Bihar Hooch Tragedy : బీహార్‌లో కల్తీ మద్యం తాగి 11 మంది మృతి

బీహార్ లో కల్తీ మద్యం తాగి 11 మంది మరణించారు. 12 మంది పరిస్ధితి  విషమంగా ఉంది.

Bihar Hooch Tragedy  :  బీహార్ లో కల్తీ మద్యం తాగి 11 మంది మరణించారు. 12 మంది పరిస్ధితి  విషమంగా ఉంది. వీరిలో చాలామంది కంటి చూపు కోల్పోయినట్లు తెలుస్తోంది.  మకేర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఫుల్వారియా పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల్లో ఈ సంఘటన జరిగింది.  సరన్ జిల్లాలో జరిగిన ఈ సంఘటనకు బాధ్యులైన  వారిని గుర్తించేందుకు మకేర్, మర్హౌరా, భెల్డి పోలీసు స్టేషన్ల పరిధిలో పోలీసులు దాడులు జరుపుతున్నారు.

కల్తీ సారా తయారీ, విక్రయించినందుకు ఇప్పటి వరకు అయిదుగురిని అరెస్ట్‌ చేసినట్లు జిల్లా ఎస్పీ సంతోష్‌ కుమార్‌ తెలిపారు. మొదట కల్తీసారా తాగి ఇద్దరు మరణించినట్లు సమాచారం అందిందని కలెక్టర్ రాజేష్ మీనా తెలిపారు. మకేర్  పోలీసు స్టేషన్ పరిధిలోని  బాధితులంతా ఈనెల 3వ తేదీన శ్రావణ మాసంలో  వచ్చే నాగపంచమి పండుగ సందర్భంగా ఆనవాయతీ ప్రకారం మత్తు పదార్ధాలు తీసుకున్నట్లు  తేలిందని అధికారులు తెలిపారు.

ప్రభుత్వ యంత్రాంగం ఘటనా స్ధలానికి చేరుకుని బాధితులను సదర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్ధితి  విషమంగా ఉన్న వారిని పాట్నాలోని  పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కి తరలించారు.  ఇక్కడ  చికిత్స పొందుతూ 9మంది, ప్రైవేట్ ఆసుపత్రిలో ఒకరు మరణించారు. అంతేగాక అధికారులకీ విషయం తెలియక ముందే ఒకరిని దహనం చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. మరో 12 మంది ఇంకా చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు.

మరోవైపు కల్తీ మద్యం విక్రయాన్ని ముందుగా గుర్తించి నివారణ చర్యలు తీసుకోవడంలో విఫలమైనందుకు స్థానిక పోలీస్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓను సస్పెండ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు.  కాగా నితీష్‌ కుమార్‌ ప్రభుత్వం 2016లో బీహార్‌లో మద్యాన్ని నిషేధించింది. అయితే 2021 నవంబర్‌ నుంచి జరుగుతున్న కల్తీ మద్యం ఘటనల్లో సుమారు 50 మందికి పైగా చనిపోయారు.

Also Read : Perfumed Silk Saree : 27 రకాల సుగంధ పరిమళాలు వెదజల్లే పట్టు చీర

 

ట్రెండింగ్ వార్తలు