Banks And Registration Offices : మీరు బ్యాంకుల్లో డబ్బులు డ్రా చేస్తున్నారా? రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్ కోసం భారీగా నగదుతో వెళ్తున్నారా? అయితే మీరు అందరికంటే అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే ఘరానా దొంగలు బ్యాంకులు, రిజిస్ట్రేషన్ ఆఫీసులను టార్గెట్ గా చేసుకున్నారు. మీ చుట్టు పక్కలే తిరుగుతూ అనుక్షణం మిమ్మల్ని ఫాలో అవుతూ నగదను అపహరిస్తుంటారు. ఇలాంటి ఘటన ఒకటి గద్వాల జిల్లాలో జరిగింది.
బ్యాంకులు, రిజిస్ట్రేషన్ ఆఫీసుల దగ్గర మాటు వేసి చోరీ చేస్తున్న దొంగల ముఠాలో ఓ సభ్యుడిని గద్వాల టౌన్ పోలీసులు పట్టుకున్నారు. డబ్బులు డ్రా చేసే వారిని ఫాలో అవుతూ, వారిని ఏమార్చి వారి నుంచి నగదును ఎత్తుకెళ్తున్న ప్రసంగి అనే దొంగను అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 3 లక్షల 10వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవంబర్ 7వ తేదీన అలంపూర్ మండలం ఇమామ్ పూర్ గ్రామానికి చెందిన సిద్ధన్న కొడుకు జితేందర్ తో కలిసి ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసేందుకు గద్వాల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకి వచ్చాడు. పని ముగిశాక డబ్బుతో తిరిగి కారులో వెళ్తున్నాడు. మధ్యాహ్నం కావడంతో గద్వాల కలెక్టరేట్ ఎదురుగా ఉన్న భాగ్యలక్ష్మి హోటల్ దగ్గర కారుని నిలిపాడు. భోజనం చేసి తిరిగి వచ్చి చూడగా కారు అద్దాలు పగలగొట్టి అందులో పెట్టిన 3లక్షల 60వేల రూపాయల నగదును ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. దీంతో బాధితుడు గద్వాల టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగల కోసం మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలించారు. ఈ క్రమంలో నవంబర్ 23వ తేదీన ఎర్రవల్లి చౌరస్తాలో ప్రసంగి అనే వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండగా గద్వాల టౌన్ పోలీసులు గమనించి అతడిని పట్టుకున్నారు. తమ దైన స్టైల్ లో పోలీసులు విచారించగా 7వ తేదీన చోరీ చేసిటన్లు అతడు అంగీకరించాడు. నిందితుడు ప్రసంగి నెల్లూరు జిల్లా బిట్రగుంట గ్రామానికి చెందిన వాడని పోలీసులు తెలిపారు.
నెల్లూరు జిల్లాకు చెందిన ప్రసంగితో పాటు మరో ముగ్గురు ముఠాగా ఏర్పడి బ్యాంకులు, రిజిస్ట్రేషన్ కార్యాలయాలే టార్గెట్ గా చోరీ చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. బ్యాంకుల్లో నగదు డ్రా చేసే వారు, రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్ చేయించుకునే వారిని ఫాలో అవుతూ వారిని ఏమార్చి చోరీ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
”బిట్రగుంట గ్యాంగ్ లో నలుగురు లేదా ఐదుగురు సభ్యులు ఉంటారు. వీళ్లలో ఒకరు బ్యాంకులు దగ్గర, రిజిస్ట్రేషన్ ఆఫీసుల దగ్గర రెక్కీ చేస్తారు. రెక్కీ చేసి వాళ్లు ఇచ్చిన సమాచారంతో మిగిలిన నలుగురు లేదా ఐదుగురు వ్యక్తులు బైకుల్లో వస్తారు. బ్యాంకు దగ్గర డ్రా చేసిన అమౌంట్, లేదా రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి తీసిన అమౌంట్ ను ఎక్కడ పెట్టారు, ఏ వెహికల్ లో పెట్టారు.. ఇవన్నీ గమనించి చోరీకి పాల్పడతారు” అని పోలీసులు తెలిపారు.
Also Read : సినిమా స్టంట్ కాదు.. రోడ్డు దాటుతుండగా ఢీకొట్టిన కారు, గాల్లోకి ఎగిరిపడ్డ వృద్ధులు.. వీడియో వైరల్