Cyber Crime : ఏపీలో రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు.. డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరింపులు..

దీని ప్రకారం మూడు నుంచి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష.. లేక 5 లక్షల జరిమానా విధిస్తామంటూ భయపెట్టాడు.

Cyber Crimes (Photo Credit : Google)

Cyber Crime : సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త ఎత్తులతో ప్రజలను మోసం చేస్తున్నారు. పోలీసులు సైబర్ నేరాలపై ఎంత అవగాహన కల్పిస్తున్నా.. బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఓవైపు ఉద్యోగాలు, బహుమతులు అనే ఆశ చూపిస్తూ.. మరోవైపు ప్రముఖు వ్యక్తుల సామాజిక మాధ్యమాల ఖాతాల డీపీలు ఉపయోగించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా సైబర్ క్రిమినల్స్ రూటు మార్చారు. ఇటీవలి కాలంలో డిజిటల్ అరెస్టుల పేరుతో బెదిరిస్తూ సైబర్ కేటుగాళ్లు సరికొత్త పంధాలో దోచుకుంటున్నారు.

విజయవాడలో ఈ తరహా కేసులో వెలుగులోకి వచ్చాయి. డిజిటల్ అరెస్ట్ పేరుతో వేర్వేరు వ్యక్తులకు ఫోన్లు చేసి బెదిరించారు. కానీ, వారు చాక్యచక్యంగా వ్యవహరించి బయటపడ్డారు. సైబర్ నేరస్తులు నగరానికి చెందిన ఓ మహిళకు ఫోన్ చేశారు. తనను తాను సీబీఐ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. ముంబైకి చెందిన మనీలాండరింగ్ ముఠాతో మీ అమ్మాయికి సంబంధాలు ఉన్నాయని చెప్పాడు. ఆమె పేరు, ఆధార్ నెంబర్ తో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా లెటర్ హెడ్ పై కొన్ని సెక్షన్లు ఉటంకిస్తూ అరెస్ట్ వారెంట్ చూపించాడు.

దీని ప్రకారం మూడు నుంచి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష.. లేక 5 లక్షల జరిమానా విధిస్తామంటూ భయపెట్టాడు. బాధితురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. డిజిటల్ అరెస్ట్, పోలీసులం అంటూ ఫోన్ కాల్ చేస్తే ఎవరూ భయపడొద్దని విజయవాడ పోలీసులు సూచించారు. కాల్ కట్ చేసి వెంటనే ఫోన్ స్విచ్చాఫ్ చేయాలని చెప్పారు. ఆ తర్వాత సమీపంలోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి సమాచారం అందించాలని పోలీసులు చెప్పారు.

 

Also Read : పోలీసులను టచ్ చేసినా వదిలేది లేదు- బౌన్సర్లకు సీపీ సీవీ ఆనంద్ సీరియస్ వార్నింగ్