Afzalgunj Firing Case : అమిత్ కుమార్ ముఠా కోసం పోలీసుల వేట.. బీదర్-అఫ్జల్ గంజ్ కాల్పుల కేసులో కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్..

గతంలో ఈ గ్యాంగ్ ఛత్తీస్ గఢ్ లో ఓ ఏటీఎం దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

Afzalgunj Firing Case : బీదర్-అఫ్జల్ గంజ్ కాల్పుల కేసులో హైదరాబాద్ బీదర్ పోలీసుల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. కాల్పులకు తెగబడిన ఈ ముఠాను బీహార్ గ్యాంగ్ గా గుర్తించారు పోలీసులు. బీదర్ లో దోపిడీకి పక్కా స్కెచ్ వేసి 93 లక్షల రూపాయలు కొట్టేసి ఒకరిని హతం చేశారు దుండగులు. అనంతరం హైదరాబాద్ కు వచ్చింది అమిత్ కుమార్ ముఠా.

హైదరాబాద్ లోని అఫ్జల్ గంజ్ లో రెండు బ్యాగులు కొని కొట్టేసిన డబ్బుతో రాయ్ పూర్ వెళ్లి అక్కడి నుంచి బీహార్ వెళ్లినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో హైదరాబాద్-బీదర్ పోలీసులు కలిసి రాయ్ పూర్, బీహార్ లో అమిత్ కుమార్ ముఠా కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు ఈ ముఠాలో కీలకంగా ఉన్న అమిత్ కుమార్ పలు దోపిడీ కేసుల్లో కీలకంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

బీదర్ లో ఏటీఎం దొంగతనానికి పాల్పడిన దొంగల కోసం హైదరాబాద్ పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఇప్పటికే 10 టీమ్ లను ఏర్పాటు చేసి జల్లెడ పడుతున్నారు. రాత్రి ఘటన జరిగిన తర్వాత హైదరాబాద్ నుంచి దుండగులు పరారీ అయినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇక, ఇవాళ మంగళూరులో ఓ బ్యాంకులో మరో ముఠా దోపిడీకి పాల్పడింది. సుమారు 15 కోట్ల రూపాయల నగదు అపహరించినట్లు తెలుస్తోంది.

Also Read : బాబోయ్.. 30 నిమిషాలు గాల్లోనే తల కిందులుగా.. హైదరాబాద్ నుమాయిష్ లో తప్పిన పెను ముప్పు..

నిన్నటి ఘటన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. నిన్నటి నుంచి సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఇద్దరు దొంగలు తెలంగాణ రాష్ట్రాన్ని విడిచి ఛత్తీస్ గఢ్ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. గతంలో ఈ గ్యాంగ్ ఛత్తీస్ గఢ్ లో ఓ ఏటీఎం దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

దొంగిలించిన డబ్బును భద్రపరించేందుకు అఫ్జల్ గంజ్ లో బ్యాగ్ కొనుగోలు చేసిన దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని హైదరాబాద్ పోలీసులు కనుగొన్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అనేక కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నారు.

 

Also Read : సింగరాయకొండ పాకల బీచ్ లో తీవ్ర విషాదం.. సముద్ర స్నానాలకు వెళ్లి తిరిగి రాని లోకాలకు..