భూపాల్ రెడ్డి. లంచం తీసుకుంటూ ఉండగా అధికారులు పట్టుకున్నారు.
అడిషనల్ కలెక్టర్ తో పాటు సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ధరణిలో నిషేధిత జాబితా నుంచి భూమిని తొలగించేందుకు ఓ రైతు నుంచి వాళ్లు రూ.8లక్షలు డిమాండ్ చేశారు. లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
నిన్న సాయంత్రం లంచం డబ్బులు రూ.8లక్షలు తీసుకుని ఒక ప్లేస్ కు రావాలని రైతుకు సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ చెప్పారు. లంచం డిమాండ్ చేయడంతో ఆ వ్యక్తి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ సమీపంలో సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కాగా, అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి చెబితేనే తాను డబ్బు తీసుకున్నానని మదన్ మోహన్ ఏసీబీ అధికారులతో చెప్పారు.
దాంతో తమ ముందే అడిషనల్ కలెక్టర్ కు మదన్ మోహన్ తో ఫోన్ చేయించారు ఏసీబీ అధికారులు. డబ్బులు తీసుకుని పెద్ద అంబర్ పేట్ ప్రాంతంలోకి రావాలని మదన్ మోహన్ తో అడిషనల్ కలెక్టర్ చెప్పారు. ఆ వెంటనే డబ్బుతో కారులో బయలుదేరాడు మదన్ మోహన్. పెద్ద అంబర్ పేట్ ప్రాంతంలోకి వెళ్లగానే అక్కడే ఉన్న అడిషనల్ కలెక్టర్ ను తన కారులో ఎక్కించుకుని వెళ్తున్న మదన్ మోహన్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.
ఇద్దరి నివాసాలు, కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేశారు. అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి నివాసంలో ఏకంగా రూ.16లక్షల నగదు, బంగారు ఆభరణాలు, ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా ఇద్దరు భారీ అవినీతి తిమింగలాలు ఏసీబీకి చిక్కాయి. ఎంతో నిబద్దతగా డ్యూటీ చేస్తూ ఇతర ఉద్యోగులకు ఆదర్శంగా ఉండాల్సిన ఉన్నతాధికారే ఇలా లంచాలకు రుచి మరగడం శోచనీయం అంటున్నారు ఉద్యోగులు.
లంచం కేసులో ఘట్కేసర్ సబ్‌రిజిస్ట్రార్ సస్పెండ్..
అటు మరో అవినీతి అధికారి సస్పెండ్ అయ్యాడు. లంచం తీసుకున్నట్టు తేలడంతో మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ సబ్ రిజిస్ట్రార్ హనుమంతరావును సస్పెండ్ చేశారు. వారం రోజుల క్రితమే పటాన్ చెరు నుంచి ఘట్ కేసర్ కు బదిలీపై వచ్చారు హన్మంతరావు. 2 రోజులు ఆలస్యంగా విధుల్లో చేరారు.
ఈ నెల 9వ తేదీ వరకు నాలుగు రోజులపాటు విధులు నిర్వహించారు. అదే రోజు ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. ఈ విషయాన్ని రెండు రోజులు గోప్యంగా ఉంచారు. గతంలో పటాన్ చెరు పని చేసినప్పుడు ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకున్న కేసులో విచారణ జరిపిన ఉన్నతాధికారులు.. హన్మంతరావును సస్పెండ్ చేశారు.
Also Read : బీ కేర్ ఫుల్.. దొంగ బాబాలు వస్తున్నారు, మాయ మాటలతో సర్వం దోచేస్తారు..