Cyber Crimes: లాభాల పేరుతో ఘరానా మోసం.. సైబర్ క్రిమినల్స్ మాటలు నమ్మి 13 లక్షలు పొగొట్టుకున్నాడు..

లాభాలను విత్‌డ్రా చేసుకోవడానికి మరికొంత ఇన్వెస్ట్‌ చేయాలని యువకుడిపై ఒత్తిడి తెచ్చారు.

Cyber Crime: సైబర్ నేరాల పట్ల పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా ఇంకా కొందరు మోసపోతూనే ఉన్నారు. ఎంతో తేలిగ్గా సైబర్ నేరాగాళ్ల వలకు చిక్కుతున్నారు. కొందరు అత్యాశతో భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ లో సైబర్ మోసం వెలుగుచూసింది. ఆన్ లైన్ లో లాభాల ఆశ చూపి సైబర్ క్రిమినల్స్ మోసానికి పాల్పడ్డారు. వారి మాటలు నమ్మిన ఓ యువకుడు ఏకంగా 13 లక్షలు పొగొట్టుకున్నాడు.

ఆన్‌లైన్‌లో లాభాల ఆశ చూపి సైబర్‌ నేరగాళ్లు హైదరాబాద్‌లో ఓ యువకుడిని మోసం చేశారు. పలు దఫాలుగా బాధితుడు డబ్బులు పంపాడు. అలా మొత్తం 13 లక్షలు బదిలీ చేశాడు. క్యాసినో యాప్‌ ప్రతినిధి మిస్‌ ఆర్యగా సైబర్‌ నేరగాళ్లు అతడికి పరిచమయ్యారు. నమ్మకం కలిగించేందుకు నకిలీ మిస్‌ ఆర్య పేరిట ఇన్‌స్టాగ్రామ్‌ ఐడీని పంచుకున్నారు. లాభాలను విత్‌డ్రా చేసుకోవడానికి మరికొంత ఇన్వెస్ట్‌ చేయాలని యువకుడిపై ఒత్తిడి తెచ్చారు. వారు చెప్పినట్లు అతడు డబ్బు పంపాడు. అయితే, తాను మోసపోయామని ఇది స్కామ్ అని అతడికి అర్థమైంది. వెంటనే సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

రకరకాల పద్ధతుల్లో సైబర్ క్రిమినల్స్ మోసాలకు పాల్పడుతున్నారు. మరో సైబర్ క్రైమ్ వెలుగులోకి వచ్చింది. ఈసారి సైబర్ నేరగాళ్లు ఆర్టీఏ చలాన్ పేరుతో చీట్ చేశారు. సికింద్రాబాద్‌ కు చెందిన ఓ వ్యక్తికి ఆర్టీఏ చలానా పేరుతో ఏపీకే ఫైల్‌ను పంపారు. దాన్ని ఓపెన్‌ చేయగానే బాధితుడి బ్యాంకు ఖాతా నుంచి రూ.1.72 లక్షలు సైబర్‌ నేరగాళ్లు కాజేశారు. దాంతో బాధితుడు లబోదిబోమన్నాడు.

సైబర్ నేరాల పట్ల పోలీసులు విసృత్తంగా అవగాహన కల్పిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని, అత్యాశకు పోవద్దని హెచ్చరిస్తున్నారు. సైబర్ క్రిమినల్స్ పంపే లింకులు ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయొద్దని చెబుతున్నారు. అలా చేస్తే మీ బ్యాంకు ఖాతా ఖాళీ అవడం ఖాయం అంటున్నారు. ఇలాంటి సైబర్ మోసాలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. అయినప్పటికి కొందరు వారి చేతిలో మోసపోతూనే ఉన్నారు.