మరదలిపై మోజుతో తోడల్లుడి మర్డర్ : హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అరెస్ట్
మానవ సంబంధాలు మంట కలుస్తున్నాయి. ఆస్తి కోసం, డబ్బు కోసం, పదవి కోసం మర్డర్లు జరిగిన ఘటనల గురించి విన్నాము, చూశాము. ఇప్పుడు.. మరో మహిళపై మోజు..

మానవ సంబంధాలు మంట కలుస్తున్నాయి. ఆస్తి కోసం, డబ్బు కోసం, పదవి కోసం మర్డర్లు జరిగిన ఘటనల గురించి విన్నాము, చూశాము. ఇప్పుడు.. మరో మహిళపై మోజు..
మానవ సంబంధాలు మంట కలుస్తున్నాయి. ఆస్తి కోసం, డబ్బు కోసం, పదవి కోసం మర్డర్లు జరిగిన ఘటనల గురించి విన్నాము, చూశాము. ఇప్పుడు.. మరో మహిళపై మోజు.. మనుషులను హంతకులుగా మార్చేస్తోంది. కుటుంబాల్లో తీరని విషాదం నింపుతోంది. తన భార్య చెల్లెలు (మరదలి)పై కన్నేసిన ఓ నీచుడు.. తోడల్లుడిని అతి కిరాతకంగా హత్య చేయించాడు. మరదలిపై మోజుతో ఆ కుటుంబానికి తీరని అన్యాయం చేశాడు. మరదలి ఫ్యామిలీని రోడ్డున పడేయటమే కాకుండా.. తన ఫ్యామిలీని కూడా రోడ్డునపడేశాడు. మరదలిపై కన్నేసిన ఆ నీచుడు.. తోడల్లుడిని చంపించేందుకు ఏడాదిపాటు ప్రయత్నాలు చేశాడు. చివరికి హత్య చేయించాడు. హైదరాబాద్ లో ఉంటూ బెంగళూరులో పనికానిచ్చాడు. రెండు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఈ మర్డర్ కేసులో బెంగళూరు పోలీసులు మిస్టరీని చేధించారు. హైదరాబాద్ కి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను అరెస్ట్ చేశారు. ఇప్పుడీ క్రైమ్ స్టోరీ సంచలనంగా మారింది.
బెంగళూరులో ఫిబ్రవరి తొలి వారంలో జరిగిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ లక్ష్మణ్‌కుమార్ హత్య కేసులో మిస్టరీ వీడింది. లక్ష్మణ్ హత్యకు కారణం పోలీసులు తెలుసుకున్నారు. అంతేకాదు హంతకుడిని కూడా అరెస్ట్ చేశారు. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బెంగళూరు పోలీసులు లక్ష్మణ్ బంధువు, హైదరాబాద్ లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న సత్యప్రసాద్‌ను(41) అరెస్టు చేసి తీసుకెళ్లారు. మరదలిపై కన్నేసిన సత్యప్రసాద్ ఆమెను దక్కించుకోవాలనే ఉద్దేశంతోనే తోడల్లుడిని చంపించినట్లు పోలీసులు నిర్ధారించారు. దీనికోసం హైదరాబాద్ లో నివసిస్తున్న బెంగళూరుకు చెందిన ఓ క్యాబ్ డ్రైవర్‌కు రూ.15 లక్షల సుపారీ ఇచ్చినట్లు బెంగళూరులోని మహదేవ్‌పుర పోలీసులు తెలిపారు. లక్ష్మణ్ ఫొటోలను ఫేస్‌బుక్ నుంచి సేకరించిన సత్య… అతడి లోకేషన్స్‌ను వాట్సాప్ ద్వారా దీపక్‌కు పంపాడని గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి 9మంది నిందితులను అరెస్టు చేశామన్నారు. సత్యప్రసాద్‌ను మంగళవారం(ఫిబ్రవరి 18,2020) రాత్రి హైదరాబాద్‌లో అరెస్టు చేసినట్లు తెలిపారు.
మరదలిపై మోజుపడ్డాడు:
నెల్లూరుకు చెందిన సత్యప్రసాద్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేసేవాడు. 2006లో గుంటూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌తో పెళ్లి జరిగింది. ప్రస్తుతం మాదాపూర్‌లో ఉంటూ వేర్వేరు కంపెనీల్లో పని చేస్తున్నారు. సత్య భార్య సోదరి శ్రీజకు గుంటూరుకు చెందిన లక్ష్మణ్‌కుమార్‌తో 2016లో వివాహం జరిగింది. ఆమె కూడా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావడంతో ప్రస్తుతం భార్యభర్తలు బెంగళూరులో నివాసం ఉంటున్నారు. కొన్నాళ్లుగా శ్రీజపై కన్నేసిన సత్య ఆమెను లోబరుచుకోవాలని భావించాడు. ఈ విషయం మరదలికి కూడా చెప్పని అతను లక్ష్మణ్ కుమార్‌ను హత్య చేస్తే ఆమె తనకు సొంతమవుతుందని భావించాడు. దీంతో పలుమార్లు బెంగళూరు వెళ్లిన సత్య హత్యలు చేసే ముఠాల కోసం ప్రయత్నించాడు. లక్ష్మణ్ ఇల్లు, కార్యాలయానికి సంబంధించిన లోకేషన్స్‌ను తన వాట్సాప్‌లో సేవ్ చేసుకున్నాడు.
క్యాబ్ డ్రైవర్ కి రూ.15లక్షలు సుపారీ:
సుపారీ తీసుకుని రంగంలోకి దిగిన దినేష్(26).. సత్య నుంచి లక్ష్మణ్ పొటో, ఇతర వివరాలను తీసుకున్నాడు. 2019 జూలై 16న బెంగళూరు వెళ్లిన దినేష్.. లక్ష్మణ్‌పై దాడి చేశాడు. మెడపై కత్తితో దాడి చేసినా ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. దీనిపై స్థానిక హెన్నూర్ పోలీస్ స్టేషన్‌లో హత్యాయత్నం కేసు నమోదైంది. ఆ తర్వాత దినేష్ హైదరాబాద్‌కు వచ్చేయడంతో కేసు పెండింగ్‌లోనే ఉండిపోయింది. 2020 ఫిబ్రవరిలో లక్ష్మణ్‌ను ఎట్టి పరిస్థితుల్లో హత్య చేయాల్సిందిగా సత్య ఒత్తిడి చేశాడు. దీంతో దినేష్ తన భార్యతో కలసి జనవరి నెల రెండో వారంలో బెంగళూరు వెళ్లి దేవనహల్లిలోని ఓ లాడ్జిలో బస చేశాడు. మరోసారి ఫేస్‌బుక్ నుంచి లక్ష్మణ్ ఫొటోను డౌన్‌లోడ్ చేసిన సత్య దానిని దినేష్‌కు పంపాడు. అయితే లక్ష్మణ్ తన తోడల్లుడనే విషయాన్ని మాత్రం దినేష్‌కు తెలియకుండా జాగ్రత్తపడ్డాడు.
ఫిబ్రవరి 3న లక్ష్మణ్ హత్య:
బెంగళూరులోని పలు ప్రాంతాలకు చెందిన స్నేహితులు ప్రశాంత్, ప్రేమ్, లోకేష్, కుష్వంత్, సంతోష్, రవిలను దినేష్ తనతో కలుపుకున్నాడు. 2 కార్లు, 4 బైక్‌లతో రంగంలోకి దిగిన ఈ ముఠా జనవరి నెల 30, 31 తేదీల్లో లక్ష్మణ్‌ను హత్య చేసేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఫిబ్రవరి 3న లక్ష్మణ్ ఇంటి దగ్గర కాపుకాసిన ఈ గ్యాంగ్ అతడు ఆఫీస్‌కు బయలుదేరినప్పటి నుంచి వెంబ డించింది. మహదేవ్‌పుర ఫ్లైఓవర్ దగ్గర అతడిని అడ్డగించి కత్తులతో దాడి చేసి హత్య చేశారు. ఈ విషయం తెలుసుకున్న సత్య ఏమీ ఎరుగనట్లు తన భార్యను తీసుకుని బెంగళూరు వెళ్లాడు. లక్ష్మణ్ హత్య కేసుకు సంబంధించి మహదేవ్‌పుర పోలీస్ స్టేషన్ లో నమోదైన ఎఫ్‌ఐఆర్ కాపీని కూడా అతడే తీసుకున్నాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఘటన స్థలంలోని సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా ప్రశాంత్, ప్రేమ్ తదితరులను అరెస్టు చేశారు. విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాలతో రాజేంద్రనగర్‌కు వచ్చి దినేష్, సవిత ను అదుపులోకి తీసుకున్నారు. తనకు సత్య సుపారీ ఇచ్చాడని దినేష్ చెప్పడంతో మంగళవారం రాత్రి మాదాపూర్‌కు వచ్చిన మహదేవ్‌పుర పోలీసులు అతడినీ అరెస్టు చేసి తీసుకువెళ్లారు.
తన తోడల్లుడు అని చెప్పలేదు:
బెంగళూరులోని బోయప్పనహల్లి ప్రాంతానికి చెందిన దినేష్ కొన్నేళ్ల క్రితం సయీదాని ప్రేమించాడు. వీరి పెళ్లికి ఆమె కుటుంబసభ్యులు అంగీకరించకపోవడంతో ఆమెను హైదరాబాద్ తీసుకొచ్చి వివాహం చేసుకున్నాడు. సవితగా ఆమె పేరు మార్చి రాజేంద్రనగర్ బండ్లగూడలోని వికాస్‌నగర్ కాలనీలో ఉంటూ క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం ఇతను సత్యప్రసాద్ పని చేస్తున్న ఆఫీస్ లో విధులు నిర్వర్తించాడు. అప్పట్లో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. దినేష్ గురించి తెలుసుకున్న సత్య తన తోడల్లుడు లక్ష్మణ్‌ను చంపడానికి సుపారీ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. తన శత్రువు ఒకరు బెంగళూరులో ఉంటున్నాడని దినేష్‌తో చెప్పిన సత్య అతడిని హత్య చేస్తే రూ.15 లక్షలు, హైదరాబాద్‌లో ఓ ఫ్లాట్ కొనిస్తానని ఆఫర్ ఇచ్చాడు. ఇందుకు అంగీకరించిన దినేష్ ముందుగా రూ.1.5 లక్షల అడ్వాన్స్ తీసుకున్నాడు.
ఈ కేసు సంచలనం రేపింది. మరదలిపై మోజుతో సత్య ఈ దారుణానికి ఒడిగట్టాడని తెలిసి పోలీసులే కాదు కుటుంబసభ్యులు కూడా షాక్ అయ్యారు. లక్ష్మణ్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. శ్రీజను పెళ్లి చేసుకోవడమే పాపమైందా అని విలపిస్తున్నారు. సత్య భార్య కూడా షాక్ లో ఉంది. తనకు తెలియకుండా తన భర్త సత్య ఇంత దారుణానికి ఒడిగట్టాడా అని విస్తుపోయింది. అటు లక్ష్మణ్ కుటుంబం ఇటు సత్య కుటుంబం..ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. మరదలి కోసం ఇంత దారుణానికి ఒడిగట్టిన సత్య.. చివరికి ఏం సాధించాడో అతడికే తెలియాలి.
Read More>>10 ఏళ్ళ పాటు మరదలి పై లైంగికదాడి చేసిన బావ : Facebook లో నగ్నఫోటోలు