సంచలనం రేపిన రాములోరి రథం దహనం కేసు.. నిప్పు పెట్టింది ఇతడే, ఎందుకో చెప్పిన పోలీసులు..
ఓవైపు తిరుమల లడ్డూ వివాదం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న సమయంలోనే.. రథానికి నిప్పు పెట్టడం తీవ్ర సంచలనంగా మారింది.

Ram Temple Chariot Fire Case : అనంతపురం జిల్లాలో రాముల వారి ఆలయ రథానికి నిప్పు పెట్టిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసుని సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. పురోగతి సాధించారు. 24 గంటల వ్యవధిలోనే మిస్టరీని చేధించారు. రథానికి నిప్పు పెట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అదే గ్రామానికి చెందిన ఈశ్వర్ రెడ్డి రథానికి నిప్పు పెట్టినట్లుగా గుర్తించామని జిల్లా ఎస్పీ జగదీశ్ తెలిపారు. అర్థరాత్రి పెట్రోల్ పోసి రథానికి నిప్పు పెట్టినట్లు తమ విచారణలో ఈశ్వర్ రెడ్డి అంగీకరించినట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ ఘటనలో ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో దర్యాఫ్తు చేస్తున్నామన్నారు పోలీసులు.
ఈ నెల 23న ఆలయ రథానికి అర్థరాత్రి నిప్పు పెట్టడం తీవ్ర కలకలం రేపింది. రథాన్ని ఉంచిన షెడ్డుల్లో మంటలు, పొగ వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు మంటలను ఆర్పివేశారు. కానీ, అప్పటికే రథం మొత్తం మంటల్లో కాలిపోయింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న చంద్రబాబు ప్రభుత్వం.. సమగ్రంగా దర్యాఫ్తు చేయాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించింది. నిందితుడి కోసం ముమ్మరంగా గాలించిన పోలీసులు.. ఇవాళ అరెస్ట్ చేశారు.
అసలేం జరిగిందంటే..
అనంతపురం జిల్లా కనేకల్ మండలం హనకనహాల్ లో రామాలయం ఉంది. కాగా, రాముల వారి రథానికి దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో రథం దగ్దమైంది. ఓవైపు తిరుల లడ్డూ వివాదం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న సమయంలోనే.. రథానికి నిప్పు పెట్టడం తీవ్ర సంచలనంగా మారింది. ఈ ఘటనను సీఎం చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారు. సమగ్ర విచారణకు ఆదేశించారు. సమగ్ర దర్యాఫ్తు చేపట్టి నిందితులను అరెస్ట్ చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
సీఎం చంద్రబాబు ఆదేశాలతో పోలీసులు అలర్ట్ అయ్యారు. కేసుని సీరియస్ గా తీసుకున్నారు. విచారణ చేపట్టి రథానికి నిప్పు కేసులో 24 గంటల్లోనే మిస్టరీని సాల్వ్ చేశారు. రాములోరి రథానికి నిప్పు పెట్టింది అదే గ్రామానికి చెందిన ఈశ్వర్ రెడ్డి గా పోలీసులు గుర్తించారు.
Also Read : తిరుమల లడ్డూ వివాదం.. మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం, కాలినడకన తిరుమలకు..
ఈ కేసు వివరాలను జిల్లా ఎస్పీ జగదీశ్ వెల్లడించారు. ”గ్రామానికి చెందిన ఎర్రిస్వామి రెడ్డి సోదరులు రాముల వారికి రథాన్ని చేయించారు. రూ.20 లక్షలతో రథం చేయించారు. అయితే గ్రామంలో ఎవరి దగ్గరా వారు చందాలు తీసుకోలేదు, ఎవరి సాయమూ తీసుకోలేదు. సొంత డబ్బుతో రథం చేయించారు. దీనిపై వివాదం చెలరేగింది. రథం తయారీలో గ్రామస్తుల సహకారం, చందాలు తీసుకోలేదనే అక్కసుతోనే ఈశ్వర్ రెడ్డి ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. తన బైకు నుంచి పెట్రోల్ తీసుకొచ్చాడు. రథాన్ని షెడ్డులో ఉంచి లాక్ వేశారు. షెడ్డుకున్న లాక్ ని కట్ చేసి పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. ఈ ఘటనలో రాజకీయ కోణం లేదు. మత విద్వేషాలు కూడా లేవు. ఇందులో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా? అనే కోణంలో ఎంక్వైరీ చేస్తున్నాం” అని ఎస్పీ జగదీశ్ తెలిపారు.