బాబోయ్.. తల్లికి వైద్యం సరిగా చేయలేదని కత్తితో డాక్టర్‌పై దాడి..!

ఇప్పుడు ఈ దాడితో వైద్యుల భద్రతపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది.

Chennai Doctor Stabbed (Photo Credit : Google)

Doctor Stabbed In Chennai : తన తల్లికి సరిగా వైద్యం అందించలేదన్న కోపంతో ఓ యువకుడు రెచ్చిపోయాడు. ఏకంగా డాక్టర్ పైనే దాడికి పాల్పడ్డాడు. పలుమార్లు పొడిచి తీవ్రంగా గాయపరిచాడు. ఈ సంచలన ఘటన తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది.

అంకాలజీ విభాగంలో పని చేస్తున్న బాలాజీ జగన్నాథన్ అనే వైద్యుడిపై ఈ దాడి జరిగింది. నిందితుడు పేషెంట్ లా వచ్చి డాక్టర్ ను కత్తితో పొడిచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. మిగతా వైద్య సిబ్బంది అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడి తల్లి ఈ ఆసుపత్రిలో క్యాన్సర్ చికిత్స తీసుకుంది. అయినా ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగపడలేదు. దీంతో చికిత్స అందించిన డాక్టర్ బాలాజీపై మహిళ కొడుకు కక్ష పెంచుకుని దాడికి పాల్పడ్డాడు.

తీవ్రంగా గాయపడిన డాక్టర్ పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి డైరెక్టర్ తెలిపారు. ఈ దాడిని డాక్టర్లు తీవ్రంగా ఖండించారు. దీనిపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ దాడిని తీవ్రంగా ఖండించిన ఆయన విచారణకు ఆదేశించారు. సమయంతో సంబంధం లేకుండా సేవలు అందిస్తున్న డాక్టర్ల కృషి ఎనలేనిదని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం అవకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

కొద్ది నెలల క్రితం కోల్ కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ పై జరిగిన హత్యాచార ఘటన.. దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇప్పుడు ఈ దాడితో వైద్యుల భద్రతపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది.

దాడికి పాల్పడ్డ యువకుడి పేరు విఘ్నేశ్. అతడి తల్లి క్యాన్సర్ తో బాధపడుతోంది. చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. డాక్టర్ బాలాజీ ఆమెకు ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. అయితే, డాక్టర్ బాలాజీ తన తల్లికి సరిగా వైద్యం అందించలేదని, తప్పుడు మందులు రాసి ఉంటాడని అనే అనుమానం పెంచుకున్న విఘ్నేశ్.. ఈ దారుణానికి ఒడిగట్టాడు.

దాడిలో తీవ్రంగా గాయపడ్డ డాక్టర్ బాలాజీకి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఆయనకు పేస్ మేకర్ అమర్చారు. నుదిటి, వీపు, చెవి వెనుక, పొట్టపై గాయాలయ్యాయి. ఈ ఘటనతో తోటి డాక్టర్లు, ఆసుపత్రిలో పని చేసే సిబ్బంది షాక్ కి గురయ్యారు. తమ భద్రత గురించి వారంతా ఆందోళన చెందుతున్నారు. తమకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇలా అయితే తాము డ్యూటీ చేయలేమని వాపోతున్నారు.

 

Also Read : 300 రోజుల్లో 160 బెదిరింపులు.. భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్న ఢిల్లీ వ్యాపారులు..