కిడ్నాప్ స్టోరీ.. తల్లి అరెస్ట్ : మ్యాన్ హోల్‌లో 2 నెలల పసికందు మృతదేహం

కోల్ కతాలోని బెలియఘాటాలో రెండు నెలల పసికందు మృతదేహం కలకలం రేపింది. కొన్ని రోజుల క్రితం రెండు నెలల ఆడశిశువు అదృశ్యమైంది. తన బిడ్డ కనిపించడం లేదంటూ ఎవరో కిడ్నాప్ చేశారంటూ తల్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ విచారణలో అసలు నిజం తెలియడంతో పోలీసులే షాక్ అయ్యారు. ఆడ శిశువును చంపేసి తల్లే మ్యాన్ హోల్లో పడేసిందని పోలీసులు విచారణలో నిర్ధారించారు. దీంతో తల్లిని అరెస్ట్ చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టారు. ప్రసవనంతరం కలిగే సమస్యతో బాధపడుతున్న మహిళ తన బిడ్డను తానే చంపేసినట్టు కోల్ కతా పోలీసు సీనియర్ అధికారి తెలిపారు.
ఎవరో గుర్తు తెలియని వ్యక్తి మధ్యాహ్నా సమయంలో ఇంట్లోకి ప్రవేశించి తనను కొట్టి తన బిడ్డను కిడ్నాప్ చేసి తీసుకెళ్లినట్టు నిందితురాలు కట్టు కథ అల్లింది. ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు నిందితురాలు ఉండే ప్లాట్ సెక్యూరిటీ గార్డుతో పాటు బేబీసిట్టర్, తల్లిని కూడా ప్రశ్నించారు.
ఇందులో చిన్నారి తల్లి చెప్పిన పొంతన లేని సమాధానాలపై పోలీసులకు అనుమానం వచ్చింది. కొన్నిగంటల పాటు విచారించిన అనంతరం మానసిక సమస్య బాధపడుతున్న నిందితురాలు తన బిడ్డను తానే చంపేసినట్టు అంగీకరించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తల్లిని అరెస్ట్ చేసినట్టు IPS అధికారి తెలిపారు.