జేఎన్‌యూ విద్యార్ధులపై లాఠీచార్జ్

హాస్టల్ ఫీజు పెంచడాన్ని నిరసిస్తూ ఢిల్లీలోని జేఎన్యూ విద్యార్ధులు గత నెల రోజులుగా చేస్తున్నఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఫీజుల పెంపును నిరసిస్తూ డిసెంబర్ 9, సోమవారం రాష్ట్రపతి భవన్‌కు ర్యాలీగా బయలు దేరిన విద్యార్ధులను పోలీసులు చెదరగొట్టారు. తమ సమస్యలను రాష్ట్రపతికి విన్నవించేందుకు ప్రదర్శనగా వెళుతున్న విద్యార్ధులను పోలీసులు అడ్డుకున్నారు.
బికాజీ కామాప్యాలెస్ మెట్రో స్టేషన్ వద్ద ఆందోళనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. కాగా….ఆందోళనకారులు బికాజి కామా ప్యాలెస్ మెట్రో స్టేషన్ వద్ద బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వచ్చేందుకు ప్రయత్నించగా వారిపై లాఠీచార్జి చేశామని పోలీసులు తెలిపారు.
శాంతియుతంగా రాష్ట్రపతి భవన్‌కు ప్రదర్శనగా వెళుతున్న తమపై ఖాకీలు జులుం ప్రదర్శించారని, లాఠీచార్జ్‌తో విరుచుకుపడ్డారని విద్యార్ధులు ఆరోపించారు. హాస్టల్ ఫీజులు పెంచినందుకు గత నెల రోజుల నుంచి జేఎన్ యూ విద్యార్థులు ధర్నా చేస్తున్నారు. పెంచిన ధరలను వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు రాష్ట్రపతి రామ్‌నాథ్‌కు లేఖ కూడా రాశారు. విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు.
#WATCH: Police resorted to lathicharge after a clash with protesting Jawaharlal Nehru University (JNU) students, who were marching towards Rashtrapati Bhawan to meet President over fee hike issue. pic.twitter.com/sAbuN05n2q
— ANI (@ANI) December 9, 2019