ఢిల్లీ ఓల్డ్ రాజేంద్రనగర్‌లో వెలుగు చూసిన మరో విషాదం.. పాపం ఆ యువతి..

అమ్మానాన్న నన్ను మన్నించండి. నేను చాలా విసిగిపోయాను. అక్కడ అన్నీ సమస్యలే ఉన్నాయి. ఈ సోకాల్డ్ డిప్రెషన్ నుంచి బయటపడేందుకు సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేశాను.

Civil services aspirant: ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్రనగర్‌లో ముగ్గురు యూపీఎస్సీ అభ్యర్థుల మృత్యోదంతం మరకముందే అదే ప్రాంతంలో మరో విషాద ఘటన వెలుగు చూసింది. చదువుల ఒత్తిడి తట్టుకోలేక మహారాష్ట్రకు చెందిన ఓ విద్యార్థిని ప్రాణాలు తీసుకుంది. రావూస్ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్‌లో వరదల కారణంగా ముగ్గురు మరణించిన కొద్ది రోజులకు ముందు ఈ సంఘటన జరిగింది. చివరిసారిగా ఆమె రాసిన తాజాగా బహిర్గతమైంది. సివిల్స్ కోచింగ్ లో తాను అనుభవించిన తీవ్రమైన మానసిక భావోద్వేగ ఒత్తిడి గురించి తన లెటర్‌లో రాసింది. ప్రైవేట్ హాస్టల్స్, పెయింగ్ గెస్ట్ వసతిగృహాల నిర్వాహకుల దోపిడీ ఎలా ఉంటుందనేది వివరించింది.

పదేపదే ప్రయత్నించినా సివిల్స్ క్లియర్ చేయలేదన్న బాధను తన లేఖలో వ్యక్తం చేసింది. ఒత్తిడిని అధిగమించేందుకు ఎంత ప్రయత్నించినా తన వల్లకాలేదని వాపోయింది. ”అమ్మానాన్న నన్ను మన్నించండి. నేను చాలా విసిగిపోయాను. అక్కడ అన్నీ సమస్యలే ఉన్నాయి. మనసుకు శాంతి లేదు. నేను ఈ సోకాల్డ్ డిప్రెషన్ నుంచి బయటపడేందుకు సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేశాను. కానీ అధిగమించలేకపోయాన”ని తన చివరి లెటర్‌లో ఎంతో బాధను వ్యక్తం చేసింది.

బలవన్మరణానికి పాల్పడిన యువతి మూడుసార్లు ప్రయత్నించినా సివిల్స్ క్లియర్ చేయలేకపోయాననే బాధపడుతూ ఉండేదని ఆమె ఫ్రెండ్ శ్వేత.. మీడియాతో చెప్పారు. పరీక్షల్లో విజయం సాధించకపోవడం, ఆర్థికపరమైన ఇబ్బందులతో తీవ్ర ఒత్తిడికి గురయిందని తెలిపారు. ఓల్డ్ రాజేంద్రనగర్‌లో ఇంటి అద్దెలు ఎక్కువగా ఉండడంతో తమపై ఆర్థిక భారం పెరుగుతోందని ఆమె వెల్లడించారు.

Also Read : అందమైన అమ్మాయిలతో వాట్సాప్ వీడియో కాల్స్.. రూట్ మార్చిన సైబర్ నేరగాళ్లు

కాగా, ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని ఢిల్లీ పోలీసులు ధృవీకరించారు. ఈ విషాద సంఘటనకు దారితీసిన పరిస్థితులను పరిశీలిస్తున్నామని, పూర్తి వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. పోటీ పరీక్షల వాతావరణంలో విద్యార్థులు తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. ఒత్తిడి తట్టుకోలేక ఎంతో మంది విద్యార్థులు తమ జీవితాలను మధ్యలోనే ముగిస్తున్నారు. అయితే దేశంలో ఇటువంటి ఘటనలు పెరుగుతుండడం పట్ల అన్ని వర్గాల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది.

Also Read : వీడిని ఏం చేసినా పాపం లేదు.. రైల్వే ట్రాక్‌పై గ్యాస్ సిలిండర్, రాళ్లు పెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటం

ట్రెండింగ్ వార్తలు