300 రోజుల్లో 160 బెదిరింపులు.. భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్న ఢిల్లీ వ్యాపారులు..

ఇలా బెదిరింపులకు పాల్పడే వారిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

300 రోజుల్లో 160 బెదిరింపులు.. భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్న ఢిల్లీ వ్యాపారులు..

Gangsters Target Businessmen (Photo Credit : Google)

Updated On : November 13, 2024 / 5:21 PM IST

Gangsters Target Businessmen : దేశ రాజధాని ఢిల్లీలో గ్యాంగ్ స్టర్లు రెచ్చిపోతున్నారు. బడా వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని విదేశాల్లోని గ్యాంగ్ స్టర్లు, వారి అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. బిల్డర్లు, స్థిరాస్థి వ్యాపారులు, నగలు, మిఠాయి దుకాణాలు, కార్ల షోరూమ్ యజమానులే లక్ష్యంగా ఈ బెదిరింపులు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ నాటికి.. అంటే..300 రోజుల్లో వీరికి 160 సార్లు బెదిరింపులు అందాయని పోలీసులు
వెల్లడించారు.

ఇక్కడితో ఆగకుండా దుండగులు.. వ్యాపారుల కార్యాలయాలు, ఇళ్లపైన కాల్పులకు పాల్పడుతున్నారు. దీంతో వ్యాపారులు భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని అధికారులు పేర్కొన్నారు. ఇటీవల రోహిణి ప్రాంతంలోని ఓ వ్యాపారికి చెందిన షోరూమ్ లోకి చొరబడిన ముగ్గురు దుండగులు గాల్లోకి కాల్పులు జరుపుతూ బెదిరింపులకు తెగబెడ్డారు. ఓ జిమ్ యజమాని నుంచి రూ.7 కోట్లు డిమాండ్ చేస్తూ అంతర్జాతీయ నెంబర్ నుంచి ఫోన్లు వస్తున్నాయని తెలిపారు.

ఇలా బెదిరింపులకు పాల్పడే వారిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటివరకు 11 ముఠాలను గుర్తించామన్నారు. వీటిలో లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్, హిమాన్షు, కపిల్ సాంగ్వాన్ అలియాస్ నందు వంటి గ్యాంగులు ఉన్నాయని తెలిపారు.

Also Read : ఖలీస్తానీలు హిందూ ఆలయాలనే ఎందుకు టార్గెట్‌ చేశారు?

”ఢిల్లీలోని వ్యాపారవేత్తలకు ఈ ఏడాది అక్టోబర్ వరకు దాదాపు 160 బెదిరింపు కాల్స్ వచ్చాయి. అంటే.. సగటున ప్రతి రోజు ఒక కాల్‌ వచ్చింది. దీంతో వ్యాపారులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఈ కాల్స్‌లో ఎక్కువ భాగం వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ లేదా అంతర్జాతీయ ఫోన్ నెంబర్లను ఉపయోగించి విదేశీ గ్యాంగ్‌స్టర్లు, వారి అనుచరుల నుండి వచ్చాయి” అని పోలీసు వర్గాలు తెలిపాయి.

”నగరంలోని బిల్డర్లు, ప్రాపర్టీ డీలర్లు, నగల వ్యాపారులు, స్వీట్ షాప్‌లు, కార్ షోరూమ్‌ల యజమానులకు ఎక్కువగా బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ ఏడాది అక్టోబర్‌ వరకు (సుమారు 300 రోజులు) వ్యాపారవేత్తలకు దాదాపు 160 బెదిరింపు కాల్స్ వచ్చాయి. కొన్ని సందర్భాల్లో వ్యాపారుల కార్యాలయాలు, ఇళ్ల బయట కాల్పులకు తెగబడ్డారు. గత వారం కేవలం నాలుగు రోజుల్లో ఇలాంటివి ఏడు కేసులు నమోదయ్యాయి. నగల వ్యాపారి, జిమ్ యజమాని, ప్రాపర్టీ డీలర్, స్వీట్ షాప్ యజమాని, మోటార్ వర్క్‌షాప్ యజమాని ఇతరులను గ్యాంగ్ స్టర్లు లక్ష్యంగా చేసుకున్నారు. నవంబర్ 5 న రోహిణి ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు షోరూమ్‌లోకి ప్రవేశించి గాలిలోకి కాల్పులు జరిపారు. గ్యాంగ్‌స్టర్ల పేర్లు రాసి ఉన్న నోట్‌ను వదిలివెళ్లారు. 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు.

నవంబర్ 7న నంగ్లోయ్‌లోని జిమ్ యజమాని నుంచి రూ.7 కోట్లు డిమాండ్ చేస్తూ అంతర్జాతీయ నెంబర్ ద్వారా కాల్ వచ్చింది. లారెన్స్ బిష్ణోయ్ సహచరుడు, జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ దీపక్ బాక్సర్‌తో తనకు సంబంధం ఉందని కాల్ చేసిన వ్యక్తి పేర్కొన్నాడు. మొత్తం ఏడు కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశాం. ప్రత్యేక సెల్‌, క్రైమ్‌ బ్రాంచ్‌ల ప్రత్యేక బృందాలు నిందితులను పట్టుకునేందుకు పని చేస్తున్నాయి” అని పోలీసు వర్గాలు తెలిపాయి.

ఢిల్లీ పోలీసుల గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది ఆగస్టు 15 వరకు దేశ రాజధాని అంతటా మొత్తం 133 బెదిరింపు కాల్స్ కేసులు నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలంలో మొత్తం 141 కేసులు నమోదయ్యాయి. 2022 నాటికి ఈ సంఖ్య 110. 2023లో 204, 2022లో 187 బెదిరింపు కాల్స్‌కు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. కాల్ చేసే వారు ఎక్కువగా VOIP నెంబర్లు లేదా నకిలీ సిమ్ కార్డులపై తీసుకున్న వాట్సాప్ నెంబర్లు ఉపయోగిస్తున్నారని పోలీసులు వెల్లడించారు.