Kabaddi Player Killed: ఇటీవల పంజాబ్‌లోని లూథియానాలో ఓ కబడ్డీ ప్లేయర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనం రేపింది. ఆ ప్రాంతాన్ని కుదిపేసింది. వారం రోజుల క్రితం ఈ దారుణం జరిగింది. ఇది మరువకముందే మరో ఘోరం జరిగింది. మరో కబడ్డీ ప్లేయర్ హత్యకు గురయ్యాడు. అతడి పేరు గుర్విందర్ సింగ్. కబడ్డీ ప్లేయర్. సామ్రాలా బ్లాక్‌లో హత్యకు గురయ్యాడు. కాగా, దీనికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించింది. బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన హరి బాక్సర్, అర్జూ బిష్ణోయ్ బాధ్యత వహించారని లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ పేరుతో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు.
బిష్ణోయ్ ముఠా తన శత్రువులకు వార్నింగ్ కూడా ఇచ్చింది. మా శత్రువులతో కలిసి ఉన్న వారందరికీ ఇది ఒక హెచ్చరిక. మీ మార్గాలను సరిదిద్దుకోండి. లేదా మీ ఛాతిని దూసే తదుపరి బుల్లెట్‌కు సిద్ధంగా ఉండండి” అని పోస్ట్‌లో రాశారు. “వెనక్కి తగ్గండి, లేదా మిమ్మల్ని ఎలా తుడిచిపెట్టాలో మాకు తెలుసు.” అని హెచ్చరించారు. పంజాబ్ లో కబడ్డీ ప్లేయర్లు వరుసగా హత్యకు గురవుతున్నారు. 2016 నుండి ఇప్పటివరకు 10మంది మర్డర్ అయ్యారు.
కబడ్డీ మన దృష్టిలో కేవలం ఒక క్రీడ కావొచ్చు.. కానీ, పంజాబ్ లో అలా కాదు. డబ్బుకు, అధికారానికి అదొక చిహ్నంగా మారింది. అంతే.. గ్యాంగ్‌స్టర్లు , మాదకద్రవ్యాల మాఫియా ఈ క్రీడలోకి చొరబడింది. కెనడా, యూకే, ఆస్ట్రేలియాలో దీనికి ఎంతో ఆదరణ లభిస్తోంది. దాంతో చాలా మంది కబడ్డీ ఆటగాళ్ల సంపద పెరుగుతోంది. దాంతోపాటే విదేశీ సంబంధాలు పెరుగుతున్నాయి.
కొన్ని సందర్భాల్లో మాదకద్రవ్యాల వ్యాపారం నుండి వచ్చిన డబ్బు ఈ ఆటల్లో పెట్టుబడి పెట్టినట్లు గుర్తించారు. చాలా మంది ఆటగాళ్ళు స్థానిక నాయకులు, గ్యాంగ్‌స్టర్లతో సంబంధాలు పెంచుకున్నారు. కొందరు వివాదాలలో తలదూర్చారు. ఈ వ్యవహారమే ఆటగాళ్ల ప్రాణాల మీదకు తెస్తోంది. వారిపై దాడులు, హత్యాయత్నాలకు దారితీసింది.
గత వారం.. జాతీయ స్థాయి కబడ్డీ ఆటగాడు తేజ్‌పాల్ సింగ్ (26) ను కొంతమంది వ్యక్తులు కొట్టి, ఛాతిపై కాల్చి చంపారు. అయితే, అతని హత్యకు ఏ ముఠా కూడా బాధ్యత వహించలేదు. ఈ కేసులో ఇద్దరు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పాత వ్యక్తిగత శత్రుత్వమే ఈ హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
Also Read: జమ్ముకశ్మీర్‌లో మళ్లీ కలకలం..! ఆపరేషన్ సిందూర్ 6 నెలల తర్వాత.. ఉగ్రదాడులకు కుట్ర?