Dawood Ibrahim : అండర్ వరల్డ్ గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం.. ఆసుపత్రిలో చేరిక

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తీవ్ర ఆరోగ్య సమస్యల కారణంగా కరాచీలోని ఆసుపత్రిలో చేరారా అంటే అవునంటున్నాయి పాకిస్థాన్ వర్గాలు. దావూద్ ఇబ్రహీం తీవ్ర అనారోగ్య సమస్యలతో పాకిస్థాన్‌లోని కరాచీలోని ఆసుపత్రిలో చేరినట్లు సోమవారం పాక్ వర్గాలు తెలిపాయి....

Dawood Ibrahim

Dawood Ibrahim : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తీవ్ర ఆరోగ్య సమస్యల కారణంగా కరాచీలోని ఆసుపత్రిలో చేరారా అంటే అవునంటున్నాయి పాకిస్థాన్ వర్గాలు. దావూద్ ఇబ్రహీం తీవ్ర అనారోగ్య సమస్యలతో పాకిస్థాన్‌లోని కరాచీలోని ఆసుపత్రిలో చేరినట్లు సోమవారం పాక్ వర్గాలు తెలిపాయి. దావూద్ కు అతని సన్నిహితులే విషప్రయోగం చేశారని, దీంతో అతను అస్వస్థతకు గురయ్యాడని అంటున్నారు. దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం జరిగినట్లు వచ్చిన వార్తలు నిర్ధారణ కాలేదు.

ముంబయి పేలుళ్లలో దావూద్ కీలక పాత్ర

సోమవారం నాటికి రెండు రోజులుగా దావూద్ కరాచీ నగరంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సమాచారం. 1993వ సంవత్సరంలో ముంబయిలో జరిగిన పేలుళ్లలో దావూద్ కీలక పాత్ర పోషించాడని కేసు పెండింగులో ఉంది. దావూద్ ఇబ్రహీంను గట్టి భద్రత మధ్య ఆసుపత్రిలో ఉంచినట్లు ఆసుపత్రి అధికారులు చెప్పారు. దావూద్ సన్నిహిత కుటుంబసభ్యులు, ఆసుపత్రి వైద్యాధికారులకు మాత్రమే ఆసుపత్రిలోని అతని గదిలోకి ప్రవేశం కల్పించారు.

ముంబయి పోలీసుల ఆరా 

ముంబయి పోలీసులు అండర్ వరల్డ్ డాన్ ఆసుపత్రిలో చేరడంపై అతని బంధువులు అలీషా పార్కర్ , సాజిద్ వాగ్లే నుంచి మరింత సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ రెండో పెళ్లి చేసుకున్న తర్వాత కరాచీలో ఉంటున్నాడని జనవరి నెలలో దావూద్ సోదరి హసీనా పార్కర్ కుమారుడు నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి వెల్లడించారు. కాగా దావూద్ క్షేమంగా ఉన్నాడని, కరాచీలోని అతని సురక్షిత గృహంలో నివసిస్తున్నాడని అతని సన్నిహితులు పేర్కొన్నారు.

ALSO READ : COVID-19 sub variant JN.1 : కొవిడ్ కొత్త సబ్ వేరియంట్ జేఎన్ 1 వ్యాప్తి…కర్ణాటకలో హైఅలర్ట్

దావూద్ సహచరులు, మద్దతుదారులలో భయాందోళనలు, గందరగోళాన్ని సృష్టించడానికి దావూద్ ఆరోగ్యంపై భారతదేశం తప్పుడు పుకార్లను వ్యాప్తి చేసిందని వారు ఆరోపించారు. దావూద్ ఇబ్రహీం ప్రపంచంలోని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులలో ఒకడు. ఇతను 250 మందికి పైగా మరణించిన, వేలాది మంది గాయపడిన 1993 ముంబై పేలుళ్లకు సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. దావూద్ మాదకద్రవ్యాల అక్రమ రవాణా, మనీలాండరింగ్, దోపిడీ,ఆయుధాల స్మగ్లింగ్ వంటి అనేక ఇతర నేర కార్యకలాపాలలో కూడా పాల్గొన్నట్లు భావిస్తున్నారు.

ALSO READ : Union Minister Giriraj Singh : హిందువులు ఝట్కా మాంసాన్ని మాత్రమే తినాలి…కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు

ఇతనికి పాక్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ ఐఎస్‌ఐ, ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో సన్నిహిత సంబంధాలున్నట్లు సమాచారం. దావూద్‌ను పాకిస్తాన్ నుంచి అప్పగించాలని భారతదేశం దశాబ్దాలుగా డిమాండ్ చేస్తోంది. పాకిస్తాన్‌లో దావూద్ ఉనికి, కార్యకలాపాలకు సంబంధించిన అనేక ఆధారాలను భారత్ పాకిస్థాన్ దేశానికి అందించింది.

దావూద్ తలపై 25 మిలియన్ డాలర్ల బహుమతి

అయితే, దావూద్‌కు ఆశ్రయం కల్పించడాన్ని పాకిస్తాన్ ఖండించింది. దావూద్ తమ భూభాగంలో లేడని పేర్కొంది. దావూద్ తలపై భారతదేశం 25 మిలియన్ డాలర్ల బహుమతిని కూడా ప్రకటించింది. దావూద్ ఇబ్రహీంను అప్పగించేలా పాకిస్తాన్‌పై ఒత్తిడి తేవాలని అంతర్జాతీయ సమాజాన్ని భారత్ కోరింది.