ఏవోబీ లో మావోయిస్టు అగ్రనేతల కోసం కూంబింగ్

  • Published By: chvmurthy ,Published On : May 12, 2019 / 08:07 AM IST
ఏవోబీ లో మావోయిస్టు అగ్రనేతల కోసం కూంబింగ్

Updated On : May 12, 2019 / 8:07 AM IST

విశాఖపట్నం: ఏవోబీ లో మావోయిస్టు అగ్రనేతలు కోసం  ఏపీ, ఒడిషా  పోలీసులు సంయుక్తంగా గాలింపు చేస్తున్నారు. గత పదిహేను రోజులుగా మావోయిస్టు అగ్రనేతలు గిరిజనులతో సమావేశలు ఏర్పాటు చేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. మావోయిస్టు అగ్రనేతలు చలపతి, అరుణ, నవీన్‌ లు ఈ ప్రాంతంలోనే మకాం చేసినట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసుల మూడు కంపెనీల బలగాలతో కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఏజెన్సీలోని ప్రతి  ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు.

కొరాపుట్‌ జిల్లా పాడువా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కిటుబ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో స్వాధీనం చేసుకున్న మావోయిస్టుల కిట్‌లో కీలక సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఆపరేషన్ చేపట్టారు. పోలీసుల కూంబింగ్ తో సరిహద్దు గ్రామల ప్రజలు బిక్కుబిక్కు మంటున్నారు. సమావేశాలు నిర్వహించుకుంటున్నామని పోలీసులుకు సమాచారం ఇస్తూ.. మావోయిస్టులు పోలీసులను ట్రాప్ చేసి దాడులు చేస్తున్నారు.

కాగా… సీలేరులో ఇద్దరు హోంగార్డులు మావోయిస్టులకు సహకరిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు..వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విశాఖ మన్యంలో హై అలర్ట్‌ కొనసాగుతోంది. శనివారం సాయంత్రం  రాయగడ కలహండి జిల్లాల సరిహద్దులోని త్రిలోచనపూర్ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ జవాన్లు టార్గెట్ గా మావోయిస్టులు మందు పాతర పేల్చారు. జవాన్లు తృటిలో తప్పించుకున్నారు.